UPI: యూపీఐ చెల్లింపులు పెరిగాయ్‌..డెబిట్‌ కార్డు చెల్లింపులు తగ్గాయ్‌

పెద్దనోట్ల రద్దు తరవాత, గత అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థలో క్రమబద్ధీకరణ పెరుగుతూ వచ్చింది. అయినా నగదు చెలామణీ (సీఐసీ) కూడా అధికమవుతూనే ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది.

Updated : 21 Nov 2021 09:55 IST

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

ముంబయి: పెద్దనోట్ల రద్దు తరవాత, గత అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థలో క్రమబద్ధీకరణ పెరుగుతూ వచ్చింది. అయినా నగదు చెలామణీ (సీఐసీ) కూడా అధికమవుతూనే ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. గత అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థలోని 80 శాతం వరకు నగదేతర విభాగాలను (రైతు రుణాలు సహా) క్రమబద్ధీకరించారు. అయితే ఇపుడు నగదు చెలామణీ గరిష్ఠ స్థాయికి చేరువైంది. కొవిడ్‌ పరిణామాలు కూడా నగదు లావాదేవీలు అధికమయ్యేందుకు కారణమయ్యాయి. ఏ వస్తువునూ అంటుకునే అవసరం లేకుండా మొబైల్‌ ద్వారా జరిగే యూపీఐ లావాదేవీలు 2017తో పోలిస్తే దాదాపు 70 శాతం పెరిగినా, డెబిట్‌ కార్డు లావాదేవీలు బాగా తగ్గాయి.

* నోట్ల రద్దు అనంతరం నగదు చెలామణీ జీడీపీ విలువలో 8.7 శాతానికి తగ్గింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇది 13.1 శాతంగా నమోదైంది. 2020-21లో కరోనా పరిణామాల్లో ఇది 14.5 శాతంగా ఉంది. ఆసుపత్రి ఖర్చులు, ఇతర అత్యవసరాల కోసం ఎక్కువమంది నగదును చెంత ఉంచుకుంటున్నారు.

* 2007-08 నుంచి 2009-10 వరకు ఆర్థిక వ్యవస్థ రాణించిన సమయంలో సీఐసీ వరుసగా 12.1 శాతం; 12.5%, 12.4 శాతంగా నమోదైంది. ఆ తర్వాత అయిదేళ్ల వరకు ఇదే ధోరణి కొనసాగింది. 2020-21లో 14.5 శాతం వద్ద గరిష్ఠ స్థాయిని చేరుకుంది. ప్రజలు ముందు జాగ్రత్తగా రూ.3.3 లక్షల కోట్లను నగదు రూపంలో ఉంచుకోవడం ఇందుకు కారణం. ఆ సమయంలో జీడీపీ 7.3 శాతం క్షీణించింది.

* అక్టోబరు 2021లో యూపీఐ ద్వారా రూ.6.3 లక్షల కోట్ల విలువైన మొత్తం 350 కోట్ల లావాదేవీలు జరిగాయి. అక్టోబరు 2020తో పోల్చితే ఇవి రెట్టింపు కావడం గమనార్హం. 2017తో పోలిస్తే యూపీఐ లావాదేవీలు 69 రెట్లు పెరిగాయి.

* క్రెడిట్‌ కార్డు వ్యయాలు 2012లో రూ.1500 కోట్ల మేర జరగ్గా.. 2018లో రూ.10,100 కోట్లకు పెరిగాయి. 2020లో రూ.13,500 కోట్లకు చేరాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.13,300 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి.

* డెబిట్‌ కార్డు వ్యయాలు 2012లో రూ.12,100 కోట్ల మేర జరగ్గా.. 2016కు రూ.38,800 కోట్లకు పెరిగాయి. అయితే 2017లో రూ.15,600 కోట్లకు తగ్గినా, మళ్లీ 2018లో రూ.32,700 కోట్లకు; 2019లో రూ.56,300 కోట్లకు చేరాయి. కొవిడ్‌ ప్రభావం చూపిన 2020లో రూ.13,800 కోట్లకు తగ్గిపోయాయి. 2021లో ఇప్పటిదాకా రూ.9700 కోట్ల విలువైన లావాదేవీలే నమోదయ్యాయి. అత్యధికంగా యూపీఐ లావాదేవీలు పెరగడమే ఇందుకు కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని