Updated : 28 May 2021 10:05 IST

Personal Finance: సంపద సృష్టికి..అడ్డంకులివే..

ఆర్థికంగా అత్యున్నత జీవితం గడపాలని అందరూ కోరుకుంటారు. సంపాదించిన మొత్తం ఖర్చు చేస్తూనే ఉంటే.. ఈ కోరిక ఎప్పటికీ తీరదు. సంపదను సృష్టించాలంటే.. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం ఒక్కటే మార్గం. అయితే, మదుపు చేసే దిశలో మనం వెళ్తున్నప్పటికీ కొన్ని విషయాలు మనకు అడ్డు వస్తూ ఉంటాయి. అవేమిటి.. వాటిని ఎలా అధిగమించాలి అనేది తెలుసుకున్నప్పుడే.. ఆర్థిక విజయం సాధ్యం అవుతుంది.
ఖర్చులకే ప్రాధాన్యం..
ఖర్చు.. పొదుపు.. మదుపు.. ఈ మూడూ ఎందుకు చేయాలి? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ సమాధానం నుంచే మన సంపద సృష్టికి ఒక మార్గం దొరుకుతుంది. చాలామందికి పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. కానీ, చేతిలో రూపాయి మిగలట్లేదు.. ఇక పెట్టుబడులు ఏం పెడతాం అని ప్రశ్నిస్తుంటారు. కానీ, ఇక్కడ లేనిది డబ్బు కాదు.. పొదుపు చేయాలన్న ఆసక్తి.. దానికి సంబంధించి మనల్ని మనం దానికి సిద్ధం చేసుకోకపోవడమే. మనసుంటే మార్గం ఉంటుందని తెలియంది కాదు..
పెట్టుబడి పెట్టడం ఒక్కటే లక్ష్యం అని అనుకోకూడదు. మీరు ఎందుకోసం మదుపు చేస్తున్నారు. మీ అంతిమ లక్ష్యం ఏమిటి? నా దగ్గరున్న డబ్బును నేను ఎలా వినియోగించుకుంటాను.. సంతోషంగా ఉండేందుకు కావాల్సిన డబ్బు నా దగ్గర ఉందా? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటేనే మన ఆలోచనల్లో స్పష్టత వస్తుంది.
మీ లక్ష్యం ఏదైనా కానీయండి.. మంచి ఇల్లు.. కారు, విదేశీ విహారం.. పిల్లల ఉన్నత చదువులు.. ఇలా మీకు నచ్చిన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దానికి అనుగుణంగా మదుపు చేయడం ప్రారంభించండి. అప్పుడే సంపదనూ సృష్టిస్తారు..
మరో ముఖ్య విషయం.. పొదుపు చేయడం అంటే.. ఇప్పుడు కొన్నింటిని త్యాగం చేయడమే. కానీ.. దీనివల్ల భవిష్యత్‌లో ఏం సాధించాలని అనుకుంటున్నారో గుర్తు చేసుకోండి. ఖర్చులను ఇప్పుడు తగ్గించుకుంటేనే... సంపద సృష్టిలో ఉన్న పెద్ద అడ్డంకిని అధిగమించినట్లే..

అప్పులు చేస్తుంటే..
అవసరం రాగానే అప్పులు చేయడం కొందరికి అలవాటే.. ఇలా చేయడం సులభమే. కానీ.. సమస్యంతా మనకు ఉన్నదాంట్లో జీవించడం రాకపోవడమే. క్రెడిట్‌ కార్డును వాడటం మంచిదే. కానీ, ఆ బిల్లును సమయానుకూలంగా తీర్చేయగలగాలి. అప్పులు కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టకపోవచ్చు. కానీ, ఇప్పుడున్న పరిణామాల వల్ల ఉద్యోగం పోవడం లేదా ఆదాయం తగ్గడం లాంటివి జరిగితే.. ఆ అప్పులన్నీ మీ మెడ మీద వేలాడే కత్తులుగా మారతాయి.
క్రెడిట్‌ కార్డు బిల్లు బాకీ పడితే.. 18-30శాతం వరకూ వడ్డీ విధిస్తారు. మనం పెట్టుబడి పెట్టి, ఇంత రాబడి ఆర్జించడం ఎంత కష్టమో ఆలోచించండి.
అప్పులు ఎక్కువగా ఉన్నాయంటే.. మన పొదుపు మొత్తం తగ్గినట్లే. దీనివల్ల దీర్ఘకాలంలో మన ఆర్థిక స్థితిగతులపైనా ప్రభావం పడుతుంది. సంపాదించిన మొత్తం వడ్డీలకే చెల్లిస్తుంటే.. ఇక మిగులు ఎక్కడ.. చిన్న వయసు నుంచే అప్పులు, వాటికి వడ్డీలు చెల్లిస్తూ ఉంటే.. పదవీ విరమణ నాటికి సమకూర్చుకోవాల్సిన నిధి సాధ్యం కాదు. కాబట్టి, ఈ అడ్డంకిని దాటేందుకు ప్రయత్నించాలి. వీలైనంత వరకూ అధిక వడ్డీకి ఉన్న అప్పులను వెంటనే వదిలించుకోవాలి.

ఒకటికి మించి ఆదాయాలు లేకపోవడం..
ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉండాలి. కానీ, కొంతమంది.. ఏదో మదుపు చేస్తున్నాం అంటే.. చేస్తున్నాం అని భావిస్తుంటారు. చిన్న మొత్తమైనా క్రమం తప్పకుండా.. క్రమశిక్షణతో దీర్ఘకాలం మదుపు చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోవాలి. ఒక పెట్టుబడి పథకం మీద ఎంత రాబడి వస్తుందని చూడటమే కాదు.. అది దీర్ఘకాలంలో ఎంత వరకూ మనకు లాభాలను తెచ్చిపెడుతుందనే సంగతినీ గమనించాలి. ఒకే ఆదాయంతో జీవితాంతం నెట్టుకురావడం కష్టమే. తప్పనిసరిగా మీ కష్టార్జితం నుంచి పెట్టుబడులు అనే రాబడి మార్గం సృష్టించాలి. డబ్బుకు డబ్బును సంపాదించడం నేర్పించాలి. మీ నైపుణ్యాలకు మెరుగు పెట్టుకోవాలి. ఆర్థిక ప్రణాళికలో ఇవీ ఒక భాగం కావాలి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని