PPFలో పెట్టుబడులు పెడుతున్నారా? ఈ ఆకర్షణీయమైన ఫీచర్స్ గురించి తెలుసా?

ఒక ఆర్ధిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ. 500 డిపాజిట్ చేయాలి.

Updated : 02 Aug 2022 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు గ‌ల పొదుపు ప‌థ‌కం. పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసులో గానీ, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులో గానీ ప్రారంభించ‌వ‌చ్చు. ఇది దీర్ఘ‌కాల ప‌థ‌కం అవ్వ‌డంతో పెట్టుబ‌డిదారుడు ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని కూడా కూడబెట్టొచ్చు. పీపీఎఫ్ ఖాతా 100% రిస్క్ లేనిది, అంతేగాక 6% స‌గ‌టు వార్షిక ద్ర‌వ్యోల్బ‌ణం వృద్ధిని అధిగ‌మించ‌గ‌ల ప‌రిమిత పొదుపు ప‌థ‌కాల్లో ఇది ఒక‌టి.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) డిపాజిట్లు 2013-2022 మధ్య కాలంలో 134% పెరిగాయి. 2013-14లో ఈ పీపీఎఫ్ నిక‌ర డిపాజిట్లు 5,487.43 కోట్లు ఉంటే.. 2021-22 సంవ‌త్స‌రానికి రూ.12,846 కోట్లకు చేరాయి. గ‌త కొన్ని త్రైమాసికాలుగా, పీపీఎఫ్‌తో స‌హా మ‌రిన్ని చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లు మార‌లేదు. పీపీఎఫ్‌లో ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేటుతో పాటు మ‌దుపుదార్ల‌ను ఆక‌ర్షించే అనేక అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

అధిక వ‌డ్డీ రేటు: పీపీఎఫ్‌లో ఆక‌ర్ష‌ణీమైన‌ది దీని వ‌డ్డీ రేటే. ప్ర‌ముఖ పేరున్న బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు కూడా పీపీఎఫ్ వ‌డ్డీ రేటు క‌న్నా ఇప్పుడు తక్కువే ఉన్నాయి. ప్ర‌స్తుతం, పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పీపీఎఫ్ వ‌డ్డీ నెల‌వారీ ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. పీపీఎఫ్ ఖాతాదారుడు నెల‌లో 1వ తేదీ నుంచి 4వ తేదీ వ‌ర‌కు డిపాజిట్ చేసిన‌ట్ల‌యితే ఆ నెలలో చేసిన డిపాజిట్‌కు.. వ‌డ్డీ పొందొచ్చు. సంవ‌త్స‌రానికొక‌సారి డ‌బ్బులు క‌ట్టేవారు కూడా ఏప్రిల్ 1 నుంచి 4 లోపు డిపాజిట్ చేయ‌డం మంచిది. పీపీఎఫ్‌లో పెట్టుబ‌డిదారునికి అస‌లుపైనే కాకుండా వ‌డ్డీపై వ‌డ్డీ కూడా వ‌స్తుంది.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు: పీపీఎఫ్ పెట్టుబడులకు సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. పీపీఎఫ్‌లో మెచ్యూరిటీపై పొందే అస‌లు, వ‌డ్డీ మొత్తం కూడా ప‌న్ను ర‌హితం. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్ (ఐటీఆర్‌) ఫైల్ చేసినప్పుడు సెక్ష‌న్ 80సి కింద ఈ ప‌న్ను ప్ర‌యోజనాన్ని క్లెయిమ్ చేయొచ్చు. 

స్వ‌ల్ప మొత్తంలో కూడా డిపాజిట్ చేయ‌వ‌చ్చు: ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాలి. గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయొచ్చు. ఇంత‌క‌న్నా ఎక్కువ డిపాజిట్ చేసినా గ‌రిష్ఠ ప‌రిమితి రూ.1.50 ల‌క్ష‌ల‌కే వ‌డ్డీ ఇస్తారు. ఒక‌వేళ ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీస డిపాజిట్‌గా రూ.500 కూడా చేయ‌ని ప‌క్షంలో విఫ‌లం అయితే పీపీఎఫ్ ఖాతా స్తంభింపజేస్తారు. పీపీఎఫ్ ఖాతాను మ‌ళ్లీ కొన‌సాగించ‌డానికి సంవ‌త్స‌రానికి రూ.50, స్వ‌ల్ప జ‌రిమానా చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

దీర్ఘ‌కాలం పాటు ఖాతా పొడిగింపు: 15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ వ్య‌వ‌ధి పూర్త‌యిన త‌ర్వాత‌, వ్య‌క్తి పీపీఎఫ్ ఖాతాను 5 సంవ‌త్స‌రాల కాలానికి పొడిగించవచ్చు. ఇలా అప‌రిమితంగా 5 ఏళ్లకోసారి పొడిగించుకోవచ్చు.

రుణ సౌక‌ర్యం: పీపీఎఫ్‌లో రుణ సౌక‌ర్యం కూడా ఉంటుంది. ఖాతా తెరిచిన ఆర్థిక సంవత్సరం నుంచి 1 ఏడాది వేచి ఉన్నాక రుణం తీసుకోవచ్చు. ఉదా: మీరు 2022-23 సంవ‌త్స‌రంలో పీపీఎఫ్ ఖాతాను తెరిస్తే, 2024-25లో మీ డిపాజిట్ల‌పై రుణం తీసుకోవ‌చ్చు. ఖాతాలో ఉన్న మొత్తంపై 25% వ‌ర‌కు గ‌రిష్ఠంగా రుణం తీసుకోవచ్చు.

ప్ర‌భుత్వ హామీ: పీపీఎఫ్ డిపాజిట్ల‌కు ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. మీరు పీపీఎఫ్ ఖాతా తెరిచిన బ్యాంకు లేదా పోస్టాఫీసుకు ఏదైనా ఇబ్బంది వాటిల్లినా, ప్ర‌భుత్వ‌మే హామీ ఇచ్చినందున మీ డ‌బ్బు సుర‌క్షితంగానే ఉంటుంది.

భ‌ద్ర‌త: ఖాతాదారుడు వేరే ఏవైనా ఆర్థిక లావాదేవీలో విఫ‌లం చెందినా, పీపీఎఫ్ రుణాన్ని చెల్లించ‌డానికి ఖాతాలో సొమ్మును మ‌ళ్లించ‌లేరు. ఆఖ‌రికి కోర్టు డిక్రీ ఆర్డ‌ర్ ద్వారా కూడా చేయ‌డానికి వీలులేదు. పీపీఎఫ్ సొమ్ముకు ఆ స్థాయిలో భ‌ద్ర‌త ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని