Income tax: మొబైల్‌లోనే రిట‌ర్నుల దాఖ‌లు! 

ఐటి శాఖ కొత్త మొబైల్ యాప్ జూన్‌7, 2021 తేదిన‌ కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌తో పాటు అందుబాటులోకి రానుంది. 

Updated : 06 Jun 2021 22:29 IST


కొత్త సాంకేతిక‌త‌ను అందింపుచ్చుకుని.. దాని ద్వారా వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఎప్పుడూ ముందుంటుంది. ప‌న్ను చెల్లింపుదారులు, త‌మ రిట‌ర్నుల‌ను సుల‌భంగా దాఖ‌లు చేసేందుకు వీలుగా ఆన్‌లైన్ సేవాల‌ను ఇప్ప‌టికే అందిస్తుంది. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో కూడా ఐటీఆర్ దాఖ‌లు చేసేందుకు వీలుగా మొబైల్ అనువ‌ర్త‌నం(యాప్‌)ను తీసుకొస్తుంది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌న్ను చెల్లింపుదారుల‌కు తెలియ‌జేసింది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌. 

ప‌న్ను సంబంధిత విష‌యాల‌లో స‌రైన అవ‌గాహ‌న లేని వారు కూడా ఐటీ రిట‌ర్నుల‌ను సుల‌భంగా దాఖ‌లు చేసేందుకు ఐటీ శాఖ పాత ఇ-పోర్ట‌ల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్త ఇ-పోర్ట‌ల్  2.0.. www.incometaxgov.inను తీసుకురానుంది. దీంతో పాటే స‌రికొత్త‌ మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపింది. ప‌న్ను చెల్లింపుదారులకు కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌, కొత్త మొబైల్ యాప్ రెండు యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉండ‌నున్నాయి. ఇవి ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఐటీఆర్ ఫారం, ముందుగా పూరించిన ఆదాయ‌పు ప‌న్ను వివ‌రాలు, స‌ర‌ళ్ ఆదాయ‌పు ప‌న్ను సౌక‌ర్యం వంటి స‌మాచారాన్ని సేక‌రించేందుకు వీలుక‌ల్పిస్తాయి. 

కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్ జూన్ 7,2021 నుంచి అందుబాటులోకి రానుంది. అదే రోజున మొబైల్ యాప్ సౌక‌ర్యం కూడా అందుబాటులోకి వ‌స్తుంది. 

డెస్క్‌టాప్ ద్వారా ఆదాయ‌పు ప‌న్ను పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉండే అన్ని ముఖ్య‌మైన‌ ఫీచ‌ర్లు మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. అందువ‌ల్ల మొబైల్ నెట్‌వ‌ర్క్‌తో ఎప్పుడైనా, ఎక్క‌డైనా యాప్‌ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. 

ప‌న్నుచెల్లింపుదారుల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రిఫండ్‌ల‌ను జారీ చేసేందుకు.. రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించిన వెంట‌నే ప్రాసెసింగ్ చేసే విధంగా కొత్త ఇ-పోర్ట‌ల్ ఉంటుంది. ప‌న్ను చెల్లింపుదారుల‌కు స‌హాయ‌ప‌డేందుకు ఏర్పాటు చేసిన కాల్‌సెంట‌ర్‌.. ప‌న్నుచెల్లింపుదారులు త‌రుచుగా అడిగే ప్ర‌శ్న‌ల‌కు వీడియోలు, ట్యుటోరియ‌ల్స్ రూపంలో త‌క్ష‌ణ‌మే స‌మాధానం ఇస్తుంది. చాట్‌బాట్‌/లైవ్ ఏజెంట్ ద్వారా కూడా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకోవ‌చ్చు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని