Tesla: భారత్‌కు రానున్న టెస్లా ప్రతినిధుల బృందం.. ప్రధానితో భేటీ?

ట్విటర్‌ సీఈవో బాధ్యతలను లిండా యాకరినోకు అప్పగించిన తర్వాత మస్క్(Elon Musk) టెస్లా(Tesla) విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ వారంలో టెస్లా ప్రతినిధుల బృందం భారత్‌లో పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Published : 16 May 2023 23:10 IST

దిల్లీ: ఎలక్ట్రిక్‌ కార్ల (EV) తయారీ సంస్థ టెస్లా (Tesla).. భారత్‌లో కార్ల విక్రయం, తయారీపై దృష్టి సారించనుంది. బుధ లేదా గురువారాల్లో టెస్లా ప్రతినిధుల బృందం భారత్‌కు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా టెస్లా ప్రతినిధులు ప్రధాని మోదీతోపాటు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ (PM Narendra Modi) వచ్చే నెలలో అమెరికా (USA) పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో టెస్లా కార్ల తయారీ, విక్రయం, పన్ను, విడిభాగాల దిగుమతి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఒకవేళ  టెస్లా ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే.. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలోనే దీనిపై ఒప్పందం జరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్‌ నెలకొల్పాలని మస్క్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

గత ఏడాది కాలంగా ఎలాన్‌ మస్క్‌ భారత్‌ మార్కెట్‌పై ఆసక్తి కనుబరుస్తున్నారు. అయితే, భారత్‌లో దిగుమతి పన్నులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని కోరారు. అలానే, ముందుగా విదేశాల్లో తయారు చేసిన టెస్లా వాహనాలను భారత్‌లో విక్రయిస్తామని, తర్వాత టెస్లా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్‌ తెలిపారు. మేకిన్‌ ఇన్‌ ఇండియా నినాదంలో భాగంగా మస్క్‌ ప్రతిపాదనలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ‘‘భారత్‌లో కార్ల తయారీకి మస్క్‌ సిద్ధమైతే అందుకు కావాల్సిన వనరులు, సాంకేతికత మన వద్ద ఉన్నాయి. ఆయన చైనాలో తయారుచేసిన కార్లను ఇక్కడ విక్రయించాలనుకుంటే అది సరైన ప్రతిపాదన కాదు’’ అని అప్పట్లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు.

టెస్లా కార్లు భారత్‌లో అందుబాటులో లేకపోవడం వల్ల.. లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల (Luxury EV's) మార్కెట్‌ను మెర్సిడెజ్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి కంపెనీలు స్థానికంగా తయారు చేసిన తమ ఈవీలను విక్రయిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ యూనిట్లను చైనా నుంచి భారత్‌ సహా పలు దేశాల్లో నెలకొల్పుతున్నాయి. గతంలో తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు టెస్లా యూనిట్‌ నెలకొల్పేందుకు తమ ఆసక్తిని తెలియజేస్తూ ఆహ్వానాలు కూడా పంపాయి. ఈ క్రమంలో టెస్లా ప్రతినిధుల భారత్‌ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని