Union Budget 2022: బడ్జెట్‌ ప్రసంగంలో జీఎస్టీ లెక్క చెప్పి ఆశ్చర్యపర్చిన నిర్మలమ్మ

ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడంతో జనవరిలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.40 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వెల్లడించారు.

Published : 01 Feb 2022 18:14 IST

జనవరి రికార్డు వసూళ్ల గురించి సభ్యులకు వెల్లడి..

దిల్లీ: ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడంతో జనవరిలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.40 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వెల్లడించారు. ఈ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా పన్ను చెల్లింపుదారులను అభినందించారు. ఈ భారీ వసూళ్ల గురించి ఈ రోజు ఉదయమే తెలిసిందంటూ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించి.. సభ్యుల్ని ఆశ్చర్యపర్చారు.

‘ఈ రోజు ఉదయం నా దృష్టికి వచ్చిన విషయాన్ని మీకు వెల్లడిస్తున్నాను. ఇది నా ప్రసంగంలో భాగం కాదు. సభలోని సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఆవశ్యకత ఉంది’ అంటూ జనవరి నెలకు వసూలైన జీఎస్టీ గురించి ప్రత్యేకంగా తెలియజేశారు.

‘జనవరిలో జీఎస్టీ వసూళ్ల మొత్తం రికార్డు స్థాయిలో ఉంది. ఆ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,40,986 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. చెల్లింపుదారులు ప్రశంసలకు అర్హులు. జీఎస్టీ వ్యవస్థలో చెప్పుకోదగ్గ పురోగతి ఉంది. అయితే కొన్ని సవాళ్లు మిగిలి ఉన్నాయి’ అంటూ వెల్లడించారు. మంత్రి ఈ మాట చెప్పగానే సభ్యలంతా బల్లలు చరిచి, ఆనందం వ్యక్తం చేశారు.  ఇదిలా ఉండగా.. జీఎస్టీ వసూళ్లు ఇప్పటికే రూ.లక్ష కోట్ల మార్కు దాటగా.. జనవరి నెలతో కలిపి వరుసగా ఏడో సారి లక్ష కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. గతేడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1,39,708 కోట్లు వసూలయ్యాయి.

‘సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించే స్వతంత్ర భారతదేశానికి జీఎస్టీ సంస్కరణ ఒక మైలురాయి. ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ సవాళ్లు జీఎస్టీ కౌన్సిల్ మార్గదర్శకత్వం, పర్యవేక్షణలో నేర్పుగా అధిగమించవచ్చు. ఈ వ్యవస్థ పట్ల మేం గర్వంగా ఉన్నాం. మహమ్మారి సవాళ్లు విసిరినప్పటికీ ఆదాయాలు మెరుగ్గా ఉన్నాయి’ అంటూ వివరించారు.

2017 జులై నుంచి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. జీఎస్టీ వన్‌ నేషన్‌ వన్‌ ట్యాక్స్‌ వ్యవస్థ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువు లేదా సేవలపై ఈ పన్ను రేటు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగదారుడు ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జీఎస్టీని మూడు రకాలుగా విభజించారు. సెంట్రల్‌ జీఎస్టీ (CGST), రాష్ట్ర జీఎస్టీ (SGST), ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ (IGST). జీఎస్టీ ప్రవేశ పెట్టిన తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్‌)లో మొదటిసారి జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్కు దాటాయి. ఆ తర్వాత ఆ ఒరవడి కొనసాగింది. కరోనా కారణంగా మధ్యమధ్యలో వసూళ్లపై ప్రభావం కనిపించింది. అయితే గతేడాది ఏప్రిల్‌లో రూ.1.39 లక్షల కోట్లు రాగా.. తాజాగా మొత్తం రూ. 1.40 లక్షల కోట్లు దాటేసింది. ఈ వ్యవస్థను తీసుకుచ్చిన తర్వాత ఇదే అత్యధిక మొత్తం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని