Tesla Stock Drop: ట్విటర్‌ డీల్‌తో టెస్లాకు ₹9 లక్షల కోట్ల నష్టం!

టెస్లా షేర్ల (Tesla Stock)ను ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కుదుర్చుకొన్న ట్విటర్‌ (Twitter) కొనుగోలు ఒప్పందం భారీగా దెబ్బతీసింది.

Updated : 27 Apr 2022 15:09 IST

వాషింగ్టన్‌: టెస్లా షేర్ల (Tesla Stock)ను ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కుదుర్చుకొన్న ట్విటర్‌ (Twitter) కొనుగోలు ఒప్పందం భారీగా దెబ్బతీసింది. మంగళవారం అమెరికా ఎక్స్ఛేంజీల్లో ఈ విద్యుత్తు కార్ల కంపెనీ షేర్లు 12 శాతం మేర పడిపోయాయి. ట్విటర్‌ కొనుగోలుకు కావాల్సిన నిధులను సీఈఓ మస్క్‌ (Tesla CEO) టెస్లా షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకోవచ్చన్న అంచనాలే దీనికి కారణం. ఈ లావాదేవీకి కావాల్సిన నిధుల్లో కొంత మొత్తాన్ని ఆయన బ్యాంకుల ద్వారా సమకూర్చుకుంటున్నారు. మిగిలిన సొమ్మును సొంతంగానే భరిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో మస్క్‌ తనకున్న టెస్లా షేర్లను (Tesla Shares) విక్రయించడమో లేక తనఖా పెట్టడమో జరుగుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

టెస్లా షేరు విలువ పతనం (Tesla stock Drop) కావడంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (Market Capitalization) మంగళవారం ఒక్కరోజే 126 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9.66 లక్షల కోట్లు) తగ్గింది. ట్విటర్‌లో తాను వాటాలు కొనుగోలు చేశానని మస్క్‌ ప్రకటించిన ఏప్రిల్‌ 4 నుంచి టెస్లా షేర్ల (Tesla Shares) విలువ దిగజారుతూ వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెస్లా మార్కెట్‌ విలువ 275 బిలియన్‌ డాలర్లు తగ్గింది. అంటే దాదాపు 23 శాతం పతనమైంది. ప్రస్తుతం మస్క్‌కు టెస్లాలో 17 శాతం వాటా ఉంది. షేర్ల ధర పడిపోవడంతో ఆయన వాటాల విలువ సైతం 40 బిలియన్‌ డాలర్లు తగ్గింది. ట్విటర్‌ కొనుగోలుకు ఆయన తరఫున చెల్లించాల్సిన 21 బిలియన్‌ డాలర్లకు ఇది దాదాపు రెట్టింపు.

టెస్లా షేర్ల పతనానికి (Tesla stock drop) ఇతర కారణాలు కూడా కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలూ టెస్లా షేర్ల అమ్మకానికి దారితీస్తున్నాయి. అలాగే అమెరికాలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణమూ మరో కారణం. మరోవైపు ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల (Rate Hike)ను భారీ ఎత్తున పెంచనున్న నేపథ్యంలో మదుపర్లు భారీ వృద్ధిరేటుకు అవకాశం ఉన్న కంపెనీల వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇంత జరుగుతున్నా మస్క్‌ మాత్రం ఇప్పటి వరకు తన వాటా అయిన 21 బిలియన్ డాలర్లను ఎలా సమకూర్చుకోనున్నారో వివరించలేదు. దీంతో టెస్లా షేర్ల (Tesla shares) విక్రయం ద్వారానే సమకూర్చుకునే అవకాశం ఉందన్న సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. గతవారం ప్రకటించిన టెస్లా త్రైమాసిక ఫలితాలు అద్భుతంగా ఉన్నప్పటికీ.. మదుపర్లు ఈ కంపెనీ షేర్ల అమ్మకానికే మొగ్గుచూపడం గమనార్హం.

ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 44 బిలియన్‌ డాలర్లతో మస్క్‌ ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేస్తానని గతవారం ప్రకటించారు. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసిన మస్క్‌. ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు. కొనుగోలు ఒప్పందం గురించి మస్క్‌తో ట్విటర్‌ బోర్డు కొన్నాళ్లుగా విస్తృత చర్చలు జరిపింది. తాజాగా దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిరింది. దీంట్లో 21 బిలియన్‌ డాలర్లు ఆయన సొంతంగా భరించనున్నట్లు ప్రకటించారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా సమీకరించుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు