Updated : 11 Feb 2022 15:44 IST

Personal Loan | పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా?.. ఈ విష‌యాల్లో జాగ్రత్త!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యవసరంగా డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు చాలామంది వ్యక్తిగత రుణాల వైపే చూస్తారు. స్థిర ఆదాయ మార్గం ఉన్న వారికి బ్యాంకులు ఎంటువంటి సెక్యూరిటీ లేకుండానే ఈ రుణాల‌ను మంజూరు చేస్తుంటాయి కాబట్టి తీసుకోవడం సులువు. అయితే, ఇత‌ర సెక్యూర్డ్ రుణాల‌తో పోలిస్తే వ‌డ్డీ రేటు కొంచెం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక బ్యాంకులు కూడా భారీగా వడ్డీ ఆదాయం వస్తుండడంతో వ్యక్తిగత రుణాల‌ను ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. త‌మ వినియోగ‌దారుల‌కు ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణాల‌ను ఆన్‌లైన్ ద్వారా క్షణాల్లో మంజూరు చేసేస్తున్నాయి. అయితే, సుల‌భంగా రుణం ల‌భిస్తుంది కదా అని చిన్న చిన్న అవ‌స‌రాల‌కు, అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌కు కూడా ఈ రుణాన్ని తీసుకోవ‌డం మంచిది కాదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత రుణం తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

రుణం ఆమోదించే ముందు బ్యాంకులు రుణ‌గ్రహీత ప్రొఫైల్‌ని చెక్ చేస్తాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోరు. ఇది రుణ యోగ్యతను నిర్ణయిస్తుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే రుణం పొందేందుకు మెరుగైన అవ‌కాశాలుంటాయి. రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు ఇచ్చే వ‌డ్డీ రేట్లను పోల్చి చూడ‌డం వ‌ల్ల త‌క్కువ రేటుకే రుణం పొందేందుకు వీలుంటుంది. ఒకవేళ మీరు వ్యక్తిగత రుణం తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

రుణ మొత్తం: అత్యవసర పరిస్థితుల్లో డ‌బ్బు కోసం వ్యక్తిగత రుణం తీసుకునేట‌ప్పుడు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని మాత్రమే తీసుకోవాలి. అధిక మొత్తంలో రుణం తీసుకుంటే తిరిగి చెల్లించలేని ప‌రిస్థితులు రావ‌చ్చు. ఇలాంటి రుణాలు అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయ‌వ‌చ్చు. మీ చెల్లింపుల సామ‌ర్థ్యాన్ని తెలుసుకుని కావాల్సిన మొత్తాన్ని మాత్రమే తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఒక నియమం ప్రకారం వ్యక్తిగత రుణ ఈఎమ్ఐ నెలవారీ ఆదాయంలో 10 శాతానికి మించకూడదు.

వెంట వెంట‌నే ద‌ర‌ఖాస్తు వద్దు: ఒక వ్యక్తి ఒక‌సారి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఆ వ్యక్తి క్రెడిట్ రిపోర్ట్‌లో తీసుకున్న రుణం ప్రతిబింబిస్తుంది. బ్యాంకులు రుణ ద‌ర‌ఖాస్తును నిశితంగా చెక్ చేస్తాయి. ఎక్కువసార్లు వ్యక్తిగత రుణానికి ద‌రఖాస్తు చేసిన‌ట్లు క్రెడిట్ నివేదికలో ఉంటే క్రెడిట్ స్కోరు తగ్గొచ్చు. అందువ‌ల్ల వెంట వెంట‌నే వ్యక్తిగత రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డం మంచిది కాదు. అవ‌స‌రం ఉన్నప్పటికీ ఒక‌సారి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన త‌ర్వాత మాత్రమే మ‌రో రుణం కోసం ద‌రఖాస్తు చేసుకోవాలి.

కాల‌ప‌రిమితి, ఈఎమ్ఐలు: వ్యక్తిగత రుణం తీసుకునే వారిలో చాలా మంది చేసే త‌ప్పు రుణ కాల‌ప‌రిమితి, ఈఎమ్ఐల మ‌ధ్య స‌మ‌తుల్యం ఉండేలా చూసుకోలేక‌పోవ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు రుణ గ్రహీత ఈఎమ్ఐ చెల్లింపుల కోసం ఎక్కువ కాలప‌రిమితి ఎంచుకుంటే.. త‌క్కువ ఈఎమ్ఐతో ఒత్తిడి లేకుండా బాకీ చెల్లించొచ్చని అలోచిస్తారు. కానీ ఎంత ఎక్కువ కాల‌ప‌రిమితి ఎంచుకంటే అంత ఎక్కువ‌గా వ‌డ్డీ చెల్లించాల‌నే విషయాన్ని గుర్తించ‌రు. కాల‌ప‌రిమితి, ఈఎమ్ఐల మ‌ధ్య స‌మ‌తుల్యం ఉండేలా చూసుకోవాలి.

చివరగా..: వ్యక్తిగత రుణం ఎంచుకునేట‌ప్పుడు స‌రైన ప్రణాళిక ఉండాలి. రుణం తీసుకుంటే నెల‌వారీ ఈఎమ్ఐలు ఎంత చెల్లించాల్సి వ‌స్తుందో ముందుగానే అంచ‌నా వేయాలి. చెల్లింపులకు ప్లాన్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో వివిధ బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల‌ను పోల్చి చూడ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని