Financial Planning: పిల్లలకు డబ్బు విలువ తెలియజెప్పండిలా!

తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసు నుంచే డబ్బు విలువను తెలియజేయాలి. ఇతర విషయాలతో పాటు, డబ్బు, ఆర్థిక నిర్వహణ వంటివి నేర్పించేందుకు ప్రాధాన్యతనివ్వాలి.

Updated : 17 Oct 2022 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని, వారు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందుకోసం తమ సంతోషాలను కూడా పక్కన పెట్టి డబ్బును పొదుపు చేసి ఉన్నత చదువులు చదివిస్తుంటారు. వారి మీద ఉన్న ప్రేమతో అడిగిన ప్రతిదీ కొనిచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో డబ్బు విషయాలను వారితో మాట్లాడడం వల్ల వారిపై చెడు ప్రభావం పడుతుందేమో అని భయపడుతుంటారు. దీంతో వారిని డబ్బు సంబంధిత విషయాలకు దూరంగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారికి భవిష్యత్తులో డబ్బు విలువ తెలయదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోలేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసు నుంచే డబ్బు విలువను తెలియజేయాలి. ఇతర విషయాలతో పాటు, డబ్బు, ఆర్థిక నిర్వహణ వంటివి నేర్పించేందుకు ప్రాధాన్యమివ్వాలి.

ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి..

పిల్లలు ప్రయోజకులు కావాలంటే పుస్తకాల ద్వారా అందించే విజ్ఞానం ఒక్కటే సరిపోదు. ఆచరణాత్మక (ప్రాక్టికల్‌) జ్ఞానం ఉండాలి. ఉదాహరణకి, క్లాస్‌ రూమ్‌లో లెక్కల పాఠాలు నేర్చుకుంటారు. అందులో.. మీ వద్ద ఇంత డబ్బు ఉంది.. దుకాణానికి వెళ్లి కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు.. ఎంత బిల్లు అయ్యింది? బిల్లు చెల్లించగా మళ్లీ మీ వద్ద ఎంత డబ్బు ఉంటుంది? ఇలా లెక్కలు వస్తాయి. అయితే ఇవి ఊహాత్మకంగా మాత్రమే ఉంటాయి. కాబట్టి పిల్లలు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. కానీ మీరు వస్తువులను కొనేందుకు దుకాణానికి వెళ్లినప్పుడు మీ పిల్లలను కూడా మీతో పాటు తీసుకెళ్లి, వారి చేత షాపింగ్‌ చేయిస్తే, ఇవే లెక్కలను వారు ఆచరణాత్మకంగా చేస్తారు కాబట్టి, వారు కూడా తెలుసుకునేందుకు, చేసేందుకు ఉత్సుకత చూపుతారు. దీంతో వారికి ప్రాక్టికల్‌గా ఆర్థిక విషయాలు అలవడతాయి. దీనివల్ల డబ్బు ఎలా నిర్వహించాలో పిల్లలకు అర్థం అవుతుంది. అంతేకాకుండా మీ పిల్లల సామర్థ్యం మీకు తెలుస్తుంది.

అవసరానికి, కోరికకు వ్యత్యాసం తెలియజేయాలి..

కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు పాకెట్‌ మనీ ఇస్తారు. కానీ, వారు దాన్ని ఎందుకు ఖర్చు చేస్తున్నారో గమనించరు. ఒక్కోసారి ఏదైనా వస్తువు కావాలని పిల్లలు అడిగితే కొనిచ్చేందుకు చూస్తారు తప్పితే..ఇది పిల్లలకు నిజంగా అవసరమా తెలుసుకోరు. ఇది సరైన పద్ధతి కాదు. మీ పిల్లలు ఏదైనా వస్తువు కావాలని అడిగితే.. అది వారికి నిజంగా అవసరమా?  లేకపోయినా పని జరుగుతుందా? అని తెలుసుకుని కొనుగోలు నిర్ణయం తీసుకోండి. ఒకవేళ అవసరం లేదు అనిపిస్తే.. ఎందుకు వద్దో వారికి ఓపికతో వివరంగా తెలియజేయండి. అవసరానికి, కోరికకు ఉన్న వ్యత్యాసం తెలిస్తే  పిల్లలు ఆలోచించడం మొదలుపెడతారు. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపును పెంచుకోగులుగుతారు. ఎక్కడ ఖర్చు తగ్గించుకుంటే ఎక్కువ పొదుపు చేయగలరో కూడా తెలుసుకుంటారు. ఇది భవిష్యత్తులో ఆర్థిక ప్రణాళిక నిర్వహణ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. 

డబ్బు విలువ తెలియజెప్పాలి..

రోజులు గడుస్తున్న కొద్దీ వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. 20 ఏళ్ల కిందట పిల్లలకు రెండు రూపాయిలు ఇస్తే.. పిల్లలు సంతోషించేవారు. దాంతో చాకెట్లు వగైరా కొనుక్కునే వారు. కానీ నేటి రోజుల్లో రెండు రూపాయలకు ఏం వస్తుంది అంటే.. మనం కూడా టక్కున చెప్పలేని పరిస్థితి. దీంతో ద్రవ్యోల్బణం డబ్బు విలువను ఏవిధంగా తగ్గిస్తుందో తెలుసుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు కష్టతరం కావొద్దంటే వారికీ డబ్బు విలువను తెలియజెప్పాలి. బడ్జెట్‌ వేయడం, దాని ప్రకారం ఖర్చు చేయడం, పొదుపు, పెట్టుబడి, రాబడి వంటి ప్రాథమిక విషయాలను పిల్లలకు తెలియజేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఇవి భవిష్యత్తులో పిల్లలకు ఎంతగానో సహాయపడతాయి.

ఇలా చేయచ్చు..

పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపును అలవాటు చేసేందుకు..ఒక పిగ్గీ బ్యాంకును వారికి కొనివ్వండి. తల్లిదండ్రులతో పాటు తాతయ్య, నానమ్మలు, బంధువులు ఏదో సందర్భంలో వారికి డబ్బు ఇస్తుంటారు. ఇలా బహుమతిగా వచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా దాచుకోమని చెప్పండి. కొంత పెద్ద వయసు పిల్లలు అయితే.. బ్యాంకు ఖాతాను తెరిచి ఇవ్వండి. పాకెట్‌ మనీతో పాటు.. ఇలా వచ్చిన డబ్బును కూడా వారి ఖాతాలో జమ చెయ్యండి. ప్రస్తుతం చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు చిన్నపిల్లలకు బ్యాంకు ఖాతా సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే, వారి వయసును బట్టి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఖాతా నిర్వహించుకునే అవకాశం ఇస్తున్నాయి కాబట్టి పిల్లలు చేసే ఖర్చులను తెలుసుకోవడం సులభం అవుతుంది. కాలేజీ స్థాయి విద్యార్ధులు అయితే.. మీ క్రెడిట్‌ కార్డుపై యాడ్‌ ఆన్ క్రెడిట్‌ కార్డును కూడా ఇవ్వచ్చు. అయితే యాడ్‌ ఆన్-కార్డు బిల్లును చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమిక కార్డు దారునిపైనే ఉంటుంది. కాబట్టి కార్డు దుర్వినియోగం కాకుండా పిల్లలు చేసే ఖర్చులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

ఇతర ఆర్థిక విషయాల్లోనూ అవగాహన..

ప్రస్తుతం ఆర్థిక విషయాలు అంటే.. డబ్బు సంపాదించడం, ఖర్చు చేయడం, పొదుపు మాత్రమే కాదు. పెట్టుబడుల గురించి అవగాహన ఉండాలి. ముఖ్యంగా నేటి డిజిటల్‌ యుగంలో ఆర్థిక లావాదేవీలు సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతున్నాయి. వీటి గురించి సరైన అవగాహన ఉంటేనే భవిష్యత్తులో కఠిన సమయంలోనూ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బ్యాంకింగ్‌కు సంబంధించిన విషయాలతో పాటు స్టాక్‌ మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, ఎక్కడ ఏ స్టాక్‌లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందో తెలియాలి. లక్ష్యం ఆధారంగా పెట్టుబడులు పెట్టడం, సరైన సమయంలో విత్‌డ్రా చేయడం వంటివి విషయాల పట్ల అవగాహన కల్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని