Published : 14 Jul 2022 16:35 IST

ITR filing: ఫారం 26ఏఎస్ ధ్రువీకరించారా? ఒకవేళ తప్పులుంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మదింపు సంవ‌త్స‌రం 2022-23 (ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22)కి సంబంధించిన ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు గ‌డువు ద‌గ్గ‌ర పడుతోంది. వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు జులై 31లోపు ఈ ప‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఆల‌స్యంగా దాఖ‌లు చేస్తే రూ.5000 జ‌రిమానా చెల్లించాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా, చివ‌రి రోజుల్లో హడావిడిగా రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం వ‌ల్ల ఫారం 26ఏఎస్ వంటి ప‌త్రాల‌ను నిశితంగా ప‌రిశీలించ‌లేరు. ఒక‌వేళ ఆ ఫారంలో ఏదైనా త‌ప్పులు ఉంటే స‌రిచేసుకుని రిట‌ర్నులు ఫైల్ చేసే స‌రికి ఆల‌స్యం కావ‌చ్చు. దీంతో ఆల‌స్య రుసుము చెల్లించాల్సి వ‌స్తుంది. ఇలా జ‌ర‌గ‌కూడ‌దంటే ఐటీ రిట‌ర్నుల దాఖ‌లుకు చివ‌రి వ‌ర‌కు వేచి చూడ‌కూడ‌దు. ఫారం 26ఏఎస్‌లో ఉన్న స‌మాచారం స‌రైన‌ద‌ని నిర్ధారించుకుని ముందుగానే రిట‌ర్నులు ఫైల్ చేయ‌డం మంచిది.

ఎందుకు ధ్రువీకరించాలి?
ఫారం 26ఏఎస్‌. దీన్నే క‌న్సాలిడేటెడ్ స్టేట్‌మెంట్ అని కూడా పిలుస్తారు. కొన్ని ఆర్థిక లావాదేవీల‌ను నిర్దిష్ట ప‌రిమితికి మించి చేసిన‌ప్పుడు, సంబంధిత స‌మాచారాన్ని ఆయా సంస్థ‌లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు అందజేస్తాయి. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ స‌మాచారం మొత్తం ఫారం 26ఏఎస్‌లో పొందుప‌రుస్తుంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థ‌లు, బ్రోకింగ్ సంస్థ‌లు.. ఇలా ఏ సంస్థ అయినా ప‌రిమితికి మించి లావాదేవీలు చేసిన‌ప్పుడు ఆ వివ‌రాల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు అందిస్తాయి.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి అన్ని బ్యాంకుల‌లో క‌ల‌పి రూ.10 ల‌క్ష‌ల‌కు మించి డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఈ విష‌యాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు తెలియ‌జేస్తాయి. అలాగే, రూ.30 ల‌క్ష‌లు, అంత‌కంటే విలువ గ‌ల స్థిరాస్తుల‌ను కొన్నా, అమ్మినా.. లావాదేవీ చేసిన వారి వివ‌రాలను రిజిస్ట్రార్లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు తెలియజేయాలి. అదేవిధంగా రూ.10 ల‌క్ష‌లకు మించి మ్యూచువ‌ల్ ఫండ్లు, బాండ్లు, షేర్లు కొనుగోలు చేసిన‌ప్పుడు వాటిని జారీ చేసే సంస్థ‌లు ప‌న్ను శాఖ‌కు నివేదిస్తాయి. ఇలా ప‌రిమితికి మించిన లావాదేవీలు జ‌రిపిన‌ప్పుడు ఆయా లావాదేవీల పూర్తి స‌మాచారం, వ‌డ్డీ ఆదాయం, మూల‌ధ‌న రాబ‌డితో స‌హా సంస్థ‌లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు తెలియ‌జేస్తాయి.

అలాగే టీడీఎస్ (మూలం వ‌ద్ద ప‌న్ను), టీసీఎస్ (మూలం వ‌ద్ద సేక‌రించిన ప‌న్ను)ల‌కు సంబంధించిన స‌మాచారం కూడా ఫారం 26ఏఎస్‌లో పొందుప‌రుస్తారు. ఉద్యోగుల‌కు సంబంధించి సంస్థ‌లు డిడ‌క్ట్ చేసిన టీడీఎస్ కూడా ఫారం 26ఏఎస్‌లో ప్ర‌తిబింబిస్తుంది. టీడీఎస్‌, టీసీఎస్ త‌గ్గింపులు, ఇత‌ర లావాదేవీల‌ గురించిన స‌మాచారాన్ని, సంస్థ‌లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు తెలియ‌ప‌రిచే క్ర‌మంలో ఎక్క‌డైనా పొర‌పాట్లు జ‌ర‌గ‌వ‌చ్చు. ఒక‌వేళ ఆ పొర‌పాటు మీ విష‌యంలో జ‌రిగి, ఏదైనా ఎంట్రీ త‌ప్పుగా న‌మోదైతే ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచి నోటీసులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి, ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఫారం 26ఏఎస్‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ్రువీకరించుకోవాలి. 

త‌ప్పుల‌ను సరిదిద్దడం ఎలా?
ఫారం 26ఏఎస్‌లోని వివ‌రాలు త్రైమాసిక ప్రాతిప‌దిక‌న అప్‌డేట్ చేస్తారు. ఈ ఫారంను ఆదాయపు శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని.. లావాదేవీల‌కు సంబంధించి మీ వ‌ద్ద ఉన్న ప‌త్రాల‌తో స‌రిచూసుకోవాలి. ఒక‌వేళ ఏదైనా ఎంట్రీ త‌ప్పుగా న‌మోదు అయ్యి ఉంటే స‌రిచేయ‌వ‌ల‌సిందిగా సంబంధిత సంస్థ‌ను కోర‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చిన వ‌డ్డీ ఆదాయ‌న్ని త‌ప్పుగా న‌మోదు చేసి ఉంటే.. సంబంధిత స్టేట్‌మెంట్‌తో పాటు బ్యాంకును సంప్ర‌దిస్తే బ్యాంకు వారు ఆ త‌ప్పుల‌ను స‌రిచేసి, ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు తెలియ‌జేస్తారు. ఒక‌వేళ త‌గ్గించిన టీడీఎస్‌ను ఫైల్ చేయ‌కపోతే, వీలైనంత త‌ర్వ‌గా ఫైల్ చేయ‌మ‌ని టీడీఎస్ డిడ‌క్ట‌ర్‌ను అభ్య‌ర్థించ‌వ‌చ్చు. ఒక‌వేళ మీ ఫారం 26ఏఎస్‌లో కూడా ఏదైనా స‌మాచారం త‌ప్పుగా న‌మోదు అయ్యి ఉంటే సరిదిద్దుకుని గ‌డువుకు ముందే ఐటీఆర్‌ను స‌బ్మిట్‌ చేయండి. త్వ‌రగా ఫైల్ చేయ‌డం వ‌ల్ల ఆల‌స్య రుసుము ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు. అలాగే, రీఫండ్‌లు కూడా త్వ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని