IT Exemption: సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు

1961 ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సి కింద సంవ‌త్స‌రానికి రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపుకు అర్హులు.

Updated : 19 Sep 2022 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు పెన్ష‌న్ ఆదాయం ప్రాథ‌మిక మూలం. అయితే, వారు డివిడెండ్‌లు, ఇంటి అద్దెలు, ఇత‌ర ఆదాయాల‌ను కూడా పొందుతుంటారు. సీనియ‌ర్ సిటిజ‌న్లు ఆదాయ ప‌న్ను చ‌ట్టం, 1961లోని సెక్ష‌న్ 80సీ ద్వారా ప‌న్ను ఆదా చేయ‌డానికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌గ‌లిగే కొన్నిపెట్టుబ‌డులు, సంపాదించే ఆదాయానికి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు, ప‌న్ను మిన‌హాయింపులు ఇక్క‌డ‌ చూద్దాం.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్ (SCSS)

సీనియ‌ర్ సిటిజ‌న్‌లు లేదా ముందుగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వారికి మాత్ర‌మే ఈ ప‌థ‌కం అందుబాటులో ఉంటుంది. ఈ ప‌థ‌కానికి ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం 7.40% వార్షిక వ‌డ్డీని అందిస్తోంది. 60 ఏళ్లు పైబ‌డిన ఎవ‌రైనా పోస్టాఫీసు లేదా బ్యాంకు ద్వారా ఈ ప‌థ‌కంలో చేర‌వచ్చు. ఈ ప‌థ‌కం కాల‌వ్య‌వ‌ధి 5 ఏళ్లు. అయితే, ప‌థ‌కం మెచ్యూర్ అయిన త‌ర్వాత దీన్ని3 ఏళ్ల పాటు పొడిగించ‌వ‌చ్చు. మ‌ధ్య‌లో ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంటుంది.

ఇది ఒకేసారి పెట్టుబ‌డి పెట్టే సింగిల్ ప్రీమియం డిపాజిట్‌. SCSSలో ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ చేయ‌గ‌లిగే గ‌రిష్ఠ డిపాజిట్ రూ.15 ల‌క్ష‌లు, క‌నీస డిపాజిట్ రూ.1000. SCSS డిపాజిట్ ద్వారా ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.50 వేల వ‌ర‌కు పొందే వ‌డ్డీపై ప‌న్ను ఉండ‌దు. ఒక సంవ‌త్స‌రంలో మొత్తం వ‌డ్డీ రూ.50,000 దాటితే అప్పుడు ప‌న్ను విధిస్తారు. 1961 ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద సంవ‌త్స‌రానికి రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

5 సంవ‌త్స‌రాల ప‌న్ను ఆదా ఎఫ్‌డీలు

ఈ ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీ ఖాతాను తెర‌వ‌డానికి ఏదైనా ప్ర‌భుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకును ఆశ్ర‌యించ‌వ‌చ్చు. వ్య‌క్తిగ‌తంగా, ఉమ్మ‌డిగా కూడా ఖాతాను తెర‌వ‌చ్చు. ఈ ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీల‌కు 5 ఏళ్ల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి ఉంటుంది. సెక్ష‌న్ 80TTB కింద ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీ వ‌డ్డీపై రూ. 50,000 వ‌ర‌కు త‌గ్గింపు కూడా క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. ఇత‌ర ర‌కాల ఎఫ్‌డీలు ఈ ప్ర‌యోజ‌నాన్ని అందించ‌వు. పేరెన్నిగ‌న్న ప్ర‌ముఖ బ్యాంకుల్లో వ‌డ్డీ రేట్లు 6.50% నుంచి 8% వ‌ర‌కు ఉన్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక పన్ను ఆదా ఎఫ్‌డీలను కూడా ప్రవేశపెట్టాయి.

డిపాజిట్ల‌పై మిన‌హాయింపు

60 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ వయసున్న వ్య‌క్తి  బ్యాంకులు, పోస్టాఫీసు, కో-ఆప‌రేటివ్ బ్యాంకుల్లో పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కింద రూ. 50 వేలు వ‌డ్డీ ఆదాయాన్ని సంపాదిస్తే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80TTB కింద ప‌న్ను మిన‌హాయింపుకు అర్హులు.

నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్స్ (NSC)

సీనియ‌ర్ సిటిజ‌న్లు స్థిర‌మైన రాబ‌డి, ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో 5 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్స్‌లో పొదుపు మంచిదే. NSC అనేది ఒకేసారి మ‌దుపు చేసే పొదుపు సాధ‌నం. మ‌దుపు చేసిన మొత్తం 5 సంవ‌త్స‌రాల పాటు లాక్ చేస్తారు. దీనిలో మ‌దుపుదార్ల‌కు చెల్లించే వ‌డ్డీ రేటు ఏడాదికి 6.80%. మ‌దుపుదార్ల‌కు నెల‌వారీ, వార్షిక ప్రాతిప‌దిక‌న వ‌డ్డీ చెల్లింపు ఉండ‌దు. అస‌లుతో పాటు వడ్డీ  మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. NSCలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. కానీ, సెక్ష‌న్ 80సి కింద ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌న్ను ప్ర‌యోజ‌నం ఉంటుంది. మూల‌ధ‌నాన్ని కాపాడుకోవాల‌నుకునే సంప్ర‌దాయ పెట్టుబ‌డిదారుల‌కు NSC మంచి పొదుపు.

వైద్య బీమా ప్రీమియం

ఆరోగ్య బీమా పాల‌సీకి చెల్లించిన ప్రీమియంపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80డి కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. జీవిత బీమా పాల‌సీలో హెల్త్ రైడ‌ర్ల‌కు చెల్లించే ప్రీమియంపై కూడా ఈ సెక్ష‌న్ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు అర్హ‌త ఉంటుంది. అయితే, ప‌న్ను ప్ర‌యోజ‌న ప‌రిమాణం వైద్య‌ప‌రంగా బీమా కొనుగోలు చేసిన వ్య‌క్తి వయసుపై ఆధార‌ప‌డి ఉంటుంది. 60 సంవ‌త్స‌రాలు దాటిన త‌ల్లిదండ్రుల ఆరోగ్య బీమా ప్రీమియంపై పొంద‌గ‌లిగే గ‌రిష్ఠ మిన‌హాయింపు సంవ‌త్స‌రానికి రూ. 50 వేలు. 60 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వయసు వారు పొంద‌గ‌లిగే ప‌న్ను ప్ర‌యోజ‌నం రూ. 25 వేలు మాత్ర‌మే. వ్య‌క్తి వయసు 60 ఏళ్లు పైబ‌డి ఉంటే, అత‌డి/ఆమెతో పాటు త‌ల్లిదండ్రుల కోసం ప్రీమియం చెల్లిస్తే పొంద‌గ‌లిగే మొత్తం మిన‌హాయింపు రూ. 1 ల‌క్ష‌.

చివరిగా: పైన తెలిపిన పథకాలతో పాటు సీనియర్ సిటిజన్లు ఎన్పీఎస్ లాంటి పథకాల్లో ఇప్పటికే పెట్టుబడి పెడుతుంటే వాటిని కొనసాగించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని