Gaming Industry: ఆటలే.. ఆటలు

మనదేశంలో గేమింగ్‌ పరిశ్రమ అనూహ్యమైన వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గేమింగ్‌ పరిశ్రమ వ్యాపార పరిమాణం రూ.23,100 కోట్లకు చేరుకోవచ్చని గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్, ఇ-గేమింగ్‌ ఫెడరేషన్‌ నివేదిక అంచనా వేసింది.

Published : 11 Jul 2024 02:34 IST

ఆకాశమే హద్దుగా గేమింగ్‌ పరిశ్రమ విస్తరణ 
త్వరలో రూ.23,100 కోట్ల స్థాయికి
గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్, ఇ-గేమింగ్‌ ఫెడరేషన్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: మనదేశంలో గేమింగ్‌ పరిశ్రమ అనూహ్యమైన వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గేమింగ్‌ పరిశ్రమ వ్యాపార పరిమాణం రూ.23,100 కోట్లకు చేరుకోవచ్చని గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్, ఇ-గేమింగ్‌ ఫెడరేషన్‌ నివేదిక అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 20 శాతం వృద్ధికి సమానం. అంతేగాక మన దేశంలో ఆన్‌లైన్‌ గేమర్ల సంఖ్య చైనాను మించిపోయినట్లు, ఈ సంఖ్య 44.2 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. గేమింగ్‌ పరిశ్రమ శరవేగంగా ఎదుగుతున్నందున ఈ రంగానికి ప్రత్యేక నియమ నిబంధనలు (కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌) రూపొందించాలని, నైతిక ప్రవర్తన, పారదర్శకతకు పెద్ద పీట వేయాలని సూచించింది.

అధిక యువ జనాభాతోనే

ప్రపంచ వ్యాప్తంగా యువకుల సంఖ్య అధికంగా ఉన్నది మనదేశంలోనే. గేమింగ్‌ పరిశ్రమకు ఇదే పెద్ద సానుకూలత అవుతోంది. దీనికి తోడు డిజిటల్‌ టెక్నాలజీ పెద్దఎత్తున అందుబాటులోకి రావటం, ఇంటర్‌నెట్‌ సదుపాయాలు- స్మార్ట్‌ఫోన్ల విస్తరణ గేమింగ్‌ పరిశ్రమకు ఇంధనంగా మారాయి. దీంతో గేమింగ్‌ కంటెంట్, గేమింగ్‌ కంపెనీలు బాగా పెరుగుతున్నాయి. గేమింగ్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు  మదుపర్లు కూడా బారులు తీరుతున్నారు. గత అయిదేళ్ల కాలంలో మన దేశంలోని గేమింగ్‌ కంపెనీలు 2.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ కంపెనీల్లో విదేశీ సంస్థాగత మదుపరులు కూడా పెట్టుబడి పెట్టడం గమనార్హం.

వారానికి 8.5 గంటలు గేమింగ్‌లోనే..

రియల్‌ మనీ గేమింగ్‌ (ఆర్‌ఎంజీ) విభాగం గేమింగ్‌ పరిశ్రమకు కాసులు కురిపిస్తోంది. గేమర్లు సగటున వారానికి 8.50 గంటల సమయాన్ని గేమింగ్‌పై వెచ్చిస్తున్నారు. ఈ సమయం మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. గేమింగ్‌పై వినియోగదార్లు వెచ్చించే ఈ సమయాన్ని గేమింగ్‌ కంపెనీలు సొమ్ముగా మార్చుకునే అవకాశం ఉంది. అందువల్ల గేమింగ్‌ కంటెంట్‌కు గిరాకీ అధికంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, ఆకర్షణతో వచ్చే గేమింగ్‌ కంటెంట్‌ను ఉత్పత్తి చేయటానికి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

పన్ను భారాన్ని తట్టుకుని మరీ..

ఆర్‌ఎంజీ విభాగం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వం విధించిన 28 శాతం జీఎస్‌టీ    ఆర్‌ఎంజీ గేమింగ్‌ కంపెనీలను కష్టాల పాలు చేసింది. ఈ భారాన్ని మోయలేక ఈ విభాగంలోని కొన్ని అంకుర సంస్థలు, ఇతర కంపెనీలు మూతపడ్డాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆర్‌ఎంజీ గేమింగ్‌ విభాగం ఆదాయం 80 శాతానికి పైగా పెరిగింది. దాదాపు 10 కోట్ల మంది ఆన్‌లైన్‌ గేమర్లు ప్రతి రోజూ గేములు ఆడుతున్నారు. దీని ప్రకారం చూస్తే, పన్ను భారాన్ని ఆర్‌ఎంజీ గేమింగ్‌ విభాగం తట్టుకొని నిలిచినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సవాళ్లు అధిగమిస్తేనే..

గేమింగ్‌ పరిశ్రమకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. సైబర్‌ మోసాలు, తగిన ధ్రువీకరణలు (సర్టిఫికేషన్స్‌) లేకపోవటం, ఆర్థిక మద్దతు కొరవడటం, అత్యుత్తమ పరిశ్రమ విధానాలు వాడుకలో లేకపోవటం ఇందులో ప్రధానమైనవి. సర్టిఫికేషన్స్‌ కోసం ఒక  తటస్థ ఏజెన్సీ ఉండాలనే అభిప్రాయం ఒకటి పరిశ్రమ వర్గాల్లో ఉంది. లేదా సెల్ఫ్‌ రెగ్యులేటరీ అథారిటీ అయినా ఏర్పాటు కావాలి. దీనికి తోడు ‘కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌’ను రూపొందించటం తప్పనిసరి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గేమింగ్‌ పరిశ్రమ ఆకర్షణీయ వృద్ధిని నమోదు చేయటమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ నివేదిక వివరించింది. అదే సమయంలో గేమింగ్‌ వినియోగదార్ల రక్షణ (ప్లేయర్‌ ప్రొటెక్షన్‌)కు కూడా నియమనిబంధనలు అమలు కావాలని, మోసాల నుంచి కాపాడే వ్యవస్థ ఉండాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని