ఇల్లు కొంటున్నారా? మ‌రి ప‌న్ను గురించి తెలుసుకోండి

మొత్తం ఆస్తి వ్యయాన్ని విస్తృతంగా రెండు విభాగాలుగా విభ‌జించొచ్చు. ఒక‌టి, బిల్డర్ లేదా విక్రేతకు చెల్లించేది. రెండు, ప్రభుత్వానికి చెల్లించే చట్టపరమైన ఖర్చులు.  

Published : 18 Dec 2020 13:23 IST

ఇంటిని కొనుగోలు చేసేందుకు చూస్తున్నలేదా ఇప్పటికే ఆస్తిపై పెట్టుబడి పెట్టినా, వివిధ సందర్భాలలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల‌ గురించి తెలుసుకోవాలి. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రాక‌తో గతంలో వర్తించే అన్ని పన్నులు విలువ-జోడించిన పన్ను (వ్యాట్), సేవా పన్ను వంటివి ఒకేపన్ను వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. మొత్తం ఆస్తి వ్యయాలు విస్తృతంగా రెండు విభాగాలుగా విభ‌జించొచ్చు. ఒక‌టి, బిల్డర్ లేదా విక్రేతకు చెల్లించేది. రెండు, ప్రభుత్వానికి చెల్లించే చట్టపరమైన ఖర్చులు. ఆస్తి ధ‌ర మొత్తం వ్య‌యంలో 80-85%, మిగిలిన 15-20% ప్రభుత్వానికి చెల్లించే పన్నులుగా ఉండొచ్చు. నిర్మాణం పూర్త‌యిన వాటికి, నిర్మాణంలో ఉన్నవాటికీ ఒకే విధంగా పన్నుఉంటుందా? అంటే కాదు.

నిర్మాణంలో ఉండే ఇళ్ల‌పై ప‌న్ను:
నిర్మాణంలో ఉన్న ఆస్తికి సంబంధించి ప‌న్నులు 15- 20% వ‌ర‌కూ ఉంటుంది. ఇది ఆయా రాష్ట్రాల‌ను బ‌ట్టి మారుతూ ఉంటుంది. దీంట్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము, వస్తుసేవలపన్నులు ఉంటాయి.

స్టాంప్ డ్యూటీ:
స్టాంప్ డ్యూటీ అమ్మ‌కం ఒప్పందం ప్ర‌కారం బ‌ట్టి ఉంటుంది. ఇది రాష్ట్రాల‌ను బ‌ట్టి మారుతుంటుంది. సాధార‌ణంగా స్టాంప్ డ్యూటీ మొత్తం ఆస్తి విలువ‌లో 5-7 శాతం వ‌ర‌కూ ఉంటుంది.ఆడ‌వారి పేరున ఆస్తి రిజిష్ట్రేష‌న్ చేస్తే చాలా రాష్ట్రాలు 1-2 శాతం స్టాంప్ డ్యూటీ త‌గ్గింపు ఇస్తున్నాయి.

రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు:
ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ ఆఫీస‌ర్ తో అమ్మకపు ఒప్పందం నమోదు చేసుకోవడానికి, కొనుగోలుదారులు ఆస్తి మొత్తం ఖర్చులో 1% నమోదు రుసుము జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాలి.

జీఎస్‌టీ:
నిర్మాణంలో ఉండే ఆస్తుల‌కు వాటి కొనుగోలు వ్యయంపై 12% పన్ను చెల్లించాలి. ఇది 2017 నుంచి వ‌ర్తిస్తుంది.

టీడీఎస్:
మూలం వ‌ద్ద ప‌న్ను 1% వసూలు చేస్తారు. ఇది విక్రేతకు చెల్లింపు సమయంలో కొనుగోలుదారు మిన‌హాయించాలి. ఈ మిన‌హాయించిన టీడీఎస్ ను ఆ నెల చివ‌రి నుంచి ఏడు రోజులలో ఆన్‌లైన్ ద్వారా లేదా అధీకృత బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి.

సిద్ధంగా ఉన్న ఆస్తుల‌ కోసం:
సిద్ధంగా ఉన్న ఆస్తుల్లో జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంటుంది. కొనుగోలు దార్లు కేవ‌లం స్టాంపు డ్యూటీ ,రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తే స‌రిపోతుంది.ఇది మొత్తం ఆస్తి వ్యయంలో 7-8% వ‌ర‌కూ ఉంటుంది. కాబ‌ట్టి సిద్ధంగా ఉన్న ఇళ్లు కొనుగోలు దారుల‌కు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. వెంట‌నే ఇంట్లోకి వెళ్లే అవ‌కాశం ఉండ‌టంతో అద్దె కూడా ఆదా అవుతుంది. కొనుగోలుదారు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత చెల్లించాల్సిన మరో పన్ను వార్షిక ఆస్తి పన్ను.ఈ పన్నురాష్ట్రాల‌ను బ‌ట్టి మారుతుంటుంది. ఒకవేళ ఆస్తి ద్వారా సంపాదించిన ఆదాయం ఉంటే దానిప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే ఆ ఆస్తి స్వీయ ఆక్రమితమైతే వార్షిక ఆస్తి పన్ను మాత్రమే వర్తిస్తుంది.

సరసమైన గృహాలకు రాయితీ:
ఈడ‌బ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎమ్ఐజీ-I, ఎమ్ఐజీ -II ప‌థ‌కాల ల‌బ్ధిదారుల కోసం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం (సీఎల్ఎస్ఎస్) కు జీఎస్‌టీ ప్రయోజనాన్ని ప్ర‌భుత్వం విస్తరించింది. ఈ ప‌థాక‌ల్లో ల‌భ్దిదారులు వడ్డీ రాయితీని పొందడంతో పాటు, తక్కువ రాయితీ గల జీఎస్‌టీ రేటు 8% ను పొందవచ్చు. ఈ విభాగంలో విక్రయాలను వృద్ధి చెందించేందుకు గృహ కొన‌గోలు దార్ల నుంచి జీఎస్‌టీని వసూలు చేయకుండా ఉండాలని ప్రభుత్వం బిల్డ‌ర్ల‌ను కోరింది. ఎందుకంటే సరసమైన గృహాల‌పై వ‌ర్తించే 8% జీఎస్‌టీ రేటు బిల్డ‌ర్ల‌కు వ‌చ్చే ఇన్ పుట్ క్రెడిట్ స‌ర్దుబాటు అవుతుంద‌ని ప్ర‌భుత్వం అభిప్రాయ ప‌డింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని