Income Tax: తల్లిదండ్రులకు చేసే ఏ ఖర్చులపై పన్ను ఆదా చేయొచ్చు?

పన్ను ఆదా చేయడంలో మీకు సహాయపడడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవేంటో చూడండి.

Published : 28 Jan 2023 20:46 IST

కుటుంబం మొత్తానికి పన్ను భారం ఎక్కువగా ఉండకుండా ఆదాయ పన్ను ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇలా చేయడానికి మీకు సహాయపడే పన్ను నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని వివిధ సెక్షన్‌ల కింద కొన్ని నిర్దిష్ట మినహాయింపులను పొందే అవకాశం ఉంది. మీరు పన్ను వ్యయాన్ని తగ్గించుకోవడానికి సహాయపడే విధంగా మీ పెట్టుబడులు, వ్యవహారాలను ప్లాన్‌ చేసుకోవచ్చు.

బహుమతి

తల్లిదండ్రులకు డబ్బును బహుమతిగా ఇవ్వచ్చు లేక వారి పేరు మీద పెట్టుబడి కూడా పెట్టొచ్చు. మీ తల్లిదండ్రులు మీ నుంచి డబ్బును స్వీకరిస్తే, దానిపై పన్ను విధించరు. పెట్టుబడి కోసం మీరు తల్లిదండ్రులకు డబ్బును బహుమతిగా ఇవ్వవచ్చు. పెట్టుబడిపై లభించే వడ్డీపై వారి రిటర్న్‌లో నియయ నిబంధనలను బట్టి పన్ను విధిస్తారు. కాబట్టి, మీరు వారి పేరు మీద డబ్బు పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ మీ తల్లిదండ్రులు తక్కువ ఆదాయపు పన్ను స్లాబ్‌లో ఉన్నట్లయితే ఇది వారికి ప్రయోజనకరం.

పెట్టుబడులు

మీ తల్లిదండ్రులు సీనియర్‌ సిటిజన్లు, పన్ను పరిధిలో లేని ఆదాయం గలవారయితే మీరు అధిక పన్ను మొత్తాన్ని ఆదా చేయొచ్చు. బ్యాంకు/పోస్టాఫీసు డిపాజిట్‌పై సీనియర్‌ సిటిజన్లకు రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయం(80TTB) మినహాయింపు అనుమతి ఉంటుంది. అలాగే, సీనియర్‌ సిటిజన్లు బ్యాంకు ఎఫ్‌డీలపై అధిక వడ్డీని పొందుతారు. కాబట్టి, మీరు మీ తల్లిదండ్రుల పేరుతో ఎప్‌డీలలో పెట్టుబడి పెట్టవచ్చు. పన్ను ప్రయోజనాలను పొందుతూ మంచి వడ్డీ కూడా పొందొచ్చు. 

ఇంటి అద్దె

మీరు మీ తల్లిదండ్రుల ఇంటిలో నివసిస్తుంటే వారికి ఇంటి అద్దె చెల్లించొచ్చు. సెక్షన్‌ 10(3A) ప్రకారం మినహాయింపు పరిమితిలోపు ఇంటి అద్దె భత్యం(HRA) ప్రయోజనం పొందొచ్చు. మీ తల్లిదండ్రులు మీ కంటే తక్కువ ఆదాయ పన్ను శ్లాబ్‌లో ఉన్నప్పుడు ఈ విధానం పని చేస్తుంది. వారు సీనియర్‌ సిటిజన్లు అయ్యుండి, పన్ను పరిమితి దాటకపోతే మీ కుటుంబం గణనీయమైన పన్నును ఆదా చేయొచ్చు. అయితే ఇల్లు తప్పనిసరిగా మీ తల్లిదండ్రులలో ఒకరు/ఇద్దరి పేరు మీద ఉండాలి. అద్దెను వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి లేదా చెక్ ద్వారా చెల్లించాలి. HRA ప్రయోజనాన్ని క్లెయిమ్‌ చేయడానికి మీరు క్రమం తప్పకుండా అద్దె చెల్లించాలి. వారి నుంచి అద్దె రశీదు పొందాలి. పేరేంట్స్‌ వారి పన్ను రిటర్న్‌లలో అద్దె ఆదాయాన్ని కూడా చూపించాలి.

ఆరోగ్య బీమా

మీ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేస్తే, అది మీకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్‌ 80D ప్రకారం, ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియంను క్లెయిమ్‌ చేయొచ్చు. గరిష్ఠ మినహాయింపు రూ.25 వేలు, తల్లిదండ్రులు సీనియర్‌ సిటిజన్లతే ఈ పరిమితి రూ.50 వేలకు పెరుగుతుంది. సెక్షన్‌ 80DDB ప్రకారం, పన్ను చెల్లింపుదారైన ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు సంబంధించిన వ్యాధులు/జబ్బుల నిర్దిష్ట జాబితాకు సంబంధించిన వైద్య చికిత్సపై అయ్యే ఖర్చులకు తగ్గింపును క్లెయిమ్‌ చేయొచ్చు. ఈ మినహాయింపు పరిమితి రూ.40 వేలు. తల్లిదండ్రులు సీనియర్‌ సిటిజన్లతే ఈ క్లెయిమ్‌ రూ.1 లక్ష వరకు పెరుగుతుంది.

అంగవైకల్యం

అంగవైకల్యం గల తల్లిదండ్రుల వైద్య చికిత్సపై ఏదైనా మొత్తాన్ని వెచ్చించినప్పుడు సెక్షన్‌ 80DD కింద మినహాయింపు ఉంటుంది. రూ.75 వేల ఫ్లాట్‌ డిడక్షన్‌ ఉంటుంది. తల్లిదండ్రులు తీవ్రమైన వైకల్యంతో బాధపడుతుంటే ఈ డిడక్షన్‌ రూ.1 లక్షకు పెరుగుతుంది.

చివరిగా: పన్నులను ఆదా చేయడానికి మీ తల్లిదండ్రుల నుంచి సహాయం తీసుకున్నప్పుడు, మీరు ప్రతి లావాదేవీకి సంబంధించిన రికార్డులను సరిగ్గా నిర్వహించాలి. ప్రతి సంవత్సరం సరైన సమయానికి పన్ను రిటర్న్‌ను సమర్పించాలి. ఐటీ రిటర్న్‌ను ఫైల్‌ చేసేటప్పుడు గిఫ్ట్‌ లావాదేవీలను నివేదించడం మరిచిపోకూడదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని