Tesla truck: టెస్లా ట్రక్‌ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 800Km

టెస్లా తొలి సెమీ ట్రక్‌ను పెప్సికోకు అందజేసింది. 2017లోనే దీన్ని ఆవిష్కరించింది. 2019లో తయారీ ప్రారంభించింది. కానీ, కొవిడ్‌ వల్ల డెలివరీ ఆలస్యమయ్యింది. 

Updated : 02 Dec 2022 12:47 IST

డెట్రాయిట్‌: అత్యాధునిక ఫీచర్లతో కూడిన విద్యుత్తు కార్లకు పెట్టింది పేరైన టెస్లా.. ఇక నుంచి భారీ వాణిజ్య వాహనాలను కూడా అందించనుంది. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఈ వాహన తయారీ సంస్థ 2017లో సెమీ ట్రక్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 2019లో వీటి తయారీని ప్రారంభించింది. తాజాగా మూడు ట్రక్‌లను పెప్సికోకు అందజేసింది. గురువారం నెవాడాలోని ఫ్యాక్టరీలో వీటిని పెప్సికోకు మస్క్‌ ఆధ్వర్యంలో అందజేశారు.

వీటిలో ఒకదాన్ని మస్క్‌ స్వయంగా ఫ్యాక్టరీలో అందరి ముందు నడిపి పరీక్షించారు. ఒక ట్రక్‌ తెల్ల రంగులో, మరొకటి పెప్సికో లోగోతో, మరోదాన్ని ఫ్రిటో-లే రంగులతో రూపొందించారు. ఈ సెమీ ట్రక్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 37,000 కిలోల బరువుతో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని మస్క్‌ తెలిపారు. వెనుక యాక్సిల్స్‌లో నాలుగు ఇండిపెండెంట్‌ మోటార్లను అమర్చారు. 20 సెకన్లలో 0-60mph వేగాన్ని అందుకుంటుంది. ఆటోమేటిక్‌ క్లచ్‌, రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వంటి ఫీచర్లు సైతం ఉన్నాయి. ధరను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, 1,50,000 డాలర్లు ఖరీదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెప్సికో మొత్తం 100 ట్రక్కులకు ఆర్డర్‌ చేసింది. వాల్‌మార్ట్‌, ఫెడెక్స్‌ సహా మరికొన్ని కంపెనీలు కూడా వీటికోసం ఇప్పటికే ఆర్డర్‌ పెట్టినట్లు సమాచారం. 2024 నాటికి 50 వేల ట్రక్కులను తయారు చేయాలని టెస్లా ప్రణాళికలు రచిస్తోంది.

తటస్థ కర్బన ఉద్గారాల సరకుల రవాణా కోసం చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులో పెప్సికో పాల్గొంటోంది. అందులో భాగంగా స్వచ్ఛ ఇంధన రవాణా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు కాలిఫోర్నియా ఎయిర్‌ రిసొర్సెస్‌ బోర్డ్‌ 15.4 మిలియన్ డాలర్ల నిధులను సమకూరుస్తోంది. వీటిలో బ్యాటరీతో కూడిన 15 టెస్లా ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లు; విద్యుత్తు, సహజవాయువుతో నడిచే పవర్‌ ట్రక్కులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. విద్యుత్తు ట్రక్కులపై 40 వేల డాలర్ల ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందేందుకు అమెరికా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని