Published : 08 Apr 2022 13:55 IST

Home Loan: కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటు 4 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనున్నాయి. కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. గృహరుణాలకు సంబంధించి ఆర్‌బీఐ తాజా ద్రవ్యపరపతి సమీక్షలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.

రెపోరేటే ప్రామాణికం..

కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో రెండేళ్లుగా వడ్డీ రేట్లను ఆర్‌బీఐ అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించింది. పరిస్థితులు మెరుగవుతున్నప్పటికీ.. రెపోరేటును మాత్రం పెంచేందుకు మొగ్గుచూపలేదు. బ్యాంకులు గృహరుణ వడ్డీ రేట్లకు రెపో రేటును ప్రామాణికంగా తీసుకుంటాయి. ఫలితంగా ఈ రేటు మారితే.. బ్యాంకులూ ఆ మేరకు రుణగ్రహీతలకు ఆ భారాన్ని బదిలీ చేస్తాయి. కానీ, తాజాగా రెపోరేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రస్తుతానికి తక్కువ వడ్డీరేట్లకే గృహరుణం లభించనుంది. ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు 6.5 శాతం వడ్డీరేటుతో గృహరుణం అందజేస్తున్నాయి.

ఇదీ ఓ ఊరట.. 

ఆర్‌బీఐ తీసుకున్న మరో నిర్ణయం కూడా గృహరుణాలు తక్కువ వడ్డీరేటుకు లభించేందుకు దోహదం చేయనున్నాయి. కొత్త గృహరుణాలను ‘లోన్‌ టు వాల్యూ(LTV)’కి మాత్రమే అనుసంధానించి.. ‘రిస్క్‌ వెయిట్ల’ (risk weight)ను హేతుబద్దీకరిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. మార్చి 30, 2023 వరకు ఇది కొనసాగనుందని ప్రకటించారు. ఇప్పటి వరకు రిస్క్‌ వెయిట్లను రుణ పరిమాణం, ఎల్‌టీవీ ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఆర్థిక పునరుద్ధరణలో స్థిరాస్తి రంగ పాత్ర, ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ రంగానికి ఊతమిచ్చేందుకే నిర్ణయం తీసుకున్నట్లు దాస్‌ తెలిపారు. రుణం, ఆస్తి విలువల నిష్పత్తినే ఎల్‌టీవీ అంటారు. అంటే ఎంత విలువ చేసే ఆస్తిపై ఎంత రుణం లభిస్తుందన్నదే ఎల్‌టీవీ. మరి రిస్క్‌ వెయిట్‌ అంటే ఏంటో చూద్దాం..

బ్యాంకులు లేదా గృహరుణ సంస్థలు రుణాలు ఇవ్వడానికి ఆర్‌బీఐ నిర్దేశించిన ప్రకారం పక్కన పెట్టే మూలధనాన్నే ‘రిస్క్ వెయిట్’ అంటారు. ఉదాహరణకు రూ.75 లక్షలకు పైగా విలువ ఉండే గృహరుణాలకు ఆర్‌బీఐ 125% రిస్క్‌ వెయిట్‌ను నిర్దేశించింది అనుకుందాం. అలా ఒక బ్యాంకులో రూ.75 లక్షల విలువ పైబడిన రుణాలు రూ.1000 కోట్లు మించితే.. సదరు బ్యాంకు రూ.1,250 కోట్ల మూలధనాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇలా రిస్క్‌ వెయిట్‌ పెరిగితే బ్యాంకులు ఎక్కువ మొత్తంలో నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా బ్యాంకులకు లేదా రుణ సంస్థలకు ‘కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ అంటే నిధుల సమీకరణ వ్యయం పెరిగిపోతుంది. దీంతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. వివిధ రంగాలకు రుణాలివ్వడంలో ఉన్న నష్టభయాన్ని ఆధారంగా చేసుకొని ఆర్‌బీఐ రిస్క్‌ వెయిట్‌ను నిర్ణయిస్తుంది. వ్యక్తిగత, గృహ, వాహన, విద్య ఇలా అన్ని రుణాలకూ రిస్క్‌ వెయిట్‌ ఉంటుంది. అయితే, గృహరుణ గ్రహీతలపై ఈ ప్రభావం నేరుగా ఉంటుంది.

వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు వంటి అసురక్షిత రుణాలపై రిస్క్‌ వెయిట్‌ ఎక్కువగా ఉంటుంది. గృహరుణం వంటి సురక్షిత రుణాలకు ముందు చెప్పినట్లుగా రుణ పరిమాణం, ఎల్‌టీవీపై ఆధారపడి ఉంటుంది. తాజాగా రుణ పరిమాణాన్ని పక్కనబెట్టి మార్చి 31, 2023 వరకు రిస్క్‌ వెయిట్‌ గణనలో ఎల్‌టీవీని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. దీంతో గృహరుణాలకు రిస్క్‌ వెయిట్‌ తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తక్కువ వడ్డీరేటుకే గృహరుణాలు అందుబాటులో ఉండొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని