Add-Ons: కార్ల యజమాన్లకు ఈ యాడ్‌-ఆన్‌లు కూడా అవసరమైనవే

కార్ల యజమానులు కలిగి ఉండవలసిన 3 మోటారు ఇన్సూరెన్స్‌ యాడ్‌-ఆన్‌ల గురించి ఇక్కడ తెలుసుకోందాం.

Published : 06 Mar 2023 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత కాలంలో చాలా మందికి మోటారు వాహనాలు.. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఒక భాగంగా మారాయి. 1988 మోటారు వాహన చట్టం ప్రకారం అన్ని మోటారు వాహనాలకు బీమా తీసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో మోటారు బీమా అనేది కార్ల యజమానులకు ఒక అవసరంగా మారింది. కారు కొనుగోలు చేసినప్పుడు మోటార్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం తప్పనిసరి.  ఇన్సూరెన్స్‌ చేయిస్తేనే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి, కార్ల కొనుగోలుదారులు బీమా తీసుకుంటారు. అయితే, ఈ వాహనాలకు సమగ్ర బీమా సరిపోతుందా లేక అదనపు యాడ్‌-ఆన్స్‌ అవసరం పడతాయా అనేది చూద్దాం.

యాడ్‌-ఆన్స్‌ అవసరం

ప్రాథమిక, సమగ్ర మోటార్‌ బీమా పాలసీ కవర్‌ చేయని అనేక నష్టాలు ఉన్నాయి. అందుచేత ఈ బీమాతో పాటు కొన్ని యాడ్‌ ఆన్స్‌ తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. కానీ, ఈ యాడ్‌-ఆన్స్‌ తీసుకోవడంపై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు. కొంతమంది కొన్ని ముఖ్యమైన యాడ్‌-ఆన్స్‌.. జీరో డిప్రిసియేషన్‌ కవర్‌, వినియోగ వస్తువుల కవర్‌, రిటర్న్‌ టు ఇన్‌వాయిస్‌ కవర్‌, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, ఇంజిన్‌/టైర్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ మొదలైన బాగా ప్రాచుర్యంలో ఉన్నవి తీసుకుంటారు. అయితే, మరికొన్ని మోటారు బీమా యాడ్‌-ఆన్‌లు ప్రజాదరణ పొందలేదు. కానీ, కీలక సమయాల్లో కారు యజమానులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాహన యజమానులు తక్కువగా అంచనా వేస్తున్న మూడు యాడ్‌-ఆన్‌లను ఇక్కడ పరిశీలిద్దాం..

రోజువారీ భత్యాన్నిచ్చే యాడ్‌-ఆన్‌

మీ కారు ఏదైనా మరమ్మతు కోసం గ్యారేజ్‌కు వెళ్లిందంటే.. కొన్ని రోజుల పాటు మీకు కారు అందుబాటులో ఉండదు. కాబట్టి, కొన్ని రోజుల పాటు మీ వృత్తిని అనుసరించి రవాణా సేవ అవసరం పడుతుంది. అంటే, మీరు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ప్రైవేటు, ప్రభుత్వ రవాణాపై ఆధారపడవలసి ఉంటుంది. క్యాబ్‌లు, బస్సులు మొదలైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకు అదనంగా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును భరించడానికి ‘రోజువారీ భత్యం’ యాడ్‌-ఆన్‌ కవర్‌ మీకు ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా 14 రోజుల పాటు రోజుకు రూ.500 వరకు రవాణా భత్యాన్ని అందిస్తుంది. ఒకే వాహనం ఉన్న వారికి ఈ యాడ్‌-ఆన్‌ మంచి ఎంపిక.

వ్యక్తిగత వస్తువుల యాడ్‌-ఆన్‌

దురదృష్టవశాత్తు కారు చోరీకి గురయిందనుకోందాం. బీమా, ఇన్‌వాయిస్‌ కవర్‌ కారు విలువనే మీకు చెల్లిస్తుంది. కానీ, కారులో విలువైన వస్తువులు ఉన్నట్లయితే.. వాటికి బీమా సంస్థ బాధ్యత వహించదు. చోరీకి గురయిన వస్తువుల నష్టాన్ని కవర్‌ చేయదు. అటువంటి పరిస్థితుల్లో ‘వ్యక్తిగత వస్తువుల’ కవర్‌ యాడ్‌-ఆన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది, కారు యజమాని వ్యక్తిగత వస్తువుల నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఈ యాడ్‌-ఆన్‌ మొబైల్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు మొదలైన ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ల నష్టాన్ని కవర్‌ చేస్తుంది. మొబైల్‌కు రూ.25 వేలు, ల్యాప్‌టాప్‌కు రూ.50 వేల వరకు నష్టాన్ని కవర్‌ చేయడానికి పరిమితి ఉంది. ఈ యాడ్‌-ఆన్‌తో, మీ నో క్లెయిమ్‌ బోనస్‌ (NCB) ప్రభావితం కాదు.

కీ రీప్లేస్‌మెంట్‌ యాడ్‌-ఆన్‌

వాహనం ‘కీ' పోగొట్టుకుంటే అంతులేని ఒత్తిడి ఉంటుంది. ఎన్‌క్రిప్టెడ్‌ కార్‌ ‘కీ’లతో నేడు చాలా కార్లు కంప్యూటర్‌-కోడెడ్‌ కారు ‘కీ’లను కలిగి ఉన్నాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువ. ఇలాంటి వాహన ‘కీ’ను పోగొట్టుకుంటే ఈ హై-టు-మిడ్‌-ఎండ్‌ లాకింగ్‌ సిస్టమ్‌లను స్థానిక తాళాలు చేసేవారు బ్రేక్‌ చేయలేరు. అధీకృత తయారీదారు సహాయం అవసరం. దీని ధర కూడా వేల రూపాయల్లో ఉంటుంది. ‘కీ’ కంపెనీని బట్టి ధర మారవచ్చు. ‘కీ’ రీప్లేస్‌మెంట్‌ యాడ్‌-ఆన్‌ కలిగి ఉంటే.. బీమా కంపెనీ, కొత్తగా రీప్లేస్‌ చేసిన ‘కీ’ పరిహారం చెల్లిస్తాయి. కొన్ని బీమా సంస్థలు లాకింగ్‌ సిస్టమ్‌కు సంబంధించి ఇన్‌స్టాలేషన్‌ ఖర్చును కూడా చెల్లిస్తాయి.

చివరిగా: మీ వాహన రక్షణ కోసం విస్తృతమైన కవరేజీని కలిగి ఉండడం చాలా అవసరం. కాబట్టి, మీరు కొత్త మోటారు బీమా పాలసీని పొందాలని ప్లాన్‌ చేస్తున్నట్లయితే లేదా ఇప్పటికే ఉన్న పాలసీని పునరుద్ధరించాలని యోచిస్తుంటే.. దీర్ఘకాలిక భద్రత కోసం ఈ యాడ్‌-ఆన్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచి ఆలోచన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని