Telecom: 5జీ విస్తరణ.. టారిఫ్‌ల పెంపు.. 2023లో టెలికాం టార్గెట్‌!

2022లో అనేక సంస్కరణలు, 5జీ ప్రారంభాన్ని చూసిన టెలికాం రంగం 2023పై కొత్త ఆశలతో ముందుకెళ్తోంది. 

Updated : 30 Dec 2022 15:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు భారత వృద్ధిలో కీలక పాత్ర పోషించిన టెలికాం రంగం తర్వాత కొన్నేళ్లకు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అనేక సంస్థలు కకావికలమై వ్యాపారం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. తదనంతరం వచ్చిన అనేక సంస్కరణలతో పునరుజ్జీవం పోసుకొని స్థిరత్వం సాధించింది. 2022లో 5జీ (5G Nerwork) రాకతో కొత్త శకాన్ని ఆహ్వానించి ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. 5G సేవలతో ప్రజలను అనుసంధానించడం దగ్గరి నుంచి నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం వరకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా నెట్‌వర్క్‌లను విస్తరించడానికి రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాలని ఆకాంక్షిస్తోంది. వీటితో పాటే పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టారిఫ్‌ ఛార్జీలను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.

కంపెనీల పెట్టుబడులు ఇలా..

ఇప్పటికే దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ టెలికాం వ్యాపారం జియో ద్వారా 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం 2023 చివరినాటికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంట్లో రూ.87,946 కోట్లు స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.1.12 లక్షల కోట్లను పూర్తిగా 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ, అనుసంధానం కోసం 2023లో వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ రూ.27,000-28,000 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ 2023లో దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ విస్తరణకు రూ.16,000 కోట్లు కేటాయించనుంది. దీన్నే తదనంతరం 5జీకి అప్‌గ్రేడ్‌ చేయనుంది. మరో వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ ఇంకా తమ పూర్తిస్థాయి టెలికాం ప్రణాళికల్ని ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా 2023లో టెలికాం రంగం రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుంది.

2022లో అనేక సంస్కరణలు..

2022లో టెలికాం రంగంలో అనేక నిర్మాణాత్మక సంస్కరణలు వెలుగుచూశాయని సీఓఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.పి.కొచ్చర్‌ తెలిపారు. ఇ-కెవైసీ; స్పెక్ట్రమ్‌ వినియోగ రుసుముల తొలగింపు; ప్రత్యక్ష మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐ; బ్యాంకు గ్యారంటీలు, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు, వడ్డీరేట్లు, జరిమానాలు, రైట్‌ ఆఫ్‌ వే లాంటి అంశాల హేతుబద్ధీకరణ వంటి సంస్కరణలు 2022లో టెలికాం రంగంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. అలాగే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సర్కార్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా టెలికాం మౌలికవసతుల కల్పనకు అనువైన విధానాలను తీసుకొచ్చాయని డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ టి.ఆర్‌.దువా తెలిపారు.

వారానికి 2,500 5జీ బేస్‌ స్టేషన్లు..

దేశంలో వారానికి 2,500 కొత్త 5జీ బేస్‌ స్టేషన్లను ఏర్పాటవుతున్నాయని ఇటీవల పార్లమెంటులో టెలికాం శాఖ సహాయ మంత్రి దేవూసిన్హా చౌహాన్‌ తెలిపారు. నవంబరు 26 నాటికి దేశవ్యాప్తంగా 20,980 మొబైల్‌ బేస్‌ స్టేషన్లు ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు టెలికాం గేర్‌ తయారీ సంస్థలు నోకియా, ఎరిక్సన్‌ భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద 42 టెలికాం గేర్‌ తయారీ సంస్థలు రూ.4,115 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు