Tesla in India: భారత్‌లో టెస్లా ప్రతినిధుల పర్యటన.. ఎందుకో?

Tesla in India: భారత్‌లో టెస్లా ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కంపెనీకి చెందిన ప్రతినిధుల బృందం భారత్‌లో పర్యటించనుందని సమాచారం.

Updated : 17 May 2023 13:10 IST

దిల్లీ: అత్యాధునిక టెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం, నాణ్యతతో కూడిన కార్లకు టెస్లా (Tesla) పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్లకు ఉన్న క్రేజే వేరు. చైనా, అమెరికా మార్కెట్లలో వీటి హవా కొనసాగుతోంది. అయితే, ఇప్పటి వరకు భారత్‌లోకి మాత్రం ఇవి ప్రవేశించలేదు. మన దేశ రోడ్లపై వీటి ప్రయాణాన్ని ఆస్వాదించాలని చాలా మంది ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కానీ, ధర పెద్ద అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో భారత్‌లో టెస్లా ప్రవేశంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది.

టెస్లా (Tesla)కు చెందిన కొంతమంది సీనియర్‌ ఉన్నతోద్యోగులు ఈవారంలోనే భారత్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులతోనూ వీరు భేటీ అయ్యే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అయితే, దీనిపై ఇటు ప్రభుత్వం నుంచి కానీ, అటు టెస్లా (Tesla) నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

భారత్‌లో టెస్లా తమ కార్లను నేరుగా విక్రయించడం లేదు. అలాగే ఇక్కడ తయారీ కూడా చేపట్టడం లేదు. కానీ, కార్ల తయారీకి కావాల్సిన కొన్ని పరికరాలను మాత్రం భారత్‌ నుంచి సమకూర్చుకుంటోంది. దీన్ని మరింత విస్తరించే దిశగా తాజాగా చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్‌లో సోనా గ్రూప్‌ టెస్లా (Tesla)కు డిఫరెన్షియల్‌ గేర్లను అందిస్తోంది. అలాగే సంధార్‌ టెక్నాలజీస్‌ పలు ఇతర పరికరాలను అందిస్తోంది. అయితే, ఇది చాలా పరిమిత మొత్తంలో జరుగుతోంది.

పరిశ్రమ వర్గాలు మాత్రం టెస్లా (Tesla) ప్రతినిధుల రాకకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. టెస్లా ప్రతినిధులు కేవలం పరికరాల సేకరణ విస్తరణకు మాత్రమే పరిమితం కాకపోవచ్చునని భావిస్తున్నారు. భారత్‌లో ప్రవేశంపై ప్రస్తుతానికి నిలిచిపోయిన చర్చల్ని తిరిగి ప్రారంభించేందుకు ఇది నాంది కావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లోకి ప్రవేశించడానికి సంబంధించిన ప్రణాళికలను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు 2022లో టెస్లా ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత్‌లోకి దిగుమతి చేసుకునే విలాసవంతమైన కార్లపై ప్రభుత్వం భారీ ఎత్తున సుంకం విధిస్తోంది. ‘కాస్ట్‌ ఇన్సూరెన్స్‌ ఫ్రెయిట్‌’ విలువ 40,000 డాలర్లు దాటిన కార్లపై 100 శాతం సుంకం వర్తిస్తోంది. టెస్లా (Tesla) మోడళ్లన్నీ దాదాపు ఈ కేటగిరీలోకే వస్తున్నాయి. దీంతో పన్నులను తగ్గించాలని టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇక్కడి ప్రభుత్వాన్ని కోరారు. తర్వాత విక్రయాల తీరును బట్టి స్థానికంగా తయారీపై ఆలోచిస్తామని తెలిపారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. ఇతర వాహన తయారీ సంస్థల తరహాలోనే టెస్లాను సైతం పరిగణిస్తామని తేల్చి చెప్పింది. భారత్‌లోనే తయారీని చేపట్టడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని.. అప్పుడు కార్లకు డిమాండ్‌ ఉంటుందని చెప్పింది. కనీసం విడి భాగాలుగా తీసుకొచ్చి భారత్‌లో అసెంబుల్‌ చేసే విధానం (CKD)పైనైనా దృష్టి సారించాలని టెస్లా (Tesla)కు భారత ప్రభుత్వం సూచించింది.

ప్రస్తుతం మెర్సిడెస్‌, ఫోక్స్‌వ్యాగన్‌ వంటి దిగ్గజ సంస్థలు సీకేడీ విధానంలోనే తమ కార్లను భారత్‌లో విక్రయిస్తున్నాయి. టెస్లా (Tesla) సైతం ఈ విధానాన్ని అవలంబించాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సీట్లు, టైర్లు, గ్లాసులు, అంతర్గత ఫిట్టింగులు స్థానికంగానే సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. దీని వల్ల తయారీ ఖర్చు గణనీయంగా తగ్గతుందని తెలిపారు. మరోవైపు సుంకాల తగ్గింపు విషయంలో టెస్లా (Tesla)కు ప్రత్యేక మినహాయింపునిచ్చే అంశాన్ని దేశీయ వాహన తయారీ కంపెనీలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల మేకిన్ ఇండియా స్ఫూర్తి దెబ్బతింటుందని వాదిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు