Bare Minimum Monday: బేర్‌ మినిమమ్‌ మండే.. ‘కార్పొరేట్‌’లో మరో కొత్త ట్రెండ్!

కరోనా తర్వాత ఉద్యోగుల పనిప్రదేశాల్లో కొత్త పోడకలు వస్తున్నాయి. గతంలో క్వైట్‌ క్విట్టింగ్‌ అనే పదం బాగా వినిపించగా.. ఇప్పుడు అలాంటిదే బేర్‌ మినిమమ్‌ మండే అనే ట్రెండ్‌ మొదలైంది. అసలేమిటిది?

Published : 04 Mar 2023 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ వ్యక్తిగత జీవితాలనే కాకుండా ఉద్యోగుల అభిరుచుల పైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యం చేసుకొనేందుకు ఉద్యోగులు అనుసరిస్తున్న వ్యూహాలు కార్పొరేట్‌ వరల్డ్‌లో సరికొత్త పోకడలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే క్వైట్‌ క్విట్టింగ్‌, రేజ్‌ అప్లయింగ్‌, గ్రేట్‌ రిసిగ్నేషన్‌ వంటివి రాగా.. తాజాగా మరో కొత్త ట్రెండ్‌ మొదలైంది. అదే ‘బేర్‌ మినిమమ్‌ మండే’ (Bare Minimum Monday)‌.

ఏమిటీ బేర్‌ మినిమమ్‌ మండే..

ఇది కూడా ఒకరకంగా క్వైట్‌ క్విట్టింగ్‌ (తమ పాత్ర ఎంతవరకో అక్కడికే పరిమితం కావడం ద్వారా పనిభారాన్ని తగ్గించుకోవడం) లాంటిదే. ఉద్యోగులు వీకెండ్ ఎంజాయ్‌ చేసిన తర్వాత వారం ఆరంభమయ్యే సోమవారం పని ప్రదేశాలకు వెళ్లినా అంత ఉత్సాహంగా లేకపోవడం. మిగిలిన వారాల్లో పని చేసినంత సమర్థంగా ఆరోజు పనిపై ఫోకస్‌ పెట్టలేకపోవడంతో ఉత్పాదకతపై ప్రభావం పడుతోందనేది నిపుణుల అభిప్రాయం. ఆ రోజును ఆలస్యంగా ప్రారంభించి తమ పనుల్ని పూర్తి చేసుకొని ఆఫీస్‌లకు వచ్చాక అదనంగా ఏమీ చేయకుండా సులభమైన పనులపైనే ఆసక్తి కనబరుస్తూ క్రమంగా ముఖ్య పనుల్లోకి వెళ్లే విధానాన్ని కూడా బేర్‌ మినిమమ్‌ మండేగా పేర్కొంటున్నారు. అయితే, ఈ పదం ఉపయోగించి ఓ టిక్‌ టాక్‌ యూజర్‌ వీడియో చేసి పాపులర్‌ అయ్యారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌లు, అకస్మాత్తుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి పెరగడం.. ఆ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి కార్యాలయాలు ప్రారంభం కావడంతో ఉద్యోగుల్లో పనిపై ఆసక్తి తగ్గడం మొదలైంది. ఈ క్రమంలోనే వారి పనితీరు విధానంలో కొత్త పోకడలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి తోడు టిక్‌టాక్‌ సహా సామాజిక మాధ్యమాలు జత కావడంతో ఆయా పదాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దీనిపై కెరీర్‌ ట్రెండ్స్‌ నిపుణుడు జిల్‌ కాటన్‌ ఫార్య్చూన్‌ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. ‘‘బేర్‌ మినిమమ్‌ మండేస్‌’తో ఉత్పాదకతపై తక్కువ ప్రభావమే ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఇలాంటి సమయాల్లో ఉద్యోగుల నుంచి ఏం కోరుకుంటున్నారో యాజమాన్యాలు, తమనుంచి యాజమాన్యం ఏం ఆశిస్తుందో ఉద్యోగులు తెలుసుకొని ముందుకెళ్లడం ద్వారా ఉత్పాదకత తగ్గకుండా చూసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు