అమెరికాలోనే కాదు.. సింగపూర్‌లోనూ మనోళ్ల ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌!

అమెరికాలోని టెక్‌ కంపెనీల నిర్ణయాలు సింగపూర్‌లోని భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు, టెక్‌ రంగంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు తాత్కాలికమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Published : 14 Nov 2022 21:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొద్దిరోజులుగా అమెరికన్‌ టెక్‌ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, లేఆఫ్‌ల పేరుతో భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.  కేవలం అమెరికాలోనే కాదు.. సింగపూర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో నష్టపోతున్నవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్‌ కంపెనీలు అమెరికా తర్వాత ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌ కోసం తమ ప్రధాన కార్యాలయాలను సింగపూర్‌లో నిర్వహిస్తుంటాయి. ఇక్కడి కార్యాలయ్యాల్లో పనిచేసే వారిలో ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. సింగపూర్‌ మానవవనరుల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం 1,77,100 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన ఉద్యోగులుంటే వారిలో 45,000 మంది భారతీయులే ఉన్నారట. ఈ నేపథ్యంలో టెక్‌ కంపెనీల నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

ట్విటర్‌, మెటా బాటలోనే

ఇప్పటి దాకా ట్విటర్‌ 50 శాతం మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తే.. మెటా ఏకంగా 11,000 మందికి ఉద్వాసన పలికింది. తాజాగా ట్విటర్‌ ఔట్‌సోర్సింగ్ విభాగంలో మరో 4,400 మందికి ఉద్వాసన పలికింది. మెటా తొలగించిన ప్రతి వెయ్యి మందిలో వంద మంది సింగపూర్‌లో పనిచేస్తున్న వారే. మరోవైపు పలు కంపెనీలు ఉద్యోగుల నియామకాలను నిలిపివేశాయి. సింగపూర్‌కు చెందిన ప్రముఖ గేమింగ్ కంపెనీ గరేనా మాతృ సంస్థ సీ లిమిటెడ్‌ జూన్‌, సెప్టెంబరు నెలలో చేపట్టాల్సిన నియామక ప్రక్రియను వాయిదా వేసింది.  ప్రస్తుతం ఈ సంస్థలో 67,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్టార్టప్‌ కంపెనీలు సైతం పెద్ద కంపెనీలనే అనుసరిస్తున్నాయి. ఏడు వేల మంది ఉద్యోగులున్న డిజిటల్ చెల్లింపుల సంస్థ స్ట్రైప్‌ కూడా 14 శాతం మానవ వనరులను తగ్గించుకుంటామని ప్రకటించింది.

మెర్సర్‌ అనే జాబ్‌ కన్సల్టింగ్‌ అండ్ రిక్రూట్‌మెంట్ కంపెనీ కథనం ప్రకారం.. ఆసియాలో టెక్నాలజీ రంగంలో అవసరమైన దానికంటే అధిక సంఖ్యలో ఉద్యోగార్థులు ఉన్నట్లు తెలిపింది. 2018తో పోలిస్తే  వియత్నాం, చైనాల్లో టెకీల నియామకాలు పెరిగాయని వెల్లడించింది. 1990-2000 మధ్య కాలంలో కూడా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఇదే పరిస్థితి తలెత్తిందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

ఎందుకీ పరిస్థితి?

కరోనా సమయంలో  ఎక్కువ మంది ఇంటికే పరిమితం కావడంతో డిజిటల్‌ కంటెంట్‌ చూసే వారి సంఖ్య పెరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆన్‌లైన్‌ సేవలకు డిమాండ్ పెరగడంతో టెక్‌ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో క్రమంగా డిమాండ్ తగ్గుతూ వస్తోంది. మరోవైపు మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో కంపెనీలు ఆర్థికంగా భారాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని తొలగింపులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి తాత్కాలికమేనని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని