Credit Card Loan: క్రెడిట్ కార్డుపై లోన్‌ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

క్రెడిట్ కార్డు ఆధారంగా తీసుకునే రుణాలు, వ్యక్తిగత రుణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి

Updated : 28 Mar 2022 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్ కార్డుల ఆధారంగా రుణాలను తీసుకోవడం చాలా సులువైన ప్రక్రియ. అనేక బ్యాంకులు క్రెడిట్ కార్డుల ఆధారంగా వివిధ రకాల వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తున్నాయి. అయితే, క్రెడిట్ కార్డు ఆధారంగా తీసుకునే రుణాలు, వ్యక్తిగత రుణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే, ఇది సురక్షితమైనది కాదు. మీరు తీసుకోవాలనుకుంటున్న రుణ మొత్తం మీ క్రెడిట్ కార్డు పరిమితిని మించకూడదు. సాధారణంగా క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు 35 శాతం నుంచి 40 శాతం మధ్య ఉంటుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా అవకాశం ఉంది.

ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు ఆధారిత రుణం తీసుకున్నా లేదా తీసుకోవాలనుకున్నా మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలివీ..

  1. సాధారణంగా చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులపై టాప్-అప్ రుణాలను అందిస్తాయి. దీనిని పొందాలంటే క్రెడిట్ కార్డు హోల్డర్ మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. ఇప్పటికే మీరు క్రెడిట్ కార్డు ఆధారంగా రుణాన్ని తీసుకున్నట్లయితే, దానికి సంబంధించిన నెలవారీ చెల్లింపులను ఆలస్యం చేయొద్దు. ఒకవేళ చెల్లింపులు ఆలస్యం చేసినట్లయితే అది మీరు భవిష్యత్తులో తీసుకోవాలనుకునే టాప్-అప్ రుణ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు.
  2. క్రెడిట్ కార్డు ఆధారంగా తీసుకున్న రుణాన్ని సరైన సమయానికి తిరిగి చెల్లించకుండా ఉంటే, వారి క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డు డిఫాల్ట్స్ కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. డిఫాల్టర్ ప్రభావం విషయంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు, రుణ చెల్లింపుల మధ్య వ్యత్యాసం ఉంటుంది.
  3. క్రెడిట్ కార్డులపై అందించే రుణాలు వివిధ కాలపరిమితుల ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. రుణం తిరిగి చెల్లించే కాలపరిమితిని వినియోగదారుడు ఎంచుకోవచ్చు. గరిష్ఠంగా 24 నెలల కాలపరిమితితో అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 24 నెలల కంటే ఎక్కువ కాలపరిమితిని కూడా అందిస్తాయి.
  4. బ్యాంకులు మీ మొత్తం క్రెడిట్ కార్డు పరిమితిలో దాదాపు 75 శాతం వరకు రుణంగా అందిస్తాయి. మిగిలిన 25 శాతంపై క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అంటే ఒకవేళ మీరు కార్డును ఉపయోగించి ఏదైనా లావాదేవీ చేసి, దానిని సకాలంలో చెల్లించకపోతే 35-40 శాతం వార్షిక వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. 
  5. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు ఆధారంగా తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించాలనుకున్నట్లయితే, ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాల్సిన అవసరం లేకుండానే ఎప్పుడైనా మూసివేయవచ్చు. అయితే, బ్యాంకు విధించే ముందస్తు చెల్లింపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. 
  6. క్రెడిట్ కార్డు ఆధారంగా రుణం తీసుకోవాలనుకున్నట్లయితే బ్యాంకు విధించే ప్రాసెసింగ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఛార్జీలు ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా మారుతూ ఉంటాయి. సాధారణంగా ఈ ఛార్జీలు 1 శాతం నుంచి 5 శాతం వరకు ఉంటాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని