Term Insurance: టర్మ్‌ బీమా పాలసీతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సంపాదించే వ్యక్తిపై కుటుంబం ఆధారపడితే..ఆ వ్యక్తికి తగినంత  టర్మ్ బీమా ఉండడం చాలా అవసరం. టర్మ్ ప్లాన్లో ఎలాంటి ప్రయోజాలను పొందొచ్చో చూద్దాం..

Updated : 05 Nov 2022 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా గురించి తెలియని వారుండరు. గతంలో పెట్టుబడులతో కూడిన జీవిత బీమా (ఎండోమెంట్‌) పాలసీలను భారీగా కొనుగోలు చేసేవారు. ఇప్పుడు అనేక ప్రైవేట్‌ బీమా కంపెనీల రాకతో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు డిమాండ్‌ పెరిగింది. ఎవరైనా కుటుంబానికి ఏకైక సంపాదనదారు అయితే, వారు కచ్చితంగా టర్మ్‌ బీమా పాలసీ వెంటనే కొనుగోలు చేయాలి. ఇందులో ప్రీమియం తక్కువ.. కవరేజీ ఎక్కువ ఉంటుంది.

చిన్న వయసులోనే ఈ పాలసీ కొనుగోలు చేయడం మంచిది. ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. వయసు బట్టి ప్రీమియం ధరలు మారతాయి. ఉదాహరణకు 25 సంవత్సరాల వ్యక్తి 60 ఏళ్ల కాలవ్యవధికి నెలకు రూ.1,000-1,200 ప్రీమియం చెల్లిస్తే రూ.1 కోటి వరకు టర్మ్‌ బీమాను పొందొచ్చు. మీరు పాలసీ వ్యవధి అంతటా ఈ స్థిర మొత్తాన్ని చెల్లిస్తారు. దురదృష్టవశాత్తు పాలసీదారు ఏ కారణంచేతైనా మరణం చెందితే ఈ మొత్తం ఆ కుటుంబానికి అందుతుంది.

టర్మ్‌ కవర్‌ అంచనా

టర్మ్‌ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, హామీ మొత్తం మీ వార్షిక వేతనానికి 10-12 రెట్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీదారుని పిల్లల విద్య, వివాహ ఖర్చులు, ఇల్లు, కారు వంటి వాటికి తీసుకునే రుణాలు, ఇంటి ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టర్మ్‌ ప్లాన్‌ కవరేజీని నిర్ణయించుకునేటప్పుడు పాలసీదారుని అన్ని ఆర్థిక బాధ్యతలను దృష్టిలో పెట్టుకోవాలి.

మెచ్యూరిటీ

పాలసీదారుడు పాలసీ కాలపరిమితి ముగిసేవరకు జీవించి ఉంటే.. మెచ్యూరిటీ అనంత‌రం బీమా కంపెనీ ఎలాంటి చెల్లింపులు చేయ‌దు. ప్రతి సంవత్సరం పాల‌సీని పునరుద్ధరించుకోవడం మంచిది. చాలా బీమా సంస్థలు 'రిట‌ర్న్ ఆఫ్ ప్రీమియం'తో కూడిన ట‌ర్మ్ ప్లాన్‌ల‌ను కూడా ఇస్తున్నాయి. ఇక్కడ పాల‌సీదారుడు పాల‌సీ కాలవ్యవధి ముగిసేవరకు జీవించి ఉన్నా కూడా వారు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని బీమా కంపెనీలు తిరిగి ఇచ్చేస్తాయి. కానీ, ఈ పాల‌సీల్లో ప్రీమియం అధికంగా ఉంటుంది.

నామినీ సౌకర్యం

నామినీగా సాధార‌ణంగా పాల‌సీదారు త‌ల్లిదండ్రులు, జీవిత భాగ‌స్వామి లేదా పిల్లలు ఉండే అవ‌కాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో బంధువుల‌ను కూడా నామినీలుగా పేర్కొన‌వ‌చ్చు. నామినేష‌న్ ప్రకియ ద్వారా, పాల‌సీదారు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో బీమా ప్రయోజనాలను బీమా కంపెనీ నామినీ బ్యాంకు ఖాతాకు బ‌దిలీ చేస్తారు. 

పాలసీదారు వారి అవసరాలకు అనుగుణంగా వారి టర్మ్‌ ప్లాన్‌ను రూపొందించుకునే అవకాశం ఉంది. వీటిని రైడర్స్‌ అని పిలుస్తారు. ఇవి పాలసీదారుని ప్రయోజనాలను పెంచడానికి పాలసీకి జోడించిన యాడ్‌ ఆన్‌లు. పాలసీదారునికి ఇవి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

వైకల్యం నుంచి రక్షణ

ఈ రైడర్‌తో ఏదైనా ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా పాక్షిక వైకల్యం కలిగిన వారు కొన్ని నెలల వరకు ఆదాయం పొందుతారు. శాశ్వత వైకల్యం చెందితే పాలసీదారు జీవితాంతం ప్రతి నెలా బీమా సంస్థ నిర్థేశించిన మొత్తాన్ని పొందుతారు.

ఇన్‌కమ్‌ బెనిఫిట్‌ రైడర్‌

ఈ రైడర్‌ ఇప్పటికే ఉన్న టర్మ్‌ బీమా పాలసీకి అదనం. పాలసీదారుడు మరణిస్తే.. పాలసీదారునిపై ఆధారపడినవారు సుమారు 5-10 సంవత్సరాల పాటు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఇది పాలసీదారుడి నెలవారీ ఆదాయానికి సమానమైన మొత్తాన్ని లబ్ధిదారులకు చెల్లిస్తుంది. కుటుంబానికి ఏకైక సంపాదన కలిగిన పాలసీదారునికి ఈ రైడర్‌ అనుకూలంగా ఉంటుంది.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌

పాలసీ వ్యవధిలో పాలసీదారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, బీమా చేసిన వ్యక్తికి నిర్దేశిత మొత్తం అందుతుంది. ఈ రైడర్‌ ఆసుపత్రిలో, వెలుపల క్లిష్టమైన చికిత్స ఖర్చుకు ఆసరాగా ఉంటుంది. క్లిష్టమైన అనారోగ్య ప్రయోజనంతో కూడిన రైడర్‌ను కలిగి ఉండడం మంచిది. అయితే, రైడర్‌లో నిర్ధిష్ట వ్యాధులు, అనారోగ్యాలకు కవరేజీని అందించని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల రైడర్‌ తీసుకునేటప్పుడు ఏ వ్యాధులకు బీమా కవరేజీ ఉంటుందో, ఉండదో తెలుసుకోవాలి.

ప్రీమియం మినహాయింపు రైడర్‌

పాలసీదారునికి ఆదాయ నష్టం, శారీరక బలహీనత/వైకల్యం ఏర్పడి భవిష్యత్‌లో ప్రీమియంలు చెల్లించలేకపోవచ్చు. ఈ రైడర్‌ ఉంటే.. ప్రీమియంలు చెల్లించకపోయినా బీమా సంస్థ వాటిని మాఫీ చేస్తుంది. అంతేకాకుండా టర్మ్‌ బీమా కవరేజీ యాక్టివ్‌గానే ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు

టర్మ్ ప్లాన్ ప్రీమియంపై సెక్షన్‌ 80సి కింద పాలసీదారు క్లెయిమ్‌ చేయగల గరిష్ఠ మొత్తం సంవత్సరానికి రూ. 1.50 లక్షలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని