Electric Vehicle: ఎల‌క్ట్రిక్ కారుపై బ్యాంకు రుణంతో ఎంత ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు?

సెక్ష‌న్ 80ఈఈబి ప్ర‌కారం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ కొనుగోలుకు తీసుకున్న రుణం కోసం చెల్లించే వ‌డ్డీపై రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు  మిన‌హాయింపు పొంద‌చ్చు. 

Updated : 22 Dec 2021 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌పంచ‌దేశాలు ఎదుర్కొంటున్న ముఖ్య స‌మ‌స్య‌ల్లో వాయు కాలుష్యం ఒక‌టి. ఈ స‌మ‌స్య మ‌న‌దేశంలోనూ ఎక్కువ‌గానే ఉంది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) వాడ‌క‌మే ఇందుకు ప‌రిష్కారమ‌ని ప్ర‌పంచ‌దేశాలు విశ్వసిస్తున్నాయి. ఇవి ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేయ‌డం మాత్ర‌మే కాదు సంప్రదాయ ఇంధ‌న కార్ల‌తో పోలిస్తే స‌మ‌ర్థ‌ంగా పనిచేస్తాయి. అందువ‌ల్ల ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని భార‌త‌ ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో వినియోగ‌దారులు కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గుచూపుతున్నారు.

భార‌త ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం వ్య‌క్తిగ‌తంగా వినియోగించే కార్లు ల‌గ్జ‌రీ ఉత్ప‌త్తుల‌ కింద‌కి వ‌స్తాయి. అందువ‌ల్ల ఉద్యోగులకు కారు రుణాల‌పై ఎలాంటి ప‌న్ను ప్ర‌యోజ‌నాలూ ల‌భించ‌వు. అయితే కొత్త‌గా చేర్చిన సెక్ష‌న్ 80ఈఈబీ కింద రుణం తీసుకుని ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌ కొనుగోలు చేసే వారికి మాత్రం ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఈవీ వినియోగాన్ని పెంచేందుకు ప్ర‌భుత్వం ఈ కొత్త సెక్ష‌న్‌ను తీసుకొచ్చింది. 

సెక్ష‌న్ 80ఈఈబీ కింద మిన‌హాయింపు పొందాలంటే..
*
ఈవీ కొనుగోలుకు బ్యాంకు లేదా పేర్కొన్న ఎన్‌బీఎఫ్‌సీ నుంచి రుణం పొంది ఉండాలి.
* ఏప్రిల్ 1, 2019 - మార్చి 31, 2023 మధ్య లోన్ మంజూరై ఉండాలి.
* రుణం కోసం చెల్లించే వ‌డ్డీపై మాత్ర‌మే రూ.1.50 ల‌క్ష‌ల మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. 
* వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుల‌కు మాత్ర‌మే ఈ మిన‌హాయింపు ఉంటుంది.

ఎల‌క్ట్రిక్ వాహ‌నానికి మార‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు..
* ప‌న్ను ప్ర‌యోజ‌నం.. సెక్ష‌న్ 80ఈఈబీ ప్ర‌కారం ఈవీ కొనుగోలుకు తీసుకున్న రుణం కోసం చెల్లించే వ‌డ్డీపై రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు. 
* త‌క్కువ జీఎస్‌టీ.. ప్ర‌భుత్వం ఈవీ వాహ‌నాలకు వ‌ర్తించే జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి త‌గ్గించింది. అంతేకాకుండా దిల్లీ, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాలు ఈవీ వాహ‌నాల‌కు రోడ్ ట్యాక్స్‌, రిజిస్ట్రేష‌న్ కాస్ట్‌ల నుంచి మిన‌హాయింపు ఇస్తున్నాయి. ఈ ప్ర‌యోజ‌నాలు త్వ‌ర‌లోనే మిగిలిన రాష్ట్రాలు అమ‌లు చేసే అవ‌కాశం ఉంది. ఇది ఈవీ వాహ‌నాల కొనుగోలు ధ‌ర‌ల‌ను చాలావ‌ర‌కు త‌గ్గిస్తుంది.
* గ్రీన్ ట్యాక్స్ మిన‌హాయింపు.. వాయు కాలుష్యాన్ని త‌గ్గించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం బ‌డ్జెట్ 2021లో గ్రీన్ ట్యాక్స్ పాల‌సీని ప్ర‌క‌టించింది. ఈ గ్రీన్ ట్యాక్స్ కింద 15 సంవత్సరాల కంటే పాత వ్యక్తిగత వాహనాలు గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయి. ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్ను వసూలు చేస్తారు. అయితే ఎలక్ట్రిక్ వాహ‌నాలకు పూర్తిగా గ్రీన్ ట్యాక్స్ నుంచి మిన‌హాయింపు ల‌భిస్తుంది. 
* ఈ ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో పాటు పెట్రోల్ ఖ‌ర్చు ఉండ‌దు. అలాగే నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు కూడా త‌క్కువే. పెట్రోల్‌, డీజిల్‌ వాహ‌నాల ఇంజిన్ నిర్వ‌హ‌ణ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. సంప్ర‌దాయ‌ ఇంజిన్‌లో వంద‌ల కొద్దీ క‌దిలే భాగాలు ఉంటాయి. కానీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలలో ఈ భాగాలు 20 కంటే త‌క్కువే ఉంటాయి. అందువ‌ల్ల దీర్ఘ‌కాలంలో నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు త‌క్కువ‌గా ఉంటుంది.

ప్ర‌తికూల‌త‌లు..
* లాంగ్‌ట్రిప్ విష‌యంలో సాధార‌ణ వాహ‌నాలతో పోలిస్తే ప్ర‌యాణించే ప‌రిధి ప‌రిమితంగా ఉంటుంది. 100 శాతం బ్యాట‌రీతో ఎల‌క్ట్రిక్ కార్లు 300 నుంచి 400 కిలోమీట‌ర్లు వ‌ర‌కు మాత్ర‌మే ప్ర‌యాణించే అవ‌కాశం ఉంటుంది.
ఛార్జీంగ్ టైమ్‌.. బ్యాట‌రీ ఛార్జీంగ్‌కు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. చాలా వ‌ర‌కు ఎల‌క్ట్రిక్ కార్లు 0 నుంచి ఫుల్ ఛార్జింగ్‌ చేసేందుకు 6 నుంచి 10 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. లాంగ్ ట్రిప్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకోవాలి. ప్ర‌స్తుతం ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. కానీ ప్ర‌భుత్వం ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అవ‌స‌ర‌మైన ఛార్జింగ్‌ స్టేష‌న్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. కాబ‌ట్టి ఈ స‌మ‌స్య ఎక్కువ కాలం ఉండకపోవచ్చు.
* బ్యాటరీ రీప్లేస్‌మెంట్ - చాలా మంది తయారీదారులు తమ బ్యాటరీపై 5 నుంచి 8 సంవత్సరాల వారెంటీ ఇస్తున్నారు. అయితే, మీరు ఫాస్ట్ ఛార్జింగ్‌ ఉపయోగించక‌పోవ‌డం, అధిక ఉష్టోగ్ర‌త‌లు ఉన్న చోట‌ పార్కింగ్‌ చేయకుండా ఉంటే బ్యాట‌రీ లైఫ్‌ని పొడిగించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు