Published : 22 Jul 2022 15:40 IST

Tesla sold Bitcoins: 75 శాతం బిట్‌కాయిన్లను విక్రయించిన టెస్లా

ఫ్లోరిడా: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ టెస్లా జూన్‌ త్రైమాసిక లాభాల్లో తగ్గుదల ఊహించిన దాని కంటే తక్కువగానే నమోదైంది. పలుసార్లు కార్ల ధరల్ని పెంచడమే ఇందుకు కారణం. ప్రస్తుతం తమ వాహనాల ధరలు ‘భారీ స్థాయి’లో ఉన్నాయని ఎలాన్‌ మస్క్‌ స్వయంగా చెప్పారు.

మరోవైపు కంపెనీ పేరిట ఉన్న బిట్‌కాయిన్‌ ఆస్తులు గణనీయంగా తగ్గిపోయాయి. దాదాపు 75 శాతం బిట్‌కాయిన్‌లను విక్రయించారు. వచ్చిన సొమ్మును బ్యాలెన్స్‌ షీట్‌లో నగదు కింద చూపారు. టెస్లా గత ఏడాది మార్చిలో కార్ల కొనుగోళ్లకు బిట్‌కాయిన్‌లను స్వీకరించిన విషయం తెలిసిందే. అలాగే పెద్ద ఎత్తున దీంట్లో పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా ప్రకటించింది. బిట్‌కాయన్‌కు ఆదరణ పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అయితే, తీవ్ర వ్యతిరేకత రావడంతో 49 రోజుల తర్వాత టెస్లా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

విద్యుత్తు కార్లకు డిమాండ్‌ తగ్గిందని.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని మస్క్‌ అన్నారు. అయితే, కంపెనీకి గిరాకీపరంగా ఎలాంటి సమస్య లేదన్నారు. ఉన్నదల్లా తయారీ ఇబ్బందులేనని పేర్కొన్నారు. ధరల్ని విపరీతంగా పెంచి కార్లను అందుబాటులోకి లేకుండా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిమాండ్‌ దెబ్బతింటుందన్నారు. గత ఏడాది కాలంలో టెస్లా పలుసార్లు కార్ల ధరల్ని పెంచింది. అమెరికాలో మోడల్‌ ‘వై’ ధర ప్రస్తుతం 65,990 డాలర్లు. 2021 ఆరంభంలో ఉన్న ధరతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. గురువారం కంపెనీ షేరు 1.7 శాతం పెరిగింది. గత నవంబరులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు అక్కడి నుంచి ప్రస్తుతం 40 శాతం దిగువన ట్రేడవుతోంది.

ప్రస్తుతం టెస్లా పేరిట 218 మిలియన్‌ డాలర్ల డిజిటల్‌ ఆస్తులు ఉన్నాయి. క్రితం త్రైమాసికంలో వీటి విలువ 1.26 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ పతనం వల్లే తమ లాభాలు కూడా దెబ్బ తిన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. బిట్‌కాయిన్‌ల విక్రయాల నుంచి 936 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది. చైనాలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ల కారణంగా తలెత్తిన అస్థిరతల నుంచి బిట్‌కాయిన్‌ల విక్రయం రక్షించిందని పేర్కొంది. అయితే, డోజీకాయిన్‌లను మాత్రం ఇంకా విక్రయించలేదని మస్క్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని