గృహ కొనుగోలుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు కూడా ఆశాజ‌న‌క‌మేనా!

మీరు సౌక‌ర్య‌వంత‌మైన‌ ఇంట్లో నివ‌సించాల‌ని ప్లాన్ చేస్తే ఇల్లు కొన‌డం మంచి మార్గం.

Updated : 17 Jun 2022 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్తి అని చెప్పుకునేది మొద‌ట‌గా సొంత ఇల్లే అని పెద్ద‌లు చెబుతారు. సొంత గృహం క‌లిగి ఉంటే మ‌న‌కే కాకుండా మ‌న త‌ర్వాత త‌రం వారికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ కాలంలో గృహ కొనుగోలుకు ఎక్కువ మంది వినియోగ‌దారులు బ్యాంకు రుణాల‌నే ఆశ్ర‌యిస్తుంటారు. గృహ రుణ మొత్తం ప‌రంగానే కాదు, రుణం తీర్చే కాలం కూడా సుదీర్ఘంగా 15 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటుంది. గృహ రుణం అందుబాటులో ఉన్న చౌకైన రుణాల్లో ఒక‌టి. గృహ రుణాన్ని అర్థవంత‌మైన‌ రుణం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది దీర్ఘ‌కాలికంగా అభినందించ‌గ‌ల స్ప‌ష్ట‌మైన ఆస్తిని సంపాదించ‌డంలో మీకు స‌హాయ‌ప‌డుతుంది. మీరు సౌక‌ర్య‌వంత‌మైన‌ ఇంట్లో నివ‌సించాల‌ని ప్లాన్ చేస్తే ఇల్లు కొన‌డం మంచి మార్గం. ఇటీవ‌ల ఆర్‌బీఐ రెపో రేట్‌ను పెంచినా కూడా కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు అతి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు రుణాలందిస్తున్నాయి.

ఇటీవ‌ల కాలంలో ఆర్‌బీఐ రెపో రేటు 0.90% పెంచ‌డం వ‌ల్ల బ్యాంకుల గృహ రుణాల వ‌డ్డీ రేట్లు ప్రియ‌మైనా కూడా అన్ని ర‌కాల రుణాల కంటే కూడా ఇంటి రుణాలే ఇప్ప‌టికీ చౌక‌గా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 800 కంటే ఎక్కువ‌ క్రెడిట్ స్కోర్ ఉన్న‌వారికి 7.55% వ‌డ్డీ రేటుకి గృహ రుణాల‌ను అంద‌జేస్తుంది. 750 క్రెడిట్ స్కోర్ క‌లిగిన వారికి 7.65% దాకా వ‌డ్డీ రేటును వ‌సూలు చేస్తుంది. కొన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోర్ క‌లిగిన వారికి 7 శాతానికి కూడా గృహ రుణాల‌ను అంద‌చేస్తున్నాయి. అయితే ఈ గృహ రుణాల వ‌డ్డీ రేట్లు పెరిగాయ‌ని చింతించ‌న‌క్క‌ర్లేదు అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎందుకంటే దేశ‌వ్యాప్తంగా మార్కెట్‌లో నిర్మిత‌మైన ఇళ్లు అధికంగానే ఉండ‌టం వల్ల స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే అంద‌జేయడానికి నిర్మాణ‌దారులు ఆస‌క్తి చూపిస్తున్నార‌ని ఈ రంగంలో మార్కెట్ వ‌ర్గాల అభిప్రాయం.

ఈ వ‌డ్డీ రేట్లు ఎక్కువ కాలం కొన‌సాగినా కూడా గృహ రుణం తీసుకోవ‌డానికి ఇది కూడా ఉత్త‌మ స‌మ‌య‌మే. స్థిరాస్తి ధ‌ర‌లు ప్ర‌స్తుతం ఉన్న‌ట్లుగా భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ స్థిరంగా ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌ళ్లీ నిర్మాణ ధ‌ర‌లు ఇంకా పెర‌గొచ్చు. దాంతో భ‌విష్య‌త్‌లో స్థిరాస్తి ధ‌ర‌లు పెర‌గొచ్చు. అందుచేత ఇప్పుడే గృహాల‌ను కొనుగోలు చేయ‌డం మంచి ప‌ద్ధ‌తిగా అనిపిస్తుంది. గతంతో పోలిస్తే బ్యాంకు గృహ రుణ వ‌డ్డీ రేట్లు క‌నిష్ఠ స్థాయిలోనే ఉన్నాయి. మంచి నిర్మాణ సంస్థ‌ల‌వి అయి ఉండ‌టం వల్ల ఇళ్లు నాణ్య‌తా ప‌రంగా మంచి స్థితిలో ఉంటాయి. వివాదాల చికాకులు కూడా ఉండ‌వు. వినియోగ‌దారుల‌కు బేర‌మాడే అవ‌కాశం కూడా ఉంటుంది. ఇవ‌న్నీ కూడా మంచి గృహాన్ని చేజిక్కుంచుకోవ‌డానికి వినియోగ‌దారుల‌కి ప్ర‌స్తుతం అనుకూల ప‌రిస్థితే అని చెప్పొచ్చు. 

అన‌రాక్ నుంచి వ‌చ్చిన డేటా ప్ర‌కారం మార్చి నుంచి గృహాల విక్ర‌యాలు పెర‌గ‌డ‌మే కాకుండా నిర్మాణాలు కూడా భారీ ఎత్తున పెరిగాయి. దేశంలో హైద‌రాబాద్‌తో స‌హా 7 ప్ర‌ముఖ న‌గ‌రాల్లో గృహ నిర్మాణాలు భారీగా జ‌రుగుతున్నాయి, విక్రమవుతున్నాయి కూడా. ఈ ప‌రిణామాల‌న్నీ నిర్మాణంలో ఉన్న గృహాల అధిక ల‌భ్య‌త‌కు దారితీస్తున్నాయి. గృహ రుణాలు చాలా కాలం పాటు ఉండే విభాగంలో ఉంటాయి కాబ‌ట్టి మ‌నం డ‌బ్బుకు ఉత్త‌మ‌మైన విలువ‌ను పొంద‌డానికి బ్యాంకుతోను, స్థిరాస్తి వ‌ర్గాల‌తోను వినియోగ‌దారులు చ‌ర్చ‌లు జ‌ర‌పాలి. 

బ్యాంకులు ఫ్లోటింగ్ వ‌డ్డీ రేటు లేదా స్థిర రేటుపై గృహ రుణాల‌ను అందిస్తాయి. స్థిర రుణం విష‌యంలో ఈఎంఐ స్థిరంగా ఉంటుంది. ఫ్లోటింగ్ రేటు విష‌యంలో వ‌డ్డీ రేట్లు.. రెపో రేటుతో నిర్ణయమవుతాయి. క్రెడిట్ స్కోర్‌, రుణ మొత్తం, ఆదాయాలు, రుణ కాల‌వ్య‌వ‌ధి, య‌జ‌మాని ఆర్థిక స్థిర‌త్వం మొద‌లైన అంశాల‌పై నిర్ణ‌యించ‌బ‌డుతుంది.

రుణానికి సంబంధించిన కాల వ్య‌వ‌ధిని పూర్తి చేయ‌కుండా మీరు రుణాన్ని ముందుస్తుగా చెల్లించాల‌ని ఆలోచిస్తుంటే ప్లోటింగ్ రేటును ఎంచుకోవ‌డం మంచి ఆలోచ‌న‌. ఫ్లోటింగ్ రేటు కంటే కూడా స్థిర రుణంలో వ‌డ్డీ రేటు 150 నుంచి 200 బీపీఎస్ ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంది. గృహ రుణ చెల్లింపు కాల‌ప‌రిమితి 15-30 సంవ‌త్స‌రాలు ఉంటుంది. కానీ చాలా మంది రుణగ్ర‌హీత‌లు చెల్లించే వ‌డ్డీ మొత్తాన్ని పెంచుకోకుండా ఉండ‌టానికి వీలైనంత త‌క్కువ పరిమితి ఎంచుకుంటారు.

రుణ‌గ్ర‌హీత ఎప్పుడైనా అధిక న‌గ‌దు క‌లిగి ఉన్న‌ప్పుడు ఒకేసారి ఆ మొత్తాన్ని చెల్లింపులు చేయ‌డం ద్వారా అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి బ్యాంకులు అనుమ‌తిస్తాయి. అలాగే వ‌డ్డీ మొత్తాన్ని త‌గ్గించ‌డానికి క్ర‌మం త‌ప్ప‌కుండా మీ ఈఎంఐ మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని మీ గృహ రుణ ఖాతాలో క్రెడిట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. గృహ రుణ కాల వ్య‌వ‌ధి ఎక్కువుంటే వ‌డ్డీ చెల్లింపు కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌ని గ‌మ‌నించండి.

చివ‌ర‌గా: మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడూ 750 కంటే అధికంగా ఉండేలా చూసుకోండి. గృహ రుణానికి దర‌ఖాస్తు చేసేముందు అన్ని రుణ బ‌కాయిల‌ను తీర్చేయండి. మీరు రుణాన్ని ముంద‌స్తుగా చెల్లించాల‌నే ఆలోచ‌న ఉంటే ఫ్లోటింగ్ వ‌డ్డీ రేటుని ఎంచుకోండి. వార్షిక ప్రాతిప‌దిక‌న కాకుండా నెల‌వారీ త‌గ్గింపు బ్యాలెన్స్‌పై సెట్ చేసిన రుణం కోసం చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని