Motor Insurance: వాహ‌న బీమా గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

మోటారు వాహ‌నాల చ‌ట్టం ప్ర‌కారం థ‌ర్డ్‌-పార్టీ బీమా క‌వ‌ర్‌ను పొంద‌డం త‌ప్ప‌నిస‌రి.

Updated : 17 Sep 2022 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కారు కొనుగోలు చేయ‌డం అనేది చాలా మందికి ఒక‌ప్పుడు ప్ర‌ధాన ఆర్థిక‌, దీర్ఘ‌కాల నిర్ణ‌యాల్లో ఒక‌టిగా ఉండేది. కానీ ఇప్పుడు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆదాయాలు పెర‌గ‌డం, సంపాదించే వారు ఇంటికి ఇద్ద‌రు, ముగ్గురు ఉండ‌డంతో కార్లు కొనేవారి సంఖ్య పెరిగింది. 2022 ఆగ‌స్టు నెల‌లోనే 3 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కార్లు అమ్ముడ‌య్యాయ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. అంతే కాకుండా ఇప్పుడు పాత కార్ల మార్కెట్ కూడా భార‌త్‌లో చాలా పెద్ద‌ద‌య్యింది. మంచి ర‌న్నింగ్ కండిష‌న్‌లో ఉన్న పాత కార్లు రూ. 2 ల‌క్ష‌ల నుంచి కూడా ల‌భిస్తున్నాయి. దీంతో పాత కార్లు కొంటున్న‌వారి సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరిగింది. అయితే, కారు కొనేట‌ప్పుడు బీమా చేయించుకోవ‌డంలో ఉండే శ్ర‌ద్ధ.. బీమాను పున‌రుద్ధ‌రించుకోవ‌డంలో ఉండ‌డం లేదు. వాహ‌నాన్ని కాపాడుకోవ‌డానికి, మోటారు బీమాను సాధ్య‌మైనంత వేగంగా పున‌రుద్ధ‌రించుకోవ‌డం చాలా ముఖ్యం.

కారుకు బీమా లేక‌పోతే ఏమ‌వుతుంది?

మోటారు వాహ‌నాల చ‌ట్టం ప్ర‌కారం.. థ‌ర్డ్‌-పార్టీ బీమా క‌వ‌ర్‌ను పొంద‌డం త‌ప్ప‌నిస‌రి. బీమా లేని వాహ‌నాన్ని న‌డ‌ప‌డం వ‌ల్ల మొద‌టి సారి రూ.2,000 జ‌రిమానా లేదా జైలు శిక్ష ఎదుర్కోవాలి. మ‌ళ్లీ బీమా లేకుండా ప‌ట్టుబ‌డితే జ‌రిమానా రెట్టింప‌వుతుంది. థ‌ర్డ్ పార్టీ బీమా కూడా లేని స‌మ‌యంలో కారు మూలంగా ఇత‌ర వ్య‌క్తులు ప్ర‌మాదానికి లోన‌యితే ఆసుప‌త్రి ఖ‌ర్చులు, ఇత‌ర న‌ష్ట‌ప‌రిహారాలకు సొంతంగా బాధ్య‌త వ‌హించాలి. బీమా ప్రీమియంతో పోల్చుకుంటే ఈ బాధ్య‌త‌లు ఆర్థికంగా అప‌రిమితంగా ఉండే అవ‌కాశం ఉంది.

థ‌ర్డ్ పార్టీ బీమా క‌వ‌ర్ స‌రిపోతుందా?

థ‌ర్డ్ పార్టీ బీమా మోటారు వాహ‌నానికి న‌ష్టం జ‌రిగితే క‌వ‌ర్ చేయ‌దు. అందువ‌ల్ల‌, ఈ న‌ష్టాల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి స‌మ‌గ్ర మోటారు బీమా ఉండ‌డం మంచిది. ఈ ర‌క‌మైన బీమా మీ వాహ‌నానికి దొంగ‌త‌నం, ప్ర‌కృతి వైప‌రీత్యాలు, ఏదైనా డ్యామేజీ, ఇత‌ర దుర్ఘ‌ట‌నల వంటి ప‌రిస్థితుల నుంచి క‌వ‌రేజీ ఇస్తుంది.

దీర్ఘకాలానికి బీమా

2018 త‌ర్వాత వాహ‌నాలు కొనుగోలు చేసేవారు దీర్ఘ‌కాలిక బీమా పాల‌సీ తీసుకునేలా ప్ర‌భుత్వం చ‌ట్టం రూపొందించింది. కార్ల‌కు 3 సంవ‌త్స‌రాలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు 5 ఏళ్ల‌కు బీమా ప్రీమియంను ఒకేసారి చెల్లించి తీసుకోవ‌చ్చు. ఈ బీమాను మీరు స్వ‌యంగా పొందొచ్చు లేదా మోటారు డీల‌ర్ల వ‌ద్దే వివిధ బీమా కంపెనీల బీమా కొనుగోలు అవ‌కాశం ఉంటుంది. బీమా లేనిదే  మోటారు డీల‌రు వాహ‌నాన్ని డెలివ‌రీ ఇవ్వ‌రు.

పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ

కారుకు మొద‌టిసారి బీమా పాల‌సీ ఎక్క‌డ చేసినా రెన్యువ‌ల్ చేసేట‌ప్పుడు గ‌డువు తేదీకి ముందే మీ బీమా పాల‌సీను మీరే స్వ‌యంగా పున‌రుద్ధ‌రించుకోవాలి. బీమా కంపెనీలు ఒక నెల ముందు నుంచి మీ ఫోనుకు ఎస్ఎంఎస్‌, మెయిల్ ఐడీకి మెసేజ్‌ను పంపుతాయి. బీమాను పున‌రుద్ధ‌రించుకోవాల‌ని కోర‌తాయి. వారు పంపే మెయిల్ లింక్‌ల ద్వారా కూడా బీమా పాల‌సీని పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో బీమా చెల్లింపులు చేయ‌డం చాలా సుల‌భం. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క‌్రెడిట్ కార్డు ద్వారా లేదా బీమా సంస్థ శాఖ కార్యాల‌యంలో కూడా బీమాను ప్రీమియంను చెల్లించి పాల‌సీ పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు.

నో క్లెయిమ్ బోన‌స్ (NCB)ను పొందొచ్చు

పాల‌సీ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు, వాహనంపై ఎటువంటి బీమా క్లెయిమ్‌లు చేయ‌క‌పోతే, బీమా పున‌రుద్ధ‌ర‌ణ స‌కాలంలో చేసుకున్న‌ప్పుడు నో క్లెయిమ్ బోన‌స్ పొందొచ్చు. ఈ త‌గ్గింపు 15-20% నుంచి 50% వ‌ర‌కు కూడా ఉంటుంది.

క్లెయిమ్ ప్రక్రియ

ప్ర‌మాదం లేదా విప‌త్తు కార‌ణంగా మోటారు వాహ‌నం పాడైన‌ట్ల‌యితే పాల‌సీదారు న‌ష్ట‌ప‌రిహారానికి బీమా సంస్థ‌ వద్ద క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఫైల్ చేయ‌వ‌చ్చు. పాల‌సీను ఎలా కొనుగోలు చేసినా ఈ క్లెయిమ్ ప్ర‌క్రియ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా చేయ‌వ‌చ్చు.

చివ‌రిగా: స‌మ‌గ్ర‌ బీమాకు అనేక రైడ‌ర్‌లు జ‌త చేస్తే మోటారు వాహ‌నానికి అనేక ర‌క్ష‌ణ‌లు క‌ల్పించ‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని