Offer letters: ఫ్రెషర్లకు టెక్‌ సంస్థల షాక్‌.. ఆఫర్‌ లెటర్లు వెనక్కి!

ఫ్రెషర్లకు కొన్ని ఐటీ సంస్థలు షాకిచ్చాయి. తమ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారంటూ గతంలో ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను వెనక్కి తీసుకున్నాయి.

Published : 03 Oct 2022 21:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రెషర్లకు కొన్ని ఐటీ సంస్థలు షాకిచ్చాయి. తమ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారంటూ గతంలో ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను వెనక్కి తీసుకున్నాయి. ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత చాలా రోజులపాటు వారిని ఉద్యోగంలోకి తీసుకోకుండా.. ఇప్పుడు ఆఫర్‌ లెటర్లను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఉద్యోగార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఆఫర్‌ లెటర్లు వెనక్కి తీసుకున్న ఐటీ సంస్థల్లో విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. వందల సంఖ్యలో అభ్యర్థులకు ఇలాంటి అనుభవం ఎదురైందని ‘ది హిందూ బిజినెస్‌ లైన్‌’ తన కథనంలో రాసుకొచ్చింది.

మూడు నాలుగు నెలల క్రితం టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు తాము దరఖాస్తు చేసుకున్నామని, పలు దఫాల ఇంటర్వ్యూలు అనంతరం తమకు ఆఫర్‌ లెటర్లు అందాయని పలువురు తెలిపారు. అయితే, తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా కంపెనీలు తాత్సారం చేశాయని విద్యార్థులు తెలిపారు. తాజాగా తమకు గతంలో ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను సైతం వెనక్కి తీసుకున్నాయని పేర్కొన్నారు. కంపెనీకి కావాల్సిన అర్హత ప్రమాణాలు లేని కారణంగా ఆఫర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇ-మెయిల్స్‌లో తెలిపాయని విద్యార్థులు పేర్కొన్నట్లు ‘బిజినెస్‌ లైన్‌’ తెలిపింది. దీనిపై ఆయా కంపెనీలు స్పందించాల్సి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు కలవరపెడుతున్న వేళ ఐటీ సంస్థలు ఆఫర్‌ లెటర్లను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణం పెరగడం, కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచడం వంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ పరిశ్రమ నెమ్మదించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో ఐటీ సెక్టార్‌లో నియామక కార్యకలాపాలు 10 శాతం మేర తగ్గాయని నౌకరీ ఇటీవలే తన సర్వే నివేదికలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని