Interest rates: ఈ బ్యాంకులు.. గృహ రుణ రేట్లు పెంచేశాయ్‌..!

రెపో రేటు(Repo Rate) ను పెంచుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) అలా ప్రకటించిందో లేదో.. అనేక బ్యాంకులు రుణ రేట్ల పెంపును మొదలుపెట్టాయి. రేపో రేటుకు అనుసంధానమైన రుణ రేటును

Updated : 09 Jun 2022 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెపో రేటు(Repo Rate)ను పెంచుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) అలా ప్రకటించిందో లేదో.. అనేక బ్యాంకులు రుణ రేట్ల పెంపును మొదలుపెట్టాయి. రేపో రేటుకు అనుసంధానమైన రుణ రేటును పెంచుతున్నట్లు ఆయా బ్యాంకులు ప్రకటించారు. దీంతో ఈ బ్యాంకు ఖాతాదారులకు హోం లోన్‌, కార్‌ లోను ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. అయితే రుణాలపై తక్షణమే వడ్డీని పెంచేసిన పలు బ్యాంకులు.. డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

మరి ఏయే బ్యాంకులు ఎలా రేట్లను పెంచాయో చూద్దాం..

ఐసీఐసీఐ (ICICI) బ్యాంకు..

ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన నేపథ్యంలో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్‌ (EBLR)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. పెంచిన రేటు బుధవారం (జూన్‌ 8) నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. దీంతో ఈ బ్యాంకు ఈబీఎల్‌ఆర్‌ (EBLR) రేటు 8.10 శాతం నుంచి 8.60శాతానికి పెరిగింది.

బ్యాంకు ఆఫ్‌ బరోడా (Bank of Baroda)..

బ్యాంకు ఆఫ్‌ బరోడా కూడా రిటైల్‌ లోన్లపై బరోడా రేపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (BRLLR)ను 7.40శాతానికి పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ బ్యాంకులో గృణ రుణాలపై వడ్డీ రేట్లు 7.40 - 8.75 శాతంగా ఉన్నాయి. కారులోను రేట్లు 7.90శాతం నుంచి, మోర్టగేజ్‌ రుణ రేట్లు 9.10శాతం నుంచి ఉన్నాయి.

పీఎన్‌బీ (PNB)..

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (RLLR)ను 6.90శాతం నుంచి 7.40శాతానికి పెంచింది. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI)..

రెపోరేటుకు అనుసంధానమై ఉండే రుణ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.75 శాతం చేసినట్లు ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రకటించింది. కొత్తరేటు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..

మరో ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రుణ రేట్లను పెంచేసింది. ప్రస్తుతం 7.25శాతంగా ఉన్న ఆర్‌బీఎల్‌ఆర్‌ (RBLR)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.75శాతంగా చేసినట్లు వెల్లడించింది. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని