TCS: 2022-23లో టీసీఎస్ సీఈఓ వేతనం ₹29 కోట్లు

TCS: వివిధ కీలక పదవుల్లో ఉన్నవారి వేతనాలకు సంబంధించిన వివరాలను టీసీఎస్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 

Published : 07 Jun 2023 16:50 IST

ముంబయి: టీసీఎస్‌ మాజీ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ (Rajesh Gopinathan) గత ఆర్థిక సంవత్సరంలో రూ.29.16 కోట్లు వేతనంగా అందుకున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 13.17 శాతం అధికం. 2022- 23లో గోపీనాథన్‌ (Rajesh Gopinathan) రూ.25 కోట్లు కమీషన్‌గా, రూ.1.73 కోట్లు వేతనంగా, రూ.2.43 కోట్లు ఇతర ప్రయోజనాల కింద పొందినట్లు టీసీఎస్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

2023 మే 31 వరకు సీఈఓ పదవిలో ఉన్న గోపీనాథన్‌ (Rajesh Gopinathan) వరుసగా ఆరేళ్ల పాటు ఆ బాధ్యతల్లో కొనసాగారు. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీకి నేతృత్వం వహించినప్పటికీ.. ఇతర సంస్థల సీఈఓలతో పోలిస్తే గోపీనాథన్‌ (Rajesh Gopinathan) వేతనం చాలా తక్కువ. అలాగే టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పదోన్నతి పొందడానికి ముందు సీఈఓ బాధ్యతల్లో ఉన్న ఎన్‌.చంద్రశేఖరన్‌ (N Chandrasekaran) వేతనంతో పోల్చినా గోపీనాథన్‌ వేతనం తక్కువే. సీఎఫ్‌ఓ పదవిలో ఉన్న సమయంలో గోపీనాథన్‌ 2016- 2017లో రూ.6.22 కోట్లు వేతనంగా పొందారు. సీఈఓగా పదోన్నతి పొందిన తర్వాత అది రెండింతలై రూ.12.5 కోట్లకు చేరింది. అప్పటి నుంచి ఏటా పెరుగుతూ వచ్చింది. పదవీ బాధ్యతలను బదిలీ చేయడంలో భాగంగా గోపీనాథన్‌ (Rajesh Gopinathan) సెప్టెంబరు వరకు కంపెనీతోనే ఉండనున్నారు.

గోపీనాథన్‌ స్థానంలో వచ్చిన కె.కృతివాసన్‌ (K Krithivasan) నెలకు రూ.10 లక్షలు మూల వేతనంగా పొందనున్నారు. అది రూ.16 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు కమీషన్‌, ఇతర ప్రయోజనాలను బోర్డు నిర్ణయించనుంది. అద్దె రహిత నివాసం కూడా ప్రయోజనాల్లో భాగం.

మరోవైపు కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌.జి.సుబ్రమణియం 2022-23లో మొత్తం రూ.23.60 కోట్లు పరిహారంగా పొందారు. అంత క్రితం ఏడాది ఆయన రూ.20 కోట్లు అందుకున్నారు. మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 13.58 శాతం పెరిగినట్లు టీసీఎస్‌ తెలిపింది. కంపెనీలో ఉన్న 6.14 లక్షల శాశ్వత ఉద్యోగుల వేతనం సగటున 5.11 శాతం పెరిగినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని