Tesla price cut: చైనాలో 40 శాతం తక్కువ ధరకు టెస్లా కార్లు!

ప్రత్యర్థి సంస్థ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు టెస్లా చైనాలో కార్ల ధరల్ని తగ్గించింది.

Published : 06 Jan 2023 12:31 IST

బీజింగ్‌: ప్రపంచంలో అతిపెద్ద విద్యుత్తు వాహన విపణిగా ఉన్న చైనాలో టెస్లా (Tesla) తమ కార్ల ధరలను తగ్గించింది (Tesla Price Cut). ‘మోడల్‌ 3’, ‘మోడల్‌ వై’ కార్ల ధరలను మరోసారి తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అలాగే ప్రీమియం విభాగంలో పట్టు పెంచుకునేందుకు కొత్తగా ‘మోడల్‌ ఎస్‌’ సెడాన్‌, ‘మోడల్‌ ఎక్స్‌’ను ప్రవేశపెట్టింది. 

‘మోడల్‌ వై’ ఎస్‌యూవీ ధర 2,88,900 యువాన్ల నుంచి 2,59,900 యువాన్ల (37,875 డాలర్లు)కు టెస్లా తగ్గించింది (Tesla Price Cut). ఈ కారును టెస్లా (Tesla) తొలుత 65,900 డాలర్లతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దాంతో పోలిస్తే ధర ప్రస్తుతం 43 శాతం తగ్గింది. మరోవైపు తాజా తగ్గింపుతో ‘మోడల్‌ 3’ ధర మొత్తంగా 30 శాతం దిగొచ్చి 2,29,900 యువాన్లకు చేరింది. చైనాలో ఈవీ (Electic Vehicles) రంగంలో పోటీ పెరుగుతోంది. దాన్ని తట్టుకొని మాస్‌, ప్రీమియం సెగ్మెంట్లలో పట్టు నిలబెట్టుకోవడం కోసమే టెస్లా (Tesla) ధరల తగ్గింపు వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రముఖ మదుపరి వారెన్‌ బఫెట్‌ మద్దతు ఉన్న బీవైడీ కంపెనీతో పాటు Xpeng, నియో, పోర్షే ఏజీ, మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతోంది.

తాజాగా ప్రవేశపెట్టిన ‘మోడల్‌ ఎస్‌’లో ఇంటీరియర్‌ను కొత్తగా తీర్చిదిద్దినట్లు టెస్లా తెలిపింది. దీని ధర చైనాలో 7,89,900 యువాన్లుగా పేర్కొంది. మరోవైపు కేవలం 2.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల/గంటకు వేగాన్ని అందుకోగల ప్లెయిడ్‌ వెర్షన్‌ ధరను 1.01 మిలియన్‌ యువాన్లుగా నిర్ణయించింది. అలాగే ‘మోడల్‌ ఎక్స్‌’ ఎస్‌యూవీ ధర 8,89,900 యువాన్లుగా, ప్లెయిడ్‌ వెర్షన్‌ ధర 1.04 మిలియన్‌ యువాన్లుగా పేర్కొంది. చైనాలో మూడు లక్షల యువాన్ల పరిధిలో ఉన్న టెస్లా కార్లకు మంచి ఆదరణ ఉంది. షాంఘైలో ఉన్న తయారీ కేంద్రం నుంచి టెస్లా ఏటా 4,50,000 కార్లను ఉత్పత్తి చేస్తోంది. 2021 జనవరి నుంచి ‘మోడల్‌ వై’లను కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తోంది. 

2022లో షాంఘై తయారీ కేంద్రం నుంచి టెస్లా 7,10,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా టెస్లా విక్రయాల్లో 54 శాతానికి సమానం. డిసెంబరులో మాత్రం సరఫరా తగ్గింది. గిరాకీ తగ్గడం, పరికరాలను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఉత్పత్తిని నిలిపివేయడమే ఇందుకు కారణం. వరుసగా మూడో త్రైమాసికంలోనూ కార్ల డెలివరీలు అంచనాల కంటే తక్కువగా నమోదయ్యాయని టెస్లా గతవారం ప్రకటించింది. దీంతో మంగళవారం స్టాక్‌ ధర ఒక్కసారిగా 12 శాతం పతనమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని