క్ర‌మంగా ఆదాయం పొందేందుకు పెట్టుబ‌డి ప‌థ‌కాలు

వ్య‌క్తిగ‌త ఖాతాలో ఒక‌రు రూ.4.5 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాలో రూ.9 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌మ చేయ‌వ‌చ్చు....

Updated : 01 Jan 2021 17:46 IST

రెగ్యుల‌ర్‌గా ఆదాయం పొంద‌డం ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు. ఇప్పుడు దానికి త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డులు పెడితే క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. దీనికోసం 10 ర‌కాల పెట్టుబ‌డుల ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌చ్చు.

1.పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ :

ఈ స్కీమ్ ద్వారా నెల‌కు కొంత క‌చ్చిత‌మైన ఆదాయం పెట్టుబ‌డుల నుంచి పొంద‌వ‌చ్చు. ఈ ప‌థ‌కం కింద వ‌డ్డీ రేటు ప్ర‌స్తుతం 7.60 శాతంగా ఉంది. పెట్టుబ‌డుల కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు. వ్య‌క్తిగ‌త ఖాతాలో ఒక‌రు రూ.4.5 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాలో రూ.9 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌మ చేయ‌వ‌చ్చు. దీనిపై వ‌చ్చిన‌ వ‌డ్డీ ఆదాయం, మీ మొత్తం ఆదాయంతో క‌లిపి దాని ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు.

2. ఫిక్స్‌డ్ డిపాజిట్ :

ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) త‌క్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబ‌డిగా చెప్ప‌వ‌చ్చు. ఇందులో క‌చ్చిత‌మైన కాల‌ప‌ర‌మితి, రాబ‌డి ఉంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డనివారు, కొంత క‌చ్చిత‌మైన మొత్తాన్ని పెట్టుబ‌డిగా పెట్టి వ‌డ్డీని పొందాల‌నుకునేవారికి ఇది స‌రిపోతుంది. దీంతో నెల‌వారిగా, త్రైమాసికంగా లేదా వార్షికంగా రాబ‌డి పొంద‌వ‌చ్చు. కాల‌ప‌రిమితిపై ఆధార‌ప‌డి వ‌డ్డీ రేటు ఉంటుంది. సాధార‌ణంగా బ్యాంకు ఎఫ్‌డీ 7-8 శాతం రాబ‌డి ఇస్తుంది. మొత్తం కాల‌ప‌రిమితి ముగిశాక వ‌డ్డీని తీసుకోవ‌చ్చు లేదా క్ర‌మంగా ఆదాయాన్ని పొందే ఆప్ష‌న్‌ను ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు X అనే వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌లు ఏడాది కాల‌ప‌రిమితితో ఎఫ్‌డీ చేస్తే వార్షికంగా 8 శాతం రాబ‌డి పొంద‌వ‌చ్చు. సంవ‌త్స‌రానికి వ‌డ్డీ రూ.8 వేలు ల‌భిస్తుంది. ఎఫ్‌డీ ద్వారా వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే మీ ఆదాయం ప‌న్ను ప‌ర‌మితికి మించి లేక‌పోతే ఫారం 15G/15H స‌మ‌ర్పించి ప‌న్ను మినహాయింపును పొంద‌వ‌చ్చు.

3. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్ :

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్ ప్ర‌త్యేకంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ప్ర‌త్యేక‌మైన‌ది. 60 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు క‌లిగిన‌వారు మాత్ర‌మే ఇందులో పెట్టుబ‌డులు పెట్టాలి. మెచ్యూరిటీ కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు. వార్షిక‌ వ‌డ్డీ రేటు 8.60 శాతం. మూడు నెల‌ల‌కోసారి వ‌డ్డీ ఆదాయం చెల్లిస్తారు.

4. మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి మంత్లీ ఇన్‌క‌మ్ ప్లాన్‌ :

కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్లకు నిర్మాణాత్మ‌కంగా నెల‌వారిగా ఆదాయం ఇచ్చే విధంగా రూపొందించారు. అవే మ్యూచువ‌ల్ ఫండ్ల మంత్లీ ఇన్‌క‌మ్ ప్లాన్స్ (ఎంఐపీ). మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్, ఎఫ్‌డీ లేదా సీనియ‌ర్ సిటిజ‌న్ స్కీముల మాదిరిగా మ్యూచువ‌ల్ ఫండ్ ఎంఐపీ క‌చ్చిత‌మైన రాబ‌డి ఇస్తుంద‌ని చెప్ప‌లేం. దీనిపై రాబ‌డి 7.9 శాతంగా ఉంటుంది. ఎంఐపీ నుంచి వ‌చ్చే మొత్తాన్ని డివిడెండ్‌గా పిలుస్తారు. పెట్టుబ‌డుదారుల‌కు డివిడెండ్‌పై ప‌న్ను ఉండ‌దు.

5. మ్యూచువ‌ల్ ఫండ్‌ సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ (ఎస్‌డ‌బ్ల్యూపీ) :

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి ఎంపిక. మీరు ఈక్విటీ లేదా డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేస్తే ఎస్‌డ‌బ్ల్యూపీ ఆప్ష‌న్ ఎంచుకొని నెల‌వారిగా ఆదాయం పొందే అవ‌కాశం ఉంది.

6.మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి డివిడెండ్ :

కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్లు డివిడెండ్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో డివిడెండ్ ఆప్ష‌న్ ఎంచుకొని క్ర‌మంగా ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. అయితే ఈ మ్యూచువ‌ల్ ఫండ్లు డివిడెండ్ నెల‌వారిగా కాకుండా ఏడాదికోసారి ఇస్తాయి. మీరు పెట్టుబ‌డుల కోసం వేర్వేరు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకుంటే రెగ్యుల‌ర్‌గా ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు.

7. స్టాక్స్ నుంచి డివిడెండ్ :

స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులు కొంత రిస్క్‌తో కూడుకున్న‌వి. అయితే దీనిపై అవ‌గాహ‌న ఉంటే మంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చు. స్టాక్స్ ద్వారా వ‌చ్చే లాభాల‌తో పాటు డివిడెండు కూడా ల‌భిస్తుంది. ఈక్విటీల నుంచి డివిడెండును క‌చ్చితంగా ఆశించ‌లేము. పెట్టుబ‌డుల‌ను 10-12 స్టాకుల్లో పెడితే రెగ్యుల‌ర్ ఆదాయాన్ని పొందే అవ‌కాశం ఉంటుంది. రిస్క్ తీసుకోనివారు అయితే స్టాక్ పెట్టుబ‌డుల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది.

8. స్థిరాస్తి నుంచి పొందే అద్దె :

క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొందేందుకు స్థిరాస్తి ఒక మంచి సాధ‌నం. దీని పెట్టుబ‌డులు ఎక్కువ‌ రిస్క్‌, ఎక్కువ రాబ‌డి క‌లిగి ఉంటాయి. స్థిరాస్తిని అద్దెకు ఇవ్వ‌డం ద్వారా ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. అయితే స‌రైన‌ అద్దెదారులు లేక‌పోతే లేదా ప్రాప‌ర్టీ ధ‌ర‌లు త‌గ్గితే ఇందులో కొంత ప్ర‌తికూల‌త‌లు ఎదుర‌వుతాయి. దూరంగా ఉన్న ప్రాంతాల్లో అద్దె త‌క్కువ‌గా ల‌భించ‌వ‌చ్చు.

9. దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ బాండ్లు :

సుర‌క్షిత‌మైన‌, క్ర‌మ‌మైన ఆదాయం పొందేందుకు దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ బాండ్లు మంచి ఎంపిక‌. ప్ర‌భుత్వ బాండ్ల‌పై రాబ‌డి సాధార‌ణంగా 7-8 శాతం ఉంటుంది. ఆరు నెల‌ల‌కోసారి వ‌డ్డీ చెల్లిస్తారు. ఇవి ఎక్కువ కాల‌ప‌రిమితి క‌లిగి ఉంటాయి. గ‌డువు ముగిశాక పెట్టుబ‌డుల మొత్తం తిరిగి ల‌భిస్తుంది. ఈ బాండ్లు సెకండ‌రీ మార్కెట్‌లో కూడా ట్రేడ‌వుతాయి. కావాల‌నుకుంటే వాటిని విక్ర‌యించ‌వ‌చ్చు.

10. బీమా సంస్థ‌ల నుంచి యాన్యుటీ :

బీమా పాల‌సీల నుంచి యాన్యుటీగా కూడా రెగ్యుల‌ర్ ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. అయితే ఇందులో ఆదాయం పెరిగేందుకు స‌మ‌యం తీసుకుంటుంది. దీనిపై రాబ‌డి, పెన్ష‌న్ కాల‌ప‌ర‌మితి, పాల‌సీపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఎక్కువ ఛార్జీలు ఉండ‌టం వ‌ల‌న సాధార‌ణంగా రాబ‌డులు త‌క్కువ‌గా ఉంటాయి.

దీనికి బ‌దులుగా చిన్న వ‌య‌సులోనే ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు ప్రారంభించ‌డం మంచిది. దీంతో ప‌ద‌వీ విమ‌ర‌ణ త‌ర్వాత జీవితం కోసం అవ‌స‌రమ‌య్యే మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవ‌చ్చు. అదేవిధంగా రిటైర్మెంట్ త‌ర్వాత పెన్ష‌న్ కూడా పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని