పన్ను ఆదా చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉందని మీకు తెలుసా?

ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలనూ అన్వేషించుకోవాలి. చాలామంది జనవరి తర్వాతే ఈ విషయంలో హడావుడి పడుతుంటారు...

Updated : 01 Jan 2021 16:55 IST

టీడీఎస్ తీసివేసాక కూడా రిఫండ్ పొందే అవకాశం మీకు ఉంది. సరిగ్గా మరో వారం రోజుల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ముగింపు పలకబోతున్నాం. ఇప్పటికే చెల్లించాల్సిన పన్ను చెల్లించే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. ఇంకా ఏమైనా మినహాయింపులు పొందేందుకు అవకాశం ఉందా? ఒకసారి పూర్తిగా లెక్కలను సరిచూసుకోవాల్సిన తరుణమిది..

ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలనూ అన్వేషించుకోవాలి. చాలామంది జనవరి తర్వాతే ఈ విషయంలో హడావుడి పడుతుంటారు. చివరి వరకూ ఎదురుచూడటం వల్ల తొందరపాటులో మనకు ఏమాత్రం సరిపోని పథకాలను ఎంచుకునే ప్రమాదం లేకపోలేదు. ఏడాది కాలంగా మనం చేస్తున్న మదుపు పథకాలను సమీక్షించుకునే సమయమూ ఇదే. కాబట్టి, ఈ రోజే మీ పెట్టుబడి పథకాలను ఓసారి చూసుకోండి. అందులో పన్ను ఆదా కోసం ఎంచుకుని, వ్యవధి తీరినవి ఏవైనా ఉన్నాయా చూసుకోండి. అప్పుడే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే మంచి పథకాల్లో మదుపు చేసి, సమర్థంగా పన్ను ఆదా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.

ఆధారాలన్నీ ఇచ్చేశారా?

ఉద్యోగులు ఇప్పటికే పన్ను ఆదా పథకాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను యాజమాన్యానికి సమర్పించి ఉంటారు. అయినప్పటికీ చివరి నిమిషంలో ఒకసారి అవన్నీ పూర్తిగా తనిఖీ చేసుకోవడం ముఖ్యం. మీరు పొందిన ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)కు సంబంధించిన అద్దె రశీదులు, విహార యాత్రలకు సంబంధించిన ఎల్‌టీఏ బిల్లులు, వైద్య ఖర్చులను తిరిగి పొందడానికి అవసరమైన రశీదులు, యూనిఫార్మ్‌ అలవెన్సులు, కార్‌ రీఇంబర్సిమెంట్‌, టెలిఫోను, పుస్తకాలు-పేపర్లకు సంబంధించిన ఖర్చులు ఇలా పన్ను ఆదాకు అవసరమైన అన్ని ఆధారాలనూ మీ యాజమాన్యానికి ఇచ్చారా లేదా చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉండి, వాటిని యాజమాన్యానికి సమర్పించలేకపోతే… మూలం వద్ద పన్ను కోత ఎలాగూ విధిస్తారు… కాబట్టి, ఇక మీకు మిగిలిన అవకాశం… ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి, రిఫండు కోరడమే.

ఖర్చులనూ చూసుకోండి

పిల్లల ట్యూషన్‌ ఫీజులు, జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియం, గృహరుణంపై చెల్లించిన వడ్డీ, అసలు, విద్యారుణంపై చెల్లించే వడ్డీ, కొన్ని రకాల తీవ్ర వ్యాధులకు సంబంధించిన చికిత్సా ఖర్చులు, దివ్యాంగులకు ప్రత్యేక మినహాయింపు, ఆరోగ్య పరీక్షల కోసం వెచ్చించిన మొత్తం… ఇలా అనేక రకాల ఖర్చుల ద్వారానూ పన్ను ఆదా చేసుకునేందుకు వీలవుతుంది. పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టేముందు ఇలాంటి ఖర్చులకు సంబంధించిన వివరాలేమైనా ఉన్నాయా మరోసారి పరిశీలించండి. ఉద్యోగంలో ఉన్నా ఇంటి అద్దె భత్యం రానప్పుడు… సెక్షన్‌ 80జీజీ ప్రకారం రూ.60వేల వరకూ ఇంటి అద్దె మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగులు కానివారికీ ఇది వర్తిస్తుంది. ఇవన్నీ పూర్తయ్యాయి… అయినా ఇంకా పెట్టుబడికి అవకాశం ఉందని భావిస్తేనే… మదుపు చేసేందుకు తగిన పథకాలను ఎంచుకోండి.

బీమా ఒక్కటే కాదు

సాధారణంగా పన్ను ఆదా కోసం పెట్టుబడి అనగానే చాలామంది జీవిత బీమా పాలసీలనే పరిశీలిస్తుంటారు. సాధారణంగా బీమా సంస్థలు కూడా పన్ను చెల్లించే వారిని ఆకట్టుకునేందుకు రకరకాల కొత్త పాలసీలను తీసుకొస్తుంటాయి. వీటిలో మంచి చెడులను విశ్లేషించుకోకుండా కేవలం పన్ను ఆదా కోసం పాలసీని ఎంచుకుంటామనుకోవడం ఎప్పుడూ సరికాదు. సంప్రదాయ పాలసీలతో పన్ను ఆదా చేసుకోవాలనుకోవడం ఆర్థికంగా కొంత ఇబ్బందికరం కూడా. జీవిత బీమా పాలసీని పెట్టుబడి పథకంగా భావించకూడదు. మరీ ముఖ్యంగా పన్ను ఆదా అనేది ఇందులో ఉండే అదనపు సౌకర్యంగానే భావించాలి తప్ప… పన్ను ఆదా కోసమే పాలసీని తీసుకోవాలనుకోవడం పొరపాటే. మీకు ఉండే బీమా అవసరాన్ని ముందుగా విశ్లేషించుకోండి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీకి ప్రాధాన్యం ఇవ్వండి. అనేక ఇతర పథకాలు పన్ను భారం తగ్గించుకునేందుకు ఉన్నాయి. వాటిని పరిశీలించండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… మీరు ఏ పెట్టుబడి పథకాన్ని ఎంచుకున్నా అది మార్చి 31లోగా ఎంచుకున్నప్పుడే ఈ ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది.

లక్ష్యం నెరవేరేలా..

ఒక పెట్టుబడి పథకాన్ని ఎంచుకుంటున్నామంటే… దాని ద్వారా మనకు ఏదో ఒక ఆర్థిక లక్ష్యం నెరవేరాలి. దీర్ఘకాలంపాటు పెట్టుబడిని కొనసాగించే అవకాశాన్ని ఇవ్వాలి… అదే సమయంలో పన్ను ఆదా కోసం ఉపయోగపడాలి. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే… పెట్టుబడి పెట్టినప్పుడే కాదు… ఆ పెట్టుబడిపై వచ్చిన రాబడికీ పన్ను మినహాయింపు వర్తించినప్పుడే అధిక ప్రయోజనం చేకూరుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పథకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)… పదిహేనేళ్ల దీర్ఘకాలంపాటు… మన వీలును బట్టి, పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పించే పథకం ఇది. ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మదుపు చేయొచ్చు.

► సుకన్య సమృద్ధి యోజన… పదేళ్లలోపు అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో మదుపు చేసేందుకు వీలుంటుంది. గరిష్ఠంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ పెట్టుబడి పెట్టొచ్చు.

► చివరి నిమిషంలో పన్ను ఆదా చేసుకోవాలని భావించేవారు ఈ రెండు పథకాలను ఎంచుకోవడం మేలు. ఇందులో వచ్చిన రాబడికీ పన్ను ఉండదు. పోస్టాఫీసు లేదా ఏదేని జాతీయ బ్యాంకులో ఈ రెండు ఖాతాలనూ సులభంగా ప్రారంభించేందుకు వీలుంది.

► ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలతో (ఈఎల్‌ఎస్‌ఎస్‌)నూ పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంది. అయితే, వీటిలో ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టడం అంత క్షేమం కాదనే చెప్పాలి. ఈక్విటీ పథకాలు కాబట్టి, నష్టభయం ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఇందులో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం ఉత్తమం. గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. కానీ, సెక్షన్‌ 80సీ నిబంధనలకు లోబడి రూ.1,50,000 వరకే పన్ను మినహాయింపునకు అనుమతిస్తారు. ఇందులో పెట్టుబడిని మూడేళ్లపాటు కొనసాగిస్తే సరిపోతుంది. పన్ను ఆదా పథకాల్లో స్వల్ప వ్యవధి ఉన్న పథకం ఇదే. పైగా పెట్టుబడి వృద్ధికి అవకాశం… వచ్చిన లాభానికి పన్ను ఉండకపోవడం (దీర్ఘకాలిక మూలధన లాభం ఏడాదిలో రూ.1,00,000 దాటినప్పుడు పన్ను ఉంటుంది) వంటి ప్రయోజనాలున్నాయి. ఈ పథకంలోనూ సులభంగానే మదుపు చేసేందుకు అవకాశం ఉంది. మీ దగ్గర్లోని బ్యాంకుల్లోనూ, లేదా బ్రోకరేజీ సంస్థలను సంప్రదించవచ్చు. మీకు అందుబాటులో ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ సలహాదారులనూ ఎంచుకోవచ్చు.

► సెక్షన్‌ 80సీ పరిమితికి మించి మదుపు చేయాలని భావించినప్పుడు ఉన్న మరో అవకాశం జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)… ఇందులో రూ.50,000 వరకూ మదుపు చేసి, పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంది. మీ చేతిలో కాస్త డబ్బు ఉంటే ఈ పథకాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నించండి.

► పన్ను ఆదా కోసం ఇంకా అవకాశం ఉంది… మీ చేతిలో పెద్ద మొత్తం లేదని అనుకుందాం… అప్పుడు… సెక్షన్‌ 80సీ పరిధిలోకి వచ్చే… జాతీయ పొదుపు పత్రాలు (ఎన్‌ఎస్‌సీ), ఐదేళ్ల బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్లు, పన్ను ఆదా కోసం ప్రత్యేకించిన ప్రభుత్వ బాండ్లు, పెద్దల పొదుపు పథకంలాంటి వాటిని పరిశీలించవచ్చు. వీటి ద్వారా వచ్చిన రాబడిని వ్యక్తిగత ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది.

సేవ కోసం..
కొంతమంది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు, సేవా సంస్థలకు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, శాస్త్ర పరిశోధనా సంస్థలకు విరాళాలు ఇస్తుంటారు. వీటిని సెక్షన్‌ 80జీ, 80జీజీఏ, 80జీజీసీ కింద నిబంధనలకు లోబడి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే… వీటికి ఇచ్చే విరాళాలు రూ.2,000 వరకే నగదుగా ఇచ్చే అవకాశం ఉంది. ఈ విరాళాలకు సంబంధించి, సరైన ఆధారాలు సేకరించి పెట్టుకొని, రిటర్నుల దాఖలు సమయంలో మినహాయింపు క్లెయిం చేసుకోవాలి. కొన్ని యాజమాన్యాలు మూలం వద్ద పన్ను కోత లెక్కించేప్పుడు వీటినీ పరిశీలనలోకి తీసుకుంటాయి.

ఇవి గుర్తుంచుకోండి..
ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకూడదు… అనే ఆలోచన కొన్నిసార్లు సరైనదే కావచ్చు. కానీ, దీనివల్ల అనవసర ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. అప్పులు చేసి, పెట్టుబడి పెట్టడం ఏమాత్రం సరికాదు. బీ మీ స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక అవసరాలను బేరీజు వేసుకోండి. నిజంగా మీ దగ్గర మిగులు సొమ్ము ఉండి, ఐదేళ్ల వరకూ అవసరం లేదనుకుంటేనే పన్ను ఆదా పథకాల కోసం వెచ్చించండి.

పెట్టుబడి పెట్టడం ఒక్కటే కాదు… ఆ పథకం ద్వారా మీకు వచ్చే వాస్తవిక రాబడి ఎంత? అనేది లెక్క వేసుకోండి.
ప్రతి మదుపు పథకంపై అవగాహన పెంచుకోండి. వాటిని విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ప్రస్తుతం మీకు వారానికి మించి సమయం లేదు. కాబట్టి, నిధులను సమకూర్చుకోవడం, సరైన పథకంలో పెట్టుబడి పెట్టడంలాంటివన్నీ వెంటవెంటనే అమలు చేసేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు