Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్లు మీ ఎంపిక సరైనదేనా?

స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది మదుపరులు కొత్తగా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Published : 14 Jun 2024 00:35 IST

స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది మదుపరులు కొత్తగా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఫండ్లలో మదుపు చేసే వారు సరైన పథకాన్ని ఎంచుకునేందుకు ఏయే విషయాలు పరిశీలించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్‌ ఫండ్లు మంచి మార్గమని చెప్పొచ్చు. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. మీ నష్టభయం భరించే సామర్థ్యాన్ని బట్టి, ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనకు సరిపోయే పథకాన్ని ఎలా గుర్తు పట్టాలి అనేదే ముఖ్యం.

ఫండ్లలో మదుపు చేసే ముందు వీటి గురించి కనీస అవగాహన అవసరం. పెట్టుబడులతో లాభాలు మాత్రమే వస్తాయి అని నమ్మితే ఇక్కడ కష్టం. పూర్తి సమాచారం తెలుసుకున్నాకే, సరైన నిర్ణయం తీసుకోగలరు. కొన్ని ఫండ్లలో నష్టభయం తక్కువగా ఉంటుంది. మరికొన్నింటిలో మధ్యస్థంగా, అధిక నష్టభయంతో ఉంటాయి. వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని విస్మరిస్తే.. తర్వాత విచారించాల్సిన పరిస్థితి వస్తుంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు సరిపోయే విధంగా ఫండ్‌ ఎంపికలు ఉండాలి. పిల్లల చదువు, వారి వివాహం, పదవీ విరమణ ప్రణాళికలు, సొంతిల్లు, ఇంటిరుణం తీర్చడంలాంటి ఆర్థిక అవసరాలకు దశలవారీగా సొమ్మును అందించేలా పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవాలి.

పోల్చి చూడండి..

ఒక ఫండ్‌ పనితీరు గురించి సరైన అంచనా వేసేందుకు ముందుగా దాని బెంచ్‌మార్క్‌తో పోల్చి చూడాలి. అదే విభాగంలోని ఇతర ఫండ్లు ఎంత మేరకు రాబడినిస్తున్నాయో చూసుకోండి. బెంచ్‌మార్క్, ఇతర ఫండ్లను అధిగమించేలా రాబడిని ఇస్తుంటే అది మంచి ఫండ్‌ కిందే లెక్క. ఇలాంటి ఫండ్లను ఎంపిక చేసుకొని, మదుపు చేయొచ్చు. 

వ్యయ నిష్పత్తి..

మీ పెట్టుబడులను నిర్వహించేందుకు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కొన్ని ఖర్చులను మినహాయించుకుంటాయి. దీన్నే వ్యయ నిష్పత్తి అంటారు. తక్కువ వ్యయాలను వసూలు చేసే ఫండ్లను ఎంపిక చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్నిసార్లు మంచి ఫండ్లు అధిక వ్యయ నిష్పత్తితో ఉండొచ్చు. ఇలాంటప్పుడు దీంతోపాటు ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అది అందిస్తున్న రాబడిని పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలి.

అన్ని దశల్లోనూ..

మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలం కొనసాగాలి. ఈ నేపథ్యంలో వివిధ మార్కెట్‌ దశల్లో ఆ ఫండ్‌ పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. 1, 3, 5, 10 ఏళ్ల వ్యవధిలో ఫండ్‌ ఎంత రాబడిని అందించిందో తెలుసుకోండి. మార్కెట్‌ పతనం అవుతున్నప్పుడు పెట్టుబడి విలువను కాపాడుతుందా చూడండి. అప్పుడే ఆ ఫండ్‌ పనితీరు ఎంత బాగుందన్న విషయంపై ఒక స్పష్టత వస్తుంది.


వైవిధ్యంగా..

మ్యూచువల్‌ ఫండ్‌ పథకం తన పెట్టుబడులను ఎక్కడ మదుపు చేస్తుందన్నదీ కీలకమే. మంచి వైవిధ్యమైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఫండ్లు ఎప్పుడూ తక్కువ నష్టభయంతో అధిక రాబడిని అందిస్తాయి. రంగాలు, కంపెనీల ఎంపికలో ఫండ్‌ పాటిస్తున్న వైవిధ్యాన్ని అంచనా వేయండి. ఫండ్‌ పెట్టుబడి వ్యూహానికి అనుగుణంగా పనిచేస్తుందా లేదా చూసుకోండి. ఒకే రంగంలో ఎక్కువ పెట్టుబడులు ఉన్నప్పుడు మార్కెట్‌ అస్థిరత సమయంలో నష్టాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. డెట్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నప్పుడు ఆయా సెక్యూరిటీల క్రెడిట్‌ నాణ్యతను పరిశీలించాలి. 

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు సలహాదారులను సంప్రదించినా సరే.. ముందుగా మనకు కొన్ని విషయాలపై అవగాహన ఉండాలన్న సంగతి ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని