5G spectrum: క్యాప్టివ్‌ నెట్‌వర్క్‌పై టెల్కోల ఆందోళన.. ప్రీ బిడ్‌ కాన్ఫరెన్స్‌లోనూ అదే చర్చ

ప్రైవేట్‌ క్యాప్టివ్‌ నెట్‌వర్క్స్‌ పేరిట టెక్‌ కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్‌ (5G spectrum) కేటాయించాలన్న నిర్ణయంపై టెలికాం కంపెనీల ఆందోళన కొనసాగుతోంది.

Published : 20 Jun 2022 20:50 IST

దిల్లీ: ప్రైవేట్‌ క్యాప్టివ్‌ నెట్‌వర్క్స్‌ పేరిట టెక్‌ కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్‌ (5G spectrum) కేటాయించాలన్న నిర్ణయంపై టెలికాం కంపెనీల ఆందోళన కొనసాగుతోంది. ఇదే విషయమై గత కొద్ది రోజులుగా గళమెత్తుతూ వస్తున్న టెల్కోలు.. తాజాగా టెలికాం విభాగం నిర్వహించిన ప్రీ-బిడ్‌ సదస్సులోనూ ఈ అంశాన్ని లేవనెత్తినట్లు సమాచారం. దీంతో పాటు 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

జులై 26న నిర్వహించే 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి సోమవారం టెలికాం విభాగం ప్రీ-బిడ్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ సొంత అవసరాలకు వాడుకునేందుకు (క్యాప్టివ్‌ నెట్‌వర్క్స్‌) టెక్‌ కంపెనీలకు స్పెక్ట్రమ్‌ కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనే ముఖ్యంగా ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇదే విషయమై ప్రైవేటు టెలికాం కంపెనీలు భాగస్వాములుగా ఉన్న టెలికాం సంఘం కాయ్‌ సైతం ఇటీవల డాట్‌కు లేఖ రాసింది. నాన్‌ పబ్లిక్‌ నెట్‌వర్క్స్‌ను కేవలం నిర్దేశిత ప్రాంతంలో మెషిన్‌-టు- మెషిన్‌ కమ్యూనికేషన్‌కు, ఆటోమేషన్‌కు మాతమ్రే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. పబ్లిక్‌ నెట్‌వర్క్స్‌లో ఆ కంపెనీలు ఎలాంటి జోక్యం చేసుకోకూడదని తమ లేఖలో పేర్కొన్నాయి. జులై నెలఖారు కల్లా వేలం ప్రక్రియ పూర్తవుతుందని, ఏడాది చివరి నాటికి 20-25 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని