పిల్లల చదువుతో పన్ను ఆదా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను మినహాయింపు కోసం అవసరమైన పెట్టుబడులను పెట్టేందుకు చివరి తేదీ మార్చి 31.

Published : 27 Jan 2023 00:08 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను మినహాయింపు కోసం అవసరమైన పెట్టుబడులను పెట్టేందుకు చివరి తేదీ మార్చి 31. ఇప్పటికే పన్ను మినహాయింపులకు సంబంధించిన అన్ని పత్రాలనూ కార్యాలయంలో అందించి ఉంటారు. ఒకసారి అవన్నీ సరిగ్గా ఉన్నాయా.. పూర్తి పన్ను మినహాయింపులు లభిస్తున్నాయా లేదా చూసుకోండి. ఇక పెట్టుబడులతోపాటు కొన్ని ఖర్చులనూ పన్ను కోసం క్లెయిం చేసుకునే వీలుంది. అందులో పిల్లల ట్యూషన్‌ ఫీజలు ఒకటి. గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో చదువు కోసం చెల్లించిన ఫీజులను ఇందుకోసం చూపించుకోవచ్చు. గరిష్ఠంగా ఇద్దరి పిల్లలకు ఇది వర్తిస్తుంది. సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు రూ.1,50,000 వరకూ ఈ మినహాయింపు పొందవచ్చు. ప్రతి పన్ను చెల్లింపుదారుడికీ ఈ వెసులుబాటు ఉంటుంది. విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకు చెల్లించే ఫీజులకు ఇది వర్తించదు.

* పిల్లల కోసం యాజమాన్యం ఏదైనా ప్రత్యేక భత్యాలు (అలవెన్స్‌) ఇచ్చినప్పుడు పరిమితుల మేరకు మినహాయింపు లభిస్తుంది. చదువు కోసం ఇచ్చే భత్యానికి ఏడాదికి రూ.1,200, హాస్టల్‌ కోసం ఇచ్చే భత్యం రూ.3,600 వరకూ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 10 కింద క్లెయిం చేసుకునే వీలుంటుంది. అలెవెన్సులు... ట్యూషన్‌ ఫీజులు ఈ రెండూ వేర్వేరని ఇక్కడ గమనించాలి.


విద్యారుణం తీసుకుంటే..

పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న విద్యా రుణానికి చెల్లించే వడ్డీకి సెక్షన్‌ ‘80ఈ’ ప్రకారం పూర్తి మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. మన దేశంలో లేదా విదేశాల్లో చదువుకునేందుకు రుణం తీసుకున్నా ఈ మినహాయింపు లభిస్తుంది. వడ్డీ చెల్లించడం ప్రారంభించిన తర్వాత ఎనిమిదేళ్లపాటు ఇది వర్తిస్తుంది. పన్ను చెల్లింపుదారుడు సొంత చదువు కోసం, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం విద్యారుణం తీసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు