Updated : 26 Mar 2022 17:21 IST

Home Loan: హోంలోన్‌ తీసుకోవడానికి 3/20/30/40 రూల్‌!

ఇల్లంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మీ స్తోమత, లక్ష్యం, అవసరాలను బట్టి నిర్ణయం ఉండాలి. సామాన్యులు రుణం లేకుండా సొంత ఇల్లు కట్టుకోవడం అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే. ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకెళ్తే అప్పుల ఊబిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ఆర్థిక నిపుణులు సూచించిన 3/20/30/40 రూల్‌ని పాటిస్తే గృహరుణం తీసుకొనేటప్పుడు సహాయంగా ఉంటుంది. ఇంతకీ ఈ రూల్‌ ఏం చెబుతుందో చూద్దాం..!

ఈ రూల్‌ను 1980-90లలో మోర్టగేజ్‌ రంగంలో పాటించేవారు. కానీ, కాలక్రమంలో ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావడం.. ప్రజల ఆదాయ వనరులు పెరగడం.. భారీ బిజినెస్‌ చేయాలన్న ఆర్థిక సంస్థల లక్ష్యాల వల్ల ఇది మరుగునపడింది. కానీ ఈ నియమం సామన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రూల్‌కు కట్టుబడి ఉండడం వల్ల చిన్న ఇల్లు కొనుక్కోవచ్చేమో! కానీ, ఆ చిన్న గూడులోనైనా ఆనందంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా గడిపే అవకాశం ఉంది. ఇల్లు కోసం తీసిన రుణం మీ పాలిట గుదిబండగా మారే ప్రమాదం ఉండదు!

ఈ రూల్‌లోని ఒక్కో సంఖ్య ఒక్కో విషయాన్ని తెలియజేస్తోంది. అవేంటో చూద్దాం..

3- మీ ఇంటి మొత్తం ఖర్చు..

మీ ఇంటి ఖర్చు మీ వార్షికాదాయానికి మూడు రెట్లకు మించొద్దని రూల్‌లోని మొదటి అంకె మూడు సూచిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడాదికి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడనుకుంటే.. ఇంటి ఖర్చు రూ.15 లక్షలకు మించొద్దు. ఇంత తక్కువ ధరతో పట్టణాలు, నగరాల్లో ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం అసాధ్యమే. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తులు, షేర్లు వంటి వాటిని విక్రయించి డబ్బు సమకూర్చుకోవడం మేలు. అయితే, ఒక ఆస్తిని అమ్మే ముందు అంత విలువ చేసే ఇల్లు మీ సొంతమవుతుందా లేదా అంచనా వేసుకోవాలి. లేదంటే పప్పులో కాలేసినట్లే! అలాగే మీరు ఇల్లు కొంటున్న లేదా నిర్మిస్తున్న చోట ఆస్తుల విలువ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే.. చిన్న పట్టణాలకు బదిలీ కావడం లేదా మీ ఆదాయం పెరిగే వరకు వేచి చూడడం వంటి ప్రత్యామ్నాయాలను ఆచరించడం మేలు!

20 - రుణ కాలపరిమితి..

మీ గృహరుణ కాలపరిమితి 20 ఏళ్లకు మించకూడదు. కాలపరిమితి తగ్గితే.. మీరు బ్యాంకుకు చెల్లించే వడ్డీ మొత్తం కూడా తగ్గుతుంది. అయితే, ఈఎంఐ పెరుగుతుంది. అది చెల్లించే స్తోమత ఉండాలి. అయితే, మరీ దీర్ఘకాలం పొడిగించుకుంటే.. చాలా సొమ్ము రుణ చెల్లింపునకే కేటాయించాల్సిన వస్తుంది. ఒకవేళ ఈఎంఐకి చెల్లించే సొమ్ములో కొంత మొత్తాన్ని నెలనెలా స్మార్ట్‌గా ఇన్వెస్ట్‌ చేసి ఎక్కువ మొత్తంలో సంపాదించగలరనుకుంటే తప్ప కాలపరిమితిని 20 ఏళ్లు మించకుండా చూసుకోవాలి.

30- ఈఎంఐ మొత్తం..

ఏటా మీరు చెల్లించాల్సిన ఈఎంఐల మొత్తాన్ని రూల్‌లోని మూడో సంఖ్య 30 సూచిస్తుంది. అన్ని రుణాలకు కలుపుకొని మీరు చెల్లించే ఈఎంఐ మీ వార్షిక ఆదాయంలో 30 శాతాన్ని మించొద్దు. ఉదాహరణకు మీరు ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నారనుకుందాం. మీకు ఉన్న అన్ని రుణాల ఈఎంఐల మొత్తం ఏడాదికి రూ.1,50,000 దాటొద్దు. అంటే మీ నెలవారీ ఈఎంఐల మొత్తం రూ.12,500 కంటే ఎక్కువ ఉండొద్దు.

40- కనీస డౌన్‌పేమెంట్..

ఇల్లు కొనేటప్పుడు లేదా కట్టేటప్పుడు ఇంటి మొత్తం ఖర్చులో కనీసం 40 శాతం డబ్బు మీ చేతి నుంచి చెల్లిస్తే మేలు. పూర్తిగా రుణంపైనే ఆధారపడితే.. దీర్ఘకాలంలో భారంగా మారే అవకాశం ఉంది. పైగా తక్కువ సమయంలో రుణం పూర్తయితే.. ఇల్లు వీలైనంత త్వరగా మీ సొంతమైనట్లవుతుంది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది.

నిజం చెప్పాలంటే.. ఈ నియమానికి ఎలాంటి శాస్త్రీయత లేదు. అనేక ఏళ్ల పాటు ఆర్థిక వ్యవస్థలో పనిచేసి.. ప్రజల జీవన స్థితిగతుల్ని గమనిస్తూ.. రుణ రంగంలో విస్తృత అధ్యయనం చేసిన కొంతమంది నిపుణులు సూత్రీకరించింది మాత్రమే. ఈ నియమాన్ని పాటించిన వారు త్వరగా రుణం చెల్లించడంతో పాటు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేదని గమనించడమే.. దీనికి ఉన్న ఏకైన శాస్త్రీయత!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని