Apple: యాపిల్‌ కీలక నిర్ణయం.. 100 మంది ఉద్యోగుల తొలగింపు

గత కొంతకాలంగా దిగ్గజ టెక్‌ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఖర్చు తగ్గింపులపై దృష్టిపెట్టాయి. నియామకాలను తగ్గించుకోవడంతో పాటు ఉద్యోగుల్లో కోత వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి

Published : 16 Aug 2022 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొంతకాలంగా దిగ్గజ టెక్‌ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఖర్చు తగ్గింపులపై దృష్టిపెట్టాయి. నియామకాలను తగ్గించుకోవడంతో పాటు ఉద్యోగుల్లో కోత వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా టెక్‌ దిగ్గజం యాపిల్‌ కూడా ఇదే బాట పట్టింది. 100 మంది కాంట్రాక్టు రిక్రూటర్లను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది.

యాపిల్‌ కొత్త నియామకాలు తగ్గించుకున్న నేపథ్యంలో రిక్రూటర్ల అవసరం తగ్గింది. దీంతో ఆ విభాగంలో ఉన్న ఒప్పంద సిబ్బందిని సంస్థ తొలగించింది. 100 మంది ఒప్పంద రిక్రూటర్ల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వారికి రెండు వారాల వేతన చెల్లింపులతో పాటు ఇతర వైద్యపరమైన ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. అయితే పూర్తిస్థాయి రిక్రూటర్లను మాత్రం విధుల్లో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక అవసరాల మేరకే ఈ కోతలు చేపట్టినట్లు యాపిల్‌ వివరణ ఇచ్చింది. యాపిల్‌లో ఉద్యోగుల కోతలు తప్పవని ఆ సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ గత నెలలోనే సూచనప్రాయంగా వెల్లడించారు. ఖర్చు తగ్గింపుపై సంస్థ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు.

కాగా.. మరో దిగ్గజ సంస్థ గూగుల్‌ కూడా త్వరలోనే ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు పనితీరు మెరుగుపర్చుకొని అంచనాలను అందుకోలేకపోతే భవిష్యత్తులో కంపెనీలో కొనసాగే అవకాశం ఉండదని గూగుల్‌ ఉన్నతాధికారులు హెచ్చరించారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో మెరుగుదల కనిపించకపోతే చర్యలు తప్పవని ఆ సంస్థ సేల్స్‌ టీమ్‌కు సందేశం వచ్చింది. ఇక, మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా తమ సంస్థ సిబ్బందిని ఈ విషయంపై హెచ్చరించారు. పనితీరు, ఉత్పాదకత సరిగా లేని సిబ్బందిని వదిలించుకోవడమే సరైన నిర్ణయమని ఆయన అన్నారు. అటు ట్విటర్‌ కూడా గత కొన్ని నెలలుగా నియామకాలు నిలిపివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని