TCS: ఆ ఆలోచనే రాజీనామాకు దారితీసింది: టీసీఎస్‌ సీఈఓ

TCS: చేసే పనిపై ఎప్పుడైతే తన మనసు పూర్తిగా కేంద్రీకృతం కాలేదో.. అప్పుడే ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నానని గోపీనాథన్‌ (TCS CEO) తెలిపారు.

Published : 17 Mar 2023 15:41 IST

ముంబయి: ఇంకా ఏదో చేయాలనే ఆలోచనలు తన మదిలో గత కొంత కాలంగా మెదులుతున్నాయని తాజాగా రాజీనామా చేసిన టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ (TCS CEO Rajesh Gopinathan) తెలిపారు. ఇదే విషయాన్ని టాటా సన్స్‌ ఛైర్మన్‌, తన మెంటార్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌తో చర్చించినట్లు వెల్లడించారు. అయితే, కంపెనీని ఇంకా కొంతకాలం నడపడాన్నే ఇప్పటి వరకు ప్రాధాన్యంగా పెట్టుకున్నానని తెలిపారు.

ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడం కంటే సవాళ్లతో కూడుకున్న పని మరొకటి ఉండదని గోపీనాథన్‌ (TCS CEO) అన్నారు. గత పదేళ్లుగా తాను అదే పనిచేస్తున్నానని తెలిపారు. అది తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. అయితే, ఓ మైలురాయి దాటగానే..  ‘తర్వాతేంటి..?’ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు. చేసే పనిపై ఎప్పుడైతే తన మనసు పూర్తిగా కేంద్రీకృతం కాలేదో.. అప్పుడే ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నానని గోపీనాథన్‌ (Rajesh Gopinathan) తెలిపారు. ఆ నిర్ణయమే తాను రాజీనామా చేయడానికి దారితీసిందన్నారు. తాను ఇప్పటి వరకు అలంకరించిన పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. అత్యంత నమ్మకంతో తాను ఆ బాధ్యతల్ని నిర్వర్తించానన్నారు. ఇక్కడ కూర్చొని భవిష్యత్తు ప్రణాళికల్ని రచించడం సరికాదని తాను భావించానన్నారు. గత 22 ఏళ్లుగా మరో ఆలోచన లేకుండా టీసీఎస్‌ కోసం పనిచేశానని తెలిపారు. తనలో కంపెనీ ఓ భాగమై పోయిందంటూ టీసీఎస్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

తర్వాత ఏం చేయాలో తాను ఇంకా నిర్ణయించుకోలేదని గోపీనాథన్‌ (Rajesh Gopinathan) తెలిపారు. అయితే, కొత్తగా ఎన్నికైన సీఈఓ కృతివాసన్‌కు బాధ్యతల్ని సాఫీగా బదిలీ చేయడమే తన తక్షణ కర్తవ్యమని తెలిపారు. కావాల్సినప్పుడు తాను కంపెనీకి కచ్చితంగా అందుబాటులో ఉంటానన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితులు నెలకొన్న సమయంలో వైదొలగుతుండడంపై స్పందిస్తూ.. గత పదేళ్లలో తనకు ఇదే అత్యంత స్థిరమైన కాలంగా కనిపిస్తోందన్నారు. ఇంతకంటే ఒడుదొడుకులు గతంలో చవిచూశామన్నారు. అలాంటి సమయంలో అందరం ఏకతాటిపై నిలబడి సమర్థంగా సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు.

కొత్త సీఈఓ బాధ్యతలు స్వీకరించగానే భారీ మార్పులు చేసే సంస్కృతి టీసీఎస్‌లో లేదని కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న కృతివాసన్‌ తెలిపారు. అయితే, చెన్నై నుంచి బయటకు వెళ్లడమే తనకు కాస్త ఇబ్బందికరమైన విషయమని సరదాగా వ్యాఖ్యానించారు. కస్టమర్ల అవసరాలను తీర్చడమే తమ తొలి కర్తవ్యమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని