Motor Insurance: వాహన బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌.. తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రమాదం గురించి బీమా సంస్థ‌కు ఆల‌స్యం చేయ‌కుండా తెలియ‌చేయాలి.

Updated : 18 Aug 2022 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోటారు వాహనాలపై ప్రయాణం ఎంత సాఫీనో ప్ర‌మాదాలు కూడా పొంచే ఉంటాయి. ఈ కార‌ణం చేత ఏ మోటారు వాహ‌నానికైనా బీమా త‌ప్ప‌నిస‌రి. అందుచేత‌నే కొత్త వాహ‌నానికి బీమా లేనిదే రోడ్ల‌పై ప్ర‌యాణించ‌డానికి వీలులేద‌ని మోటారు డీల‌ర్లకు ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు విధించింది. ఏ మోటారు వాహ‌నానికైనా 1988 మోటారు వాహ‌న చ‌ట్టం ప్ర‌కారం థ‌ర్డ్ పార్టీ బీమాను క‌లిగి ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే, ఇది మోటారు వాహ‌నానికి జరిగే నష్టాన్ని భర్తీ చేయలేదు. అందువ‌ల్ల‌, స‌మ‌గ్ర మోటారు బీమా ఉండ‌టం మంచిది. ఈ ర‌క‌మైన బీమా మీ వాహ‌నానికి దొంగ‌త‌నం, ప్ర‌కృతి వైప‌రీత్యాలు, ఏదైనా డ్యామేజీ, ఇత‌ర దుర్ఘ‌ట‌నల వ‌ల్ల‌ సంభ‌వించే మ‌ర‌ణం వంటి ప‌రిస్థితుల నుంచి రక్షణ ఇస్తుంది. ప్ర‌మాదం లేదా విప‌త్తు కార‌ణంగా మోటారు వాహనానికి నష్టం వాటిల్లితే.. పాల‌సీదారు బీమా సంస్థ‌ను క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం అభ్యర్థించొచ్చు. పాల‌సీని ఎలా కొనుగోలు చేసినా ఈ క్లెయిమ్ ప్ర‌క్రియ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా చేయొచ్చు. క్లెయిమ్‌కు సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బీమా కంపెనీకి వెంట‌నే తెలియ‌జేయాలి

ప్రమాదం గురించి బీమా సంస్థ‌కు ఆల‌స్యం చేయ‌కుండా తెలియ‌జేయాలి.  ప్రమాదం జరిగాక వీలైనంత త్వరగా క్లెయిమ్‌ ఫైల్ చేయండి. ఈ ప‌ని నిర్ణీత స‌మ‌యంలోనే చేయాలి. లేదంటే క్లెయిమ్ తిరస్క‌ర‌ణ‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంది. ఆన్‌లైన్‌లో ఫైల్ చేసిన‌ట్ల‌యితే వినియోగ‌దారుని వాహ‌న సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ కాపీ, డ్రైవింగ్ లైసెన్స్ మొద‌లైన రుజువులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఫోటోల‌ను తీసి వీడియోగా త‌యారు చేసుకోవ‌డం మంచిది. క్లెయిమ్ స‌మ‌యంలో బీమా సంస్థ వీటిని కోరొచ్చు.

నెట్‌వ‌ర్క్ గ్యారేజీల‌ను సంప్ర‌దించండి

ఒక‌సారి ప్ర‌మాద స‌మాచారం అందించిన త‌ర్వాత‌ బీమా కంపెనీ నిర్దేశించిన విధంగా దెబ్బ‌తిన్న కారుని స‌మీపంలోని నెట్‌వ‌ర్క్ గ్యారేజీకి తీసుకెళ్లొచ్చు. మీరు నెట్‌వ‌ర్క్ గ్యారేజీలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ద‌ర‌ఖాస్తు ఫారంని తీసుకోవాలి. న‌ష్టాన్ని అంచ‌నా క‌ట్ట‌డానికి బీమా కంపెనీ ఒక స‌ర్వేయ‌ర్ను నియమిస్తుంది. చివ‌రిగా సర్వీసు స్టేష‌న్ నుంచి రిపేర్ ర‌సీదు  ప‌త్రాన్ని తీసుకోండి.

ప్రమాదం లేదా న‌ష్టానికి సంబంధించిన రుజువు

క్లెయిమ్ కోసం రీయింబ‌ర్స్‌మెంట్ పొంద‌డానికి వాహ‌నానికి జ‌రిగిన న‌ష్టాన్ని ఫోటోగ్రాఫ్‌ల రూపంలో సాక్ష్యం సేక‌రించ‌డం చాలా అవ‌స‌రం. అలాగే ప్ర‌మేయం ఉన్న ఇత‌ర వ్య‌క్తులు, సాక్షుల పేర్లు, సంప్ర‌దింపుల వివ‌రాల‌ను రికార్డు చేయండి. ఈ స‌మాచారం ప్ర‌మాదాన్ని ధ్రువీక‌రిస్తుంది. ప‌రిహారం స‌మ‌యంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పోలీసు ఎఫ్ఐఆర్ కాపీ కూడా బీమా సంస్థ‌కు స‌మ‌ర్పించాలి. వాహ‌నం క‌న‌ప‌డ‌కుండా పోతే పోలీసు అధికారుల నుంచి ‘నో-ట్రేస్ స‌ర్టిఫికెట్’ పొందాలి.

క్లెయిమ్ ర‌కాన్ని నిర్ణ‌యించండి

క్లెయిమ్ పాలసీదారు  క్లెయిమ్ చేసిన మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియం లో 'నో క్లెయిమ్ బోనస్' కోల్పోవచ్చు. అందువ‌ల్ల చిన్న చిన్న ప్రమాదాలకు క్లెయిమ్ చేయకపోవడమే మేలు. 

నిజాలు దాచొద్దు

బీమా కంపెనీ ద‌గ్గ‌ర వాస్త‌వాలు దాయ‌కూడ‌దు. క‌ల్పిత విష‌యాలు తెలియ‌జేయ‌కూడ‌దు. అలా చేస్తే, దాన్ని మోసంగా ప‌రిగ‌ణిస్తారు. బీమా కంపెనీ క్లెయిమ్‌ని తిరస్కరించే అవకాశాలు ఎక్కువ.

పాల‌సీ పత్రాన్ని పూర్తిగా చ‌ద‌వండి

క్లెయిమ్ కోసం ఫైల్ చేస్తున్న‌ప్పుడు, సెటిల్‌మెంట్ ప్ర‌క్రియ‌, క‌వ‌రేజీ ప‌రిధి లాంటి వాటిని అర్థం చేసుకోవ‌డానికి పాల‌సీ పత్రాన్ని జాగ్ర‌త్త‌గా చ‌ద‌వండి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని