TCS Q1 Results: టీసీఎస్‌ లాభం ₹12,040 కోట్లు.. పెరిగిన ఉద్యోగుల సంఖ్య

TCS Q1 Results: ఐటీ దిగ్గజం టీసీఎస్‌ జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది.

Published : 11 Jul 2024 18:38 IST

TCS Q1 Results | దిల్లీ: దేశంలో మళ్లీ త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో 8.7 శాతం వృద్ధితో రూ.12,040 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో లాభం రూ.11,074 కోట్లుగా ఉంది. మార్చితో త్రైమాసికంతో పోలిస్తే 3.1 శాతం క్షీణించడం గమనార్హం. మొత్తం ఆదాయం 5.4 శాతం వృద్ధితో 62,613 కోట్లుగా ఉంది.

  • కంపెనీ బోర్డు రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్‌ బోర్డు ఖరారు చేసింది. ఆగస్టు 5న చెల్లింపులు చేయనున్నట్లు తెలిపింది. జులై 20ని రికార్డు తేదీగా ప్రకటించింది.
  • సమీక్షా త్రైమాసికంలో కొత్తగా 5,452 మందిని నియమించుకున్నట్టు టీసీఎస్‌ తెలిపింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరినట్లు పేర్కొంది మొత్తం ఉద్యోగుల్లో 35.5 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని, 151 దేశాలకు చెందిన వారు ఉన్నారని టీసీఎస్‌ తెలిపింది. వలసల రేటు 12.1%గా ఉన్నట్లు తెలిపింది.

బజాజ్‌ బాటలో టీవీఎస్.. త్వరలో CNG స్కూటర్‌..?

కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఆల్‌ రౌండ్‌ వృద్ధితో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని టీసీఎస్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె కృతివాసన్‌ అన్నారు. ఫ్రాన్స్‌లో టీసీఎస్‌ పేస్‌పోర్ట్‌, అమెరికాలో ఐఓటీ ల్యాబ్‌తో పాటు లాటిన్‌ అమెరికా, కెనడా, యూరప్‌లలో డెలివరీ కేంద్రాల ఏర్పాటు ద్వారా కంపెనీ తన క్లయింట్‌ రిలేషన్‌షిప్‌ను విస్తృతం చేసుకుంటోందని తెలిపారు. ఈ త్రైమాసికంలో వార్షిక వేతన పెంపుల ప్రభావం ఉన్నప్పటికీ.. మెరుగైన ఫలితాలను సాధించగలిగామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సమీర్‌ సేక్సారియా  పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్యలో వృద్ధి సంతృప్తినిచ్చిందన్నారు. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో స్వల్పంగా క్షీణించి రూ.3,902.00 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని