Tata group: కాస్మోటిక్స్‌ మార్కెట్‌లోకి టాటాల ఎంట్రీ.. అంతర్జాతీయ బ్రాండ్లతో చర్చలు!

స్టీల్‌, ఆటోమొబైల్‌.. ఇలా అన్ని రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్‌ ఇప్పుడు కాస్మోటిక్స్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 

Published : 16 Nov 2022 20:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టీల్‌, ఆటోమొబైల్‌.. ఇలా అన్ని రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్‌ (Tata group) ఇప్పుడు కాస్మోటిక్స్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.  ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ‘బ్యూటీ టెక్‌’ పేరిట 20 స్టోర్లు తెరవాలని చూస్తోంది. సంపన్నవర్గాలే లక్ష్యంగా ఈ స్టోర్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ స్టోర్లలో విదేశాలకు చెందిన ప్రీమియం కాస్మోటిక్స్‌ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. దీంతో పాటు వర్చువల్‌ మేకప్‌ కియోస్క్‌, డిజిటల్‌ స్కిన్‌ టెస్ట్‌ వంటివి అందుబాటులోకి తీసుకురానున్నారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

దేశంలో ప్రస్తుతం సౌందర్య ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ బ్రాండ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య  వృద్ధి చెందుతోంది.  నైకా వంటి దేశీయ కంపెనీలతో పాటు, బెర్నాల్డ్‌ ఆర్నాల్డ్‌ LVMH కు చెందిన సెఫోరా వంటి కంపెనీలు మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి.  ఈ క్రమంలో వాటికి పోటీ ఇచ్చేందుకు టాటాలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పలు విదేశీ కంపెనీలతో ఆ గ్రూప్‌ చర్చలు జరుపుతోందని తెలిసింది. వారి ఎక్స్‌క్లూజివ్‌ ఉత్పత్తులను తమ స్టోర్లలో విక్రయించేందుకు సుమారు  20కి పైగా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్టోర్ల ప్రారంభించే అంశం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలుస్తోంది. గ్లోబల్‌ బ్రాండ్స్‌తో కలిసి ఇప్పటికే జరా, స్టార్‌బక్స్‌ వంటి జాయింట్ వెంచర్లను టాటా గ్రూప్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  మరోవైపు టాటా గ్రూప్‌  ఇటీవలే ‘టాటా క్లిక్‌ పెల్లెట్‌’ పేరిట ఓ బ్యూటీ యాప్‌ను తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు