Car Sales: ఈ కార్ల విక్రయాలు ఏప్రిల్‌ 1 నుంచి నిలిచిపోనున్నాయా?

ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాల్సి ఉన్న కొత్త ఉద్గార ప్రమాణాల (RDE norms)కు అనుగుణంగా తీర్చిదిద్దలేని కార్ల విక్రయాల (Car Sales)ను సంస్థలు నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.

Updated : 12 Feb 2023 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏప్రిల్‌ 1 నుంచి కార్ల తయారీ కంపెనీలు మరింత కఠినమైన బీఎస్‌6 ఉద్గార ప్రమాణాలను అమలు చేయాల్సి ఉంది. ‘రియల్‌ డ్రైవింగ్‌ ఎమిషన్స్‌ (RDE norms)’ ప్రమాణాల పేరిట వీటిని తీసుకురానున్నాయి. అంటే వాహనాలు ఎప్పటికప్పుడు కొత్త ఉద్గారాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేలా రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అన్ని కార్ల మోడళ్లను కొత్త ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం కుదరదు. అలాంటి కార్ల విక్రయాల (Car sales)ను కంపెనీలు ఏప్రిల్‌ 1 తర్వాత నిలిపివేయక తప్పని పరిస్థితి.

రెనో ఇండియా (Renault India) తమ కార్ల మోడళ్లన్నింటినీ ఆర్‌డీఈ (RDE norms) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తామని ప్రకటించింది. అయితే, క్విడ్‌ (KWID) 800 సీసీ వెర్షన్‌ను మాత్రం కొత్త ప్రమాణాల ప్రకారం తీర్చిదిద్దడం కష్టమని తెలిపింది. ఇప్పటికే దీని తయారీని నిలిపివేసింది. దీని స్థానంలో రూ.4.69 లక్షల (ఎక్స్‌షోరూం) ప్రారంభ ధరతో క్విడ్‌ (KWID)లోనే ఆర్‌ఎక్స్‌ఈ వేరియంట్‌ను తీసుకొచ్చింది.

హోండా కార్స్‌ (Honda Cars) ఇండియా నెమ్మదిగా అమేజ్‌ (Amaze) డీజిల్‌ వేరియంట్‌ కారు విక్రయాలను నిలిపివేసింది. కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి కూడా దీన్ని తొలగించింది. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో వస్తోన్న అమేజ్‌ (Amaze)ను కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం కుదరదని గతంలోనే హోండా కార్స్‌ ప్రకటించింది. పైగా పెట్రోల్‌ వేరియంట్‌కు భారీ డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో అమేజ్‌ (Amaze) డీజిల్‌ వేరియంట్‌ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే డబ్ల్యూఆర్‌-వీ, జనరేషన్‌ 4 సిటీ, జాజ్‌ తయారీని సైతం హోండా నిలిపివేయనున్నట్లు తెలిపింది.

హ్యుందాయ్‌ ఇండియా ఐ20 (Hyundai i20) డీజిల్‌ మోడల్‌ విక్రయాలను నిలిపివేసే అవకాశం ఉందని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే గ్రాండ్‌ ఐ10 నియోస్‌లో డీజిల్‌ వేరియంట్ల తయారీని హ్యుందాయ్‌ నిలిపివేసింది. ఆరా (Aura)లోనూ డీజిల్‌ వేరియంట్‌కు స్వస్తి పలికే అవకాశం ఉందని సమాచారం.

మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా సైతం తమ కార్ల మోడళ్లలో కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దలేని వాటిని నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కంపెనీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఆల్టో 800, ఇగ్నిస్‌, సియాజ్‌ మోడళ్లు ఏప్రిల్‌ 1 తర్వాత విక్రయానికి అందుబాటులో ఉండకపోవచ్చని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మహీంద్రా అండ్‌ మహీంద్రాలో అల్టురాస్‌ జీ4కు ఆదరణ తగ్గిన విషయం తెలిసిందే. డిసెంబరులో ఈ వేరియంట్‌ కారు ఒక్కటి కూడా విక్రయం కాలేదు. తాజాగా ఆర్‌డీఈ ప్రమాణాలను అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో వీటి  తయారీని కంపెనీ ఇప్పటికే నిలిపివేసింది.

స్కోడా ఆటో ఇండియా సైతం ఆక్టేవియా, సూపర్బ్‌ మోడళ్లను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.

భారీ డిస్కౌంట్లు..

విక్రయాలు నిలిచిపోనున్న కార్ల స్టాక్‌ను వేగంగా పూర్తి చేసేందుకు కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. నేరుగా నగదు రాయితీలతో పాటు ఎక్స్‌ఛేంజ్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పేరిట కారు అసలు ధరలో 10-11 శాతం వరకు తగ్గింపు లభిస్తోందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని