Updated : 28 May 2022 11:46 IST

Tesla In India: భారత్‌లో టెస్లా తయారీ.. ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడప్పుడే తొలగిపోయేలా కన్పించట్లేదు. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఈ కార్ల విక్రయాలపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించేందుకు అనుమతినిస్తేనే.. దేశంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్‌ మరోసారి స్పష్టం చేశారు.

భారత్‌లో టెస్లా (Tesla) తయారీ యూనిట్‌పై ఓ ట్విటర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు మస్క్‌ సమాధానమిచ్చారు. ‘‘ముందు మా కార్లను విక్రయించేందుకు, సర్వీసులు అందించేందుకు అనుమతులు లభించని ఏ ప్రాంతంలోనూ టెస్లా తయారీ ప్లాంట్‌ను నెలకొల్పబోదు’’ అని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. భారత్‌లో టెస్లా విక్రయాలపై మస్క్‌ గతంలోనూ పలుమార్లు చేసిన ట్వీట్లు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇక్కడి ప్రభుత్వ నిబంధనలు, కొన్ని సవాళ్ల కారణంగానే టెస్లా (Telsa) రాక ఆలస్యమవుతోందని ఆ మధ్య మస్క్‌ (Elon Musk) ఓ ట్వీట్‌ చేశారు. అయితే ఆ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా తీవ్ర కసరత్తులు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామనీ.. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్‌ చెబుతున్నారు. దీంతో పాటు, భారత్‌లో విద్యుత్‌ వాహనాల(EV) దిగుమతిపై 100 శాతం సుంకం ఉందని, దీన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, మేక్‌-ఇన్‌-ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోన్న భారత ప్రభుత్వం మాత్రం ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనలకు అంగీకరించలేదు. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో కార్ల తయారీకి సిద్ధమైతే అందుకు కావాల్సిన సామర్థ్యాలు, సాంకేతికత మన వద్ద ఉన్నాయి. కాకపోతే భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని కోరుతున్నాం. కానీ, ఆయన చైనాలో తయారు చేసిన కార్లను ఇక్కడ విక్రయించాలనుకుంటే అది సరైన ప్రతిపాదన కాదు’’ అని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత్‌లో టెస్లా కార్లు విక్రయించే ప్రణాళికను ఇటీవల సంస్థ తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీని భారత్‌లోనే చేపట్టాలని పలుమార్లు స్పష్టం చేయడంతో షోరూంలు, సర్వీస్‌ సెంటర్ల కోసం ఆయా నగరాల్లో చేసిన ప్రయత్నాలను టెస్లా విరమించుకున్నట్లు ఇటీవల సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే మస్క్‌ తాజాగా చేసిన ట్వీట్‌ మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని