ITR Filing: ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. ఐటీ శాఖ సమాధానం ఇదే..!

ITR Filing: ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలపై పన్ను చెల్లింపుదారులు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి ఐటీ శాఖ సమాధానం ఇస్తోంది.

Published : 11 Jul 2024 13:32 IST

ITR Filing | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు గడువు దగ్గర పడుతోంది. జులై 31తో ఈ గడువు ముగుస్తోంది. ఫైలింగ్‌కు మరికొన్ని రోజులే సమయం ఉండడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్నుల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో వారి నుంచి ఆదాయపు పన్ను శాఖకు (Income tax department) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫైలింగ్‌ కోసం ఉద్దేశించిన ఇ- ఫైలింగ్‌ (e-filing) పోర్టల్‌లో సమస్యలు ఉన్నాయంటూ సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ చాలా స్లోగా ఉందని కొందరు యూజర్లు ఫిర్యాదు చేస్తుండగా.. 3-4 రోజుల నుంచి ఫైలింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నా ‘సర్వీస్‌ అనవైలబుల్‌’ అని సమాధానం వస్తోందంటూ మరో యూజర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 26 ఏఎస్‌ డౌన్‌లోడ్‌ చేద్దామంటే గత పది రోజులుగా పోర్టల్‌ సరిగా పనిచేయడం లేదంటూ మరో యూజర్‌ రాసుకొచ్చారు. పోర్టల్‌ సరిగా పనిచేయడం లేదు కాబట్టి గడువును పొడిగించాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో ఫాస్టాగ్‌, డీటీహెచ్‌ రీఛార్జ్‌ సేవలు

సోషల్‌మీడియా వేదికగా యూజర్ల నుంచి వస్తున్న ఈ ఫిర్యాదులపై ఆదాయపు పన్ను శాఖ సోషల్‌ మీడియా వేదికగానే స్పందిస్తోంది. తమ బ్రౌజర్‌లో క్యాచీని క్లియర్‌ చేయాలని యూజర్లకు సూచిస్తోంది. అప్పటికీ సమస్య తలెత్తితే పాన్‌, మొబైల్‌ నంబర్‌తో orm@cpc.incometax.gov.inకు మెయిల్‌ చేయాలని, తమ టీమ్‌ సంప్రదిస్తుందని పేర్కొంటోంది. సాధారణంగా గడువు తేదీ సమీపిస్తున్నకొద్దీ ఇలాంటి సాంకేతిక అవరోధాలు తలెత్తుతూ ఉంటాయని, కాబట్టి గడువు తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే రిటర్నులు దాఖలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు