Tesla: చైనాలో మెగా బ్యాటరీ కర్మాగార నిర్మాణానికి టెస్లా సై..!

అమెరికాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ దిగ్గజం టెస్లా చైనాలో మరో భారీ  ప్రాజెక్టు చేపట్టింది. పెద్ద ఎత్తున బ్యాటరీల తయారీ యూనిట్‌ను షాంఘైలో ప్రారంభించనుంది. 

Updated : 10 Apr 2023 19:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ పక్క అమెరికా(USA), చైనా(China) మధ్య వాణిజ్య యుద్ధం తారా స్థాయికి చేరుకొన్నా.. టెస్లా(Tesla) ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. చైనాలోని షాంఘైలో భారీ స్థాయిలో బ్యాటరీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ సుమారు 10,000 మెగాప్యాక్‌ స్టోరేజీ యునిట్లను ఉత్పత్తి చేసేలా ఈ కర్మాగార నిర్మాణం చేపట్టనున్నట్లు టెస్లా వెల్లడించింది. విద్యుత్తు గ్రిడ్లను స్థిరీకరించి కోతలను నివారించేందుకు ఉపయోగించే భారీ బ్యాటరీలను మెగా ప్యాక్‌లు అంటారు. టెస్లాకు ఇప్పటికే కాలిఫోర్నియాలో మెగాప్యాక్‌ ప్లాంట్‌ ఉంది. ఇక్కడ ఏటా 10,000 మెగా ప్యాక్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. 

అమెరికాలోని టెస్లా ఫ్యాక్టరీకి అదనంగా చైనాలో ఈ కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్టు ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్లాంట్‌ నిర్మాణం మొదలవుతుందని.. 2024 వేసవి నాటికి బ్యాటరీల ఉత్పత్తి మొదలయ్యే అవకాశం ఉందని చైనా మీడియా పేర్కొంది. ఇప్పటికే అత్యధికంగా బ్యాటరీలు ఉత్పత్తి చేసే దేశంగా చైనాకు పేరుంది. ఈ నేపథ్యంలో అక్కడి వనరులను వాడుకొని మరింత చౌకగా బ్యాటరీలను తయారు చేయాలని టెస్లా భావిస్తోంది. టెస్లా తొలిసారి 2019లో అమెరికా బయట చైనాలో విద్యుత్తు కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. షాంఘైలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో ఏటా 22,000 వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. జర్మనీలోని బెర్లిన్‌ సమీపంలో ఇప్పటికే టెస్లాకు మరో ప్లాంట్‌ కూడా ఉంది. దీంతోపాటు మెక్సికోలోని మాంటెర్రీలో ప్లాంట్లను నిర్మిస్తామని పేర్కొంది. 

ఇటీవల బీజింగ్‌-వాషింగ్టన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ  సమయంలో తమ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అమెరికా సూచిస్తోంది. ఈ క్రమంలోనే చైనాలో అత్యాధునిక సాంకేతిక సంస్థలను స్థాపించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వం నుంచి అందే సాయాన్ని బైడెన్‌ కార్యవర్గం నిలిపివేసింది. ఈ బ్యాన్‌ 10 ఏళ్లపాటు అమల్లో ఉండనుంది. అంతేకాదు.. అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకొనేందుకు 280 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద అమెరికా హైటెక్‌ పరికరాలు తయారు చేయడం, అత్యాధునిక పరిశోధనలు చేపట్టడం వంటివి చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని