స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డుల‌కు తెలుసుకోవాల్సిన 10 అంశాలు

స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులకు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య‌మైన విష‌యాలు ఉన్నాయి...........

Updated : 01 Jan 2021 19:02 IST

స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులకు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య‌మైన విష‌యాలు ఉన్నాయి

మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు మంచి రాబ‌డిని అందిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దాని గురించి ఏ మాత్రం అవ‌గాహ‌న లేకుండా గుడ్డిగా పెట్టుబ‌డులు పెడితే మాత్రం ప్ర‌తికూల‌ ఫ‌లితాలు ఉంటాయి. అందుకే మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య‌విష‌యాలున్నాయి. స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెడితే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించి మంచి రాబ‌డి వ‌స్తుంద‌నేది న‌మ్మ‌కం. కానీ స‌రైన అవ‌గాహ‌న అవ‌స‌రం. సొంతంగా స్టాక్స్‌ని ఎంచుకొని పెట్టుబ‌డులు ప్రారంభించాల‌నుకోవ‌డం మంచిదే కానీ, మార్కెట్ల గురించి పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చిన త‌ర్వాత పెట్టుబ‌డులు చేయ‌డం మేలు.

  1. గుడ్డి న‌మ్మ‌కం ప‌నికిరాదు

చాలామంది స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టి న‌ష్ట‌పోయిన‌ట్లు చెప్తుంటారు. అయితే మార్కెట్ల ప‌నితీరు, ఏ విధంగా ప్రభావితం అవుతాయ‌ని తెలుసుకోకుండా లాభం పొందాల‌నే ఉద్దేశ్యంతో పెట్టుబ‌డులు చేసిన‌వారికి అలా జ‌రుగుతుంది. మ‌రికొంత మంది షేర్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డుల ద్వారా భారీగా లాభ‌ప‌డిన‌ట్లు చెప్తారు. అయితే ఇవన్నీ మార్కెట్ల పెట్టుబ‌డుల‌కు ప్రేరేపిస్తాయి. లాభాలు పొందాల‌నే ఉత్సాహంతో పెట్టుబ‌డులు ప్రారంభిస్తే స‌రిపోదు. భార‌త మార్కెట్లు, ఆర్థిక వ్య‌వ‌స్థ గురించి అవ‌గాహ‌న వ‌చ్చిన త‌ర్వాత‌ పెట్టుబ‌డులు చేయ‌డం మంచిది.

  1. స్టాక్ మార్కెట్ డ‌బ్బు త‌యారీ యంత్రం కాదు

స్టాక్ మార్కెట్ అనేది డ‌బ్బు త‌యారీ చేసే యంత్రం కాదు. చాలా మంది స్టాక్ మార్కెట్ ద్వారా మంచి రాబ‌డి వ‌స్తుంది. పెట్టుబ‌డులు పెట్ట‌గానే లక్షాధికారులం అయిన‌ట్లు అనుకుంటారు. అయితే మార్కెట్ల ప‌నితీరుపై అనుభ‌వం ఉన్న‌వారికి ఇది సాధ్యం. వారు తెలివిగా షేర్ల‌ను ఎంచుకొని పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తారు. మార్కెట్ల ప‌నితీరును బ‌ట్టి పెట్టుబ‌డుల‌ను మారుస్తుంటారు. చాలా మంది స్టాక్ మార్కెట్ల‌లో తీవ్రంగా న‌ష్టపోయి ఆస్తుల‌ను పోగొట్టుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.

  1. సొంతంగా నేర్చుకోండి

పెట్టుబ‌డులు ప్రారంభించేముందు కొంత స‌మ‌యం తీసుకొని స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి. మీరు ఏ స్టాక్ కొనుగోలు చేయాల‌నుకుంటున్నారో దాని ప‌నితీరు, ఆర్థిక వ్య‌వస్థ ప్ర‌భావం ఎంత‌మేర‌కు ఉంటుంద‌న్న విష‌యాల‌ను విశ్లేషించ‌గ‌ల‌గాలి.

  • షేర్ల ధ‌ర‌లు (పీఈ), షేరుపై లాభం, (ఈపీఎస్‌), ఈక్విటీ మీద రాబ‌డి (ఆర్ఓఈ), మార్కెట్ క్యాప్ వంటి వాటి క‌నీస అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాలి.
  • ఎప్పుడు ఏ స్టాక్ ఎంచుకోవాల‌నే అంశాల‌పై సాంకేతిక విశ్లేష‌ణ చేయ‌గ‌ల‌గాలి.
  • ట్రేడింగ్ బేసిక్స్, నియ‌మాలు, ప‌రిమితులు, మార్కెట్ల ప‌రిభాష‌, మార్కెట్ ఆర్డ‌ర్లు, ఫ్యూచ‌ర్ అండ్ ఆప్ష‌న్ లో ట్రేడింగ్ చేసేందుకు అవ‌స‌ర‌మైన నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం అవ‌స‌రం.
  • ద్ర‌వ్యోల్బ‌ణం, జీడీపీ, ద్ర‌వ్య‌లోటు, ముడిచ‌మురు ధ‌ర‌లు, రూపాయి విలువ వంటివి మార్కెట్లను ఎలా ప్ర‌భావితం చేస్తాయో గ‌మ‌నించాలి. ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌, మార్కెట్ల తీరును అర్థం చేసుకోకుండా మార్కెట్ల‌లోకి ప్ర‌వేశిస్తే త‌ర్వాత న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది.
  1. మిగిలిన నిధుల‌తోనే పెట్టుబ‌డులు చేయండి

కొంత‌మంది అదేప‌నిగా మార్కెట్ల‌లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఖ‌ర్చుల‌కు, అవ‌స‌రాల‌కు పోనూ మిగిలిన డ‌బ్బును మాత్ర‌మే పెట్టుబ‌డుల‌కు వినియోగించాలి. ఎందుకంటే మార్కెట్ల‌లో లాభ‌, న‌ష్టాల‌ను ఊహించ‌లేం. మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారంటేనే మీరు రిస్క్ తీసుకున్నార‌ని అర్ధం. అయితే ఆ డ‌బ్బు పోయినా న‌ష్టంలేదు అనుకుంటేనే పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది. పెట్టుబ‌డుల్లో రిస్క్ సాధార‌ణంగా మార్కెట్ల ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రోవైప మీరు త‌యారు చేసుకున్న పోర్ట్‌ఫోలియోపై ఆధార‌ప‌డి ఉంటుంది.

  1. అప్పు తీసుకొని పెట్టుబ‌డి చేయొద్దు

స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డుల‌కు బ్యాంకులు, బ్రోక‌రేజ్ సంస్థ‌లు రుణాలు ఇస్తాయి. ఇది విన‌డానికి బాగానే ఉన్నా, ఇందులో చాలా రిస్క్ దాగి ఉంది. అయితే అప్పు తీసుకొని మ‌రీ స్టాక్ కొనుగోలు చేసిన‌ప్పుడు అది న‌ష్టపోతే అస‌లు న‌ష్ట‌పోవ‌డంతో పాటు బ్యాంకు లేదా బ్రోక‌రేజ్ సంస్థ‌కు చెల్లించాల్సిన వ‌డ్డీ పెరుగుతుంది. అయితే పెట్టుబ‌డుల‌లో అనుభ‌వం, మార్కెట్ల ప‌నితీరుపై అవ‌గాహ‌న క‌లిగిన‌వారు, క‌చ్చితంగా రాబ‌డి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడు ఇలా చేయ‌డం పెద్ద రిస్క్ ఏమీ కాదు.

  1. పెట్టుబ‌డుల విష‌యంలో ఇత‌రులు చెప్పింది న‌మ్మ‌కండి

స్నేహితులు లేదా మీ చుట్టూ ఉన్న‌వాళ్లు చెప్పింది విని పెట్టుబ‌డులుకు సిద్ధం కావొద్దు. ఒక‌రు ఒక స్టాక్ కొనుగోలు చేసినందుకు లాభ‌ప‌డ్డారు కాబ‌ట్టి అదే షేరును కొనుగోలు చేయాల‌ని అనుకోవ‌ద్దు. అది చాలా త‌ప్పు. స్టాక్ కొనుగ‌లో చేసేముందు జాగ్ర‌త్త‌గా అందులో ఉన్న రిస్క్ గురించి విశ్లేషించాలి. అర్థం కాక‌పోతే దాని జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది.

  1. అన్ని ఒకే స్టాక్‌లో పెట్టుబ‌డులు పెట్టొద్దు

మొత్తం డ‌బ్బును ఒకే దాంట్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది కాదు. పోర్ట్‌ఫోలియోలో వివిధ స్టాక్‌ల‌కు సంబంధించిన పెట్టుబ‌డుల‌కు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోండి. ఇలా చేస్తే రిస్క్ త‌గ్గి రాబ‌డికి ఆస్కారం ఉంటుంది. కొన్నింటిలో న‌ష్ట‌పోయినా కొంత లాభం పొందే అవ‌కాశం ఉంటుంది. అయితే ఎక్కువ‌గా స్టాక్‌లు కొనుగోలు చేయ‌డం కూడా త‌ప్పే. ప‌రిమితికి మించి కొంటే రిస్క్ త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ వృద్ధి అంత‌గా ఉండ‌దు.

  1. క్ర‌మ‌మైన పెట్టుబ‌డి విధానాన్ని ఎంచుకోండి

మార్కెట్ల ఒడుదొడుకుల‌ను బ‌ట్టి కొంద‌రు పెట్టుబ‌డుల‌ను మార్చేస్తుంటారు. అయితే ఇది అంత మంచి ప‌ద్ధ‌తి కాద‌ని నిపుణుల సూచ‌న‌. క‌ష్ట‌ప‌డి సంపాధించిన డ‌బ్బు పోగొట్టుకునే అవ‌కాశంఉ ఉంది. మార్కెట్ల‌లో ఎప్పుడు లాభాలు వ‌స్తాయో న‌ష్ట‌పోతామో క‌చ్చితంగా చెప్ప‌డం క‌ష్టం. కానీ, దీర్ఘ‌కాలీకంగా పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే మాత్రం లాభ‌లు పొంద‌వ‌చ్చు. స‌రైన స‌మ‌యంలో క్ర‌మ ప‌ద్ద‌తిలో పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల‌ను పొంద‌చ్చు. దీనికి కొంత ఓపిక అవ‌స‌రం. వెంట‌నే లాభాల‌ను ఆశించ‌డం స‌రికాదు.

  1. అత్యాశ‌, భ‌యం ప‌నికిరావు

మార్కెట్లో పెట్టుబ‌డుల‌కు అత్యాశ‌, భ‌యం ప‌నికిరావు. ఏదైనా ఒక స్టాక్‌లో పెట్టుబ‌డి చేసి న‌ష్ట‌పోయిన‌ట్లు ఎవ‌రైనా చెప్తే అదేవిధంగా భావించ‌వ‌ద్దు. వారు తీసుకునే త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను బ‌ట్టి కూడా న‌స్ట‌పోయేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ భ‌యం నుంచి ముందు బ‌య‌ట‌ప‌డాలి. ఒక స్టాక్ లో పెట్టుబ‌డులు పెడితే భారీగా లాభం వ‌చ్చింద‌ని ఎవ‌రో చెప్తే అత్యాశ‌కు వెళ్లి అందులో ఉన్న రిస్క్ తెలుసుకోకుండా పెట్టుబ‌డులు చేయ‌వ‌ద్దు. అదేవిధంగా మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌డు ఆందోళ‌న‌ల‌కు గురి కావొద్దు. షేర్లు అమ్ముకోవ‌ద్దు. దీర్ఘ‌కాలికంగా పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే లాభం పొందే అవ‌కాశం ఉంటుంది.

  1. అంచ‌నాలు మించొద్దు

మీ పెట్టుబ‌డుల‌పై ఫ‌లితాల‌ను ఆశించ‌డం త‌ప్పు కాదు. కానీ, అవి ఎక్కువ‌గా ఊహాజ‌నితంగా ఉండొద్దు. గ‌త కొన్నేళ్ల నుంచి చాలా వ‌ర‌కు మార్కెట్లు భారీ లాభాల‌నే అందిస్తున్నాయి. అయితే ఎప్పుడు లాభాలు వ‌స్తాయ‌నే అనుకోడం త‌ప్పు. మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ ధ‌ర ఎక్కువ‌గా ఉంద‌ని అనిపిస్తే, తక్కువ ధ‌ర క‌లిగిన మంచి షేర్ల‌ను కొనుగోలు చేయండి. మీ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడూ ప‌రిశీలిస్తూ గ‌మ‌నిస్తుండాలి. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా స్టాక్ మార్కెట్ల‌పై ప్ర‌భావం ఉంటుంది. కాబ‌ట్టి ఎప్పుడూ స్టాక్ మార్కెట్‌ను, మీ షేర్ల‌ను గ‌మనిస్తుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని