Festive Sale: పండగ వేళ రూ.2.60 లక్షల కోట్ల వ్యాపారం..!

ఈ పండగ సీజన్‌ సందర్భంగా ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి రూ.10,000 వరకు ఖర్చు చేయొచ్చని లోకల్‌సర్కిల్స్‌ సర్వే అంచనా వేసింది....

Published : 26 Sep 2022 16:36 IST

లోకల్‌సర్కిల్స్‌ సర్వే అంచనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ పండగ సీజన్‌ సందర్భంగా ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం రూ.10,000 వరకు ఖర్చు చేయొచ్చని లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో తేలింది. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య ఈసారి 20 శాతం పెరిగిందని  సర్వే ఆధారిత నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈసారి పండగ వ్యాపారం 32 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.60 లక్షల కోట్లు)కు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్‌లో చాలామంది పండగల సందర్భంగా కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కొత్త వస్తువుల కొనుగోళ్లకు పండగలను శుభ సమయంగా భావించడం ఒక కారణమైతే.. దుకాణాలు, షాపింగ్‌ కేంద్రాలు ప్రత్యేక రాయితీలు ప్రకటించడం కూడా వినియోగదారులను ఆకర్షిస్తుంటుంది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 362 జిల్లాల్లో 58,000 మంది పాల్గొన్నారు. 

సర్వేలోని కీలక అంశాలు..

సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 35 శాతం మంది ఈ పండగ సీజన్‌లో ఎలాంటి కొనుగోళ్లు చేయబోమని తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం, ఉపాధి కోల్పోవడమే దీనికి కారణంగా తెలిపారు.

ఫెస్టివ్‌ సేల్‌లో పాల్గొంటామని చెప్పిన కుటుంబాల్లో 3 శాతం రూ.లక్షకు పైగా; 9 శాతం రూ.50,000-1,00,000; 15 శాతం రూ.20,000-50,000; 6 శాతం రూ.10,000-20,000; 17 శాతం రూ.5,000-10,000; 9 శాతం కుటుంబాలు రూ.2,000 వరకు ఖర్చు చేస్తామని తెలిపాయి.

దాదాపు 31 శాతం కుటుంబాలు ధరకు తగ్గ విలువ ఉండే వస్తువులను కొనుగోలు చేస్తామని చెప్పగా.. మరో 31 శాతం నాణ్యమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. మరో 16 శాతం మంది తమ వసతిని బట్టి కొంటామని పేర్కొన్నారు.

49 శాతం మంది షాపింగ్‌ మాళ్లు, దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తామని తెలిపారు. మరో 38 శాతం మంది ఇ-కామర్స్‌ ద్వారా కొంటామని పేర్కొన్నారు. మరో 10 శాతం మంది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

గత ఏడాది పండగ సీజన్‌లో దాదాపు 39 శాతం మంది ఇ-కామర్స్‌ వేదికలుగా షాపింగ్‌ చేస్తే.. ఈసారి ఆ సంఖ్య 33 శాతానికి తగ్గనుంది.

 35 శాతం మంది దీపావళికి సంబంధించిన దీపాలు, కొవ్వొత్తులు, లైటింగ్‌ వస్తువులు, పూలు ఇతరత్రా కొనుగోలు చేస్తామని తెలిపారు. మరో 26 శాతం మంది పండగ సీజన్‌ ప్రత్యేకమైన గిఫ్ట్‌ ప్యాక్‌లు, డ్రై ఫ్రూట్స్‌, చాక్లెట్లు, తాజా పండ్లు, స్వీట్లు.. తదితరాలు కొనుగోలు చేస్తామని చెప్పారు. 12 శాతం మంది దుస్తులు, కాస్మొటిక్స్‌, పాదరక్షలు, బ్యాగుల వంటి ఫ్యాషన్‌ వస్తువులను కొంటామని తెలిపారు. మరో 12 శాతం ఇంటి పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన ఫర్నీచర్‌, అలంకరణ, రంగులు, శానిటరీవేర్‌, లైటింగ్‌.. వంటి వస్తువులు కొనుగోలు చేస్తామన్నారు.

కేవలం ఆరు శాతం మంది మాత్రమే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌ వంటి వైట్‌ గూడ్స్‌, స్మార్ట్‌ఫోన్‌, టీవీ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొననున్నామని తెలిపారు. 4 శాతం మంది ఆభరణాలు, మరో 4 శాతం వాహనాలు కొంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని