చిట్టి రోబో పెట్టుబ‌డి స‌ల‌హాలు

రోబో అడ్వైజ‌ర్.. మీ ద‌గ్గ‌ర ఇంట‌ర్నెట్ ఉన్నంత వ‌ర‌కూ మీతో ఉంటాడు..........

Published : 21 Dec 2020 13:10 IST

రోబో అడ్వైజ‌ర్.. మీ ద‌గ్గ‌ర ఇంట‌ర్నెట్ ఉన్నంత వ‌ర‌కూ మీతో ఉంటాడు.

1 అక్టోబర్ 2018 మధ్యాహ్నం 4:55

ఆర్థిక‌రంగంలో రోబోలు అడుగుపెట్టి చాలా కాలామే అయింది. ప్ర‌స్తుతం వీటి మ‌ధ్య పోటీ కూడా నెల‌కొంది. అస‌లు రోబో అడ్వైజ‌ర్ అంటే ఏంటి? పెట్టుబ‌డుల రంగంలో దీని పాత్ర ఏవిధంగా ఉంది ? మంచి రోబోను ఎంపిక చేసుకోవ‌డం ఎలా? ఏ రోబో మ‌దుప‌ర్ల‌కు మంచి పెట్టుబ‌డి స‌ల‌హాలు ఇస్తుంది? త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రోబో అడ్వైజ‌ర్

సాధార‌ణంగా పెట్టుబ‌డులు చేసేందుకు స‌ల‌హాలు, సూచ‌న‌లు మ‌న‌కు ఆర్థిక స‌ల‌హాదారులు ఇస్తుంటారు. అయితే ఇదే ప‌ని రోబో చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?ప్ర‌ధానంగా చెప్పాలంటే పెట్టుబ‌డుల‌పై చెల్లించే ఫీజు\క‌మీష‌న్ ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు మ‌న రోబో అడ్వైజ‌ర్. మీ ద‌గ్గ‌ర ఇంట‌ర్నెట్ ఉన్నంత వ‌ర‌కూ మీతో ఉంటాడు. సాంకేతిక‌త‌తో కూడిన నిర్వ‌హ‌ణ ఉంటుంది. ఈ రోబో అల్‌గారిథ‌మ్‌ల ద్వారా కార్య‌క్ర‌మాన్ని చ‌క్క‌బెడుతుంది.

అంద‌రికీ అందుబాటులో

ఆర్థిక రంగంలో తొలి ఆర్థిక సేవ‌ల రోబో బెట్ట‌ర్‌మెంట్ 2008 లో అడుగుపెట్టింది. ఆర్థిక‌సంక్షోభం స‌మ‌యంలో ఇది పుట్టింద‌నే చెప్పాలి. ఈ త‌ర‌హా రోబో ఆర్థిక సేవ‌లు ప్రారంభ‌మై ఇప్ప‌టికీ ప‌దేళ్లు పూర్త‌య్యాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వీటి వినియోగం ఇప్ప‌టికే బాగా పెరిగింది. మ‌న దేశంలో కూడా ఫిన్ టెక్ స్టార్ట‌ప్ లు ఈ సేవ‌ల‌ను అంద‌రికీ అందుబాటులోకి తెచ్చాయ‌ని చెప్పాలి.

నిర్వ‌హ‌ణ రుసుము

రిటైల్ మ‌దుప‌ర్లు పెట్టుబ‌డులు చేసేందుకు రోబో అడ్వైజ‌ర్లు అనుకూలంగా ఉంటాయి. వీటితో నిర్వ‌హ‌ణ రుసుము స‌ల‌హాదారులు తీసుకునే దాని కంటే చాలా త‌క్కువ‌కే ల‌భిస్తాయి. పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్ సేవ‌లు అధిక నిక‌ర విలువ క‌లిగిన పెట్టుబ‌డిదారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. పోర్టుఫోలియో మేనేజ‌ర్ల సేవ‌లు పొందేందుకు క‌నీస మొత్తం పెట్టుబ‌డి ఉండాలి. రోబోల‌తో త‌క్కువ మొత్తానికి కూడా పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్ సేవ‌లు పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి ఇవి చిన్న మ‌దుప‌ర్ల‌కు మ‌రింత అనుకూలంటా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

అన్ని వేళ‌లా

సాధార‌ణంగా స‌ల‌హాదారులు కార్యాల‌య ప‌నివేళ‌ల్లోనే అందుబాటులో ఉంటారు.మీ ద‌గ్గ‌ర ఇంట‌ర్నెట్ ఉంటే చాలు ఏ స‌మ‌యంలైనా మీ పెట్టుబ‌డులు ఏవిధంగా ఉన్నాయో ప‌రిశీలించుకోవ‌చ్చు. మీరు చేయాల్సిన మార్పులు చేర్పులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తుంది.

అంతా అల్‌గారిథ‌మ్

మ‌దుప‌ర్ల వ్య‌క్తిగ‌త‌, ఆర్థిక వివ‌రాల‌ను, ల‌క్ష్యాల‌ను ఆన్ లైన్ ద్వారా రోబో తీసుకుంటుంది. వాటి ద్వారా మీ న‌ష్ట‌భ‌యం అంచ‌నా వేస్తుంది. ఇదంతా ఒక స‌ర్వేలా జ‌రుగుతుంది… మ‌దుప‌రి వివ‌రాల‌ను ప‌రిశీలించి ఒక మోడ‌ల్ పోర్టుఫోలియోను అందిస్తుంది. ప్ర‌స్తుతం రోబోలు వివిధ ర‌కాల పోర్టుఫోలియోల‌ను అందిస్తున్నాయి. ల‌క్ష్యం ఆధారితమైన‌వి, హైబ్రిడ్ పోర్టుఫోలియోలు, ప‌న్నుస‌ల‌హాలు, బ‌డ్జెట్ లెక్క‌లు మొద‌లైన ఆర్థిక సేవ‌ల‌ను అందిస్తున్నాయి.

ఎంపిక చేసుకోవ‌డం ఎలా?

ప్ర‌స్తుతం వీటి వృద్ధి గ‌ణ‌నీయంగా పెరిగింది. మ‌న దేశంలో ఎక్కువ శాతం యువ‌తే. ఈ సాంకేతిక‌త ఆధారిత‌మైన‌ పెట్టుబ‌డి స‌ల‌హాలు తీసుకునేందుకు వారు ఆస‌క్తి చూపుతున్నారు. కాబ‌ట్టి ఈ వృద్ధి మ‌రింత పెరిగేందుకు అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

రోబో అడ్వైజ‌రీ మార్కెట్ గ‌ణాంకాలు

  • 2018 సంవ‌త్స‌రానికి భార‌త్ లో అసెట్స్ అండ‌ర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎమ్) విలువ 145.6 కోట్లు. వార్షిక వృద్ధి రేటు (135.9% )
    వినియోగ‌దారుల సంఖ్య‌ 42,400. వార్షిక వృద్ధి రేటు (98.1% )

  • ప్ర‌పంచ వ్యాప్తంగా ఏయూఎమ్ (2018 సంవ‌త్స‌రానికి) 401926 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు. వార్షిక వృద్ధి రేటు (64.6 %)
    వినియోగ‌దారులు 2.57 కోట్లు. వార్షిక వృద్ధి రేటు (99.8 %)

నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తుల‌(ఏయూఎమ్) ప‌రంగా మ‌న దేశం ప్ర‌పంచం కంటే ముందుంది. కానీ వినియోగ‌దారుల‌ సంఖ్య విష‌యంలో మ‌న దేశం కాస్త వెన‌క‌బ‌డింది. అంటే ఈ సేవ‌ల‌ను వినియోగించ‌ని చిన్న మ‌దుప‌ర్లు భ‌విష్య‌త్తులో వీటిని పొందే అవ‌కాశం ఉంది. అప్పుడు మ‌న దేశంలో రోబో స‌ల‌హాలు పొందేవారు వృద్ధి చెందేందుకు అవ‌కాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని