Refurbished Electronics: రీఫర్బిష్డ్‌ వస్తువుల్ని కొంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!

ధర తక్కువున్నంత మాత్రాన రీఫర్బిష్డ్‌ వస్తువుల్ని తొందరపడి కొనొద్దు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఆశించిన స్థాయిలో అది పనిచేయకపోవచ్చు.

Updated : 08 Nov 2022 11:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్బు ఆదా చేసుకోవడంలో భాగంగా కొంతమంది రీఫర్బిష్డ్‌ అంటే పునరుద్ధరించిన లేదా మరమ్మతు చేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను కొంటుంటారు. ఒక్కోసారి మనం కావాలనుకున్న పరికరం మార్కెట్‌లో అందుబాటులో లేకపోయినా ఇలాంటి ఉత్పత్తుల్ని కొనాల్సి వస్తుంటుంది. అయితే, ఇలా ఒకసారి మరమ్మతు చేసిన వస్తువుల్ని కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కంటే ముందే దాన్ని ఇంకొకరు ఉపయోగించిన నేపథ్యంలో దాని స్థితిని తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. మరి రీఫర్బిష్డ్‌ ప్రొడక్ట్స్‌ కొనే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేంటో చూద్దాం..

మరమ్మతు చేసిందా లేక ఓపెన్‌-బాక్స్‌ రిటర్నా?

కొంతమంది ఏదైనా వస్తువును ఆర్డర్‌ చేసిన తర్వాత కేవలం ప్యాకింగ్‌ ఓపెన్‌ చేసి వెంటనే రిటర్న్‌ చేస్తుంటారు. ఇలా ఉపయోగించకుండానే తిప్పి పంపిన వస్తువులను ఓపెన్‌-బాక్స్‌ రిటర్న్‌ ప్రోడక్ట్స్‌ అంటుంటారు. వస్తువులో ఎలాంటి లోపాలు లేకపోయినప్పటికీ.. వినియోగదారుడికి నచ్చకపోవడం వల్లనో లేక ప్యాకింగ్‌తో కస్టమర్‌ సంతృప్తి చెందకపోవడం వల్లనో దాన్ని రిటర్న్‌ చేస్తుంటారు. అలాంటి వాటిని తిరిగి కొత్త వస్తువులుగా అమ్మడానికి వీలుండదు. అదే రీఫర్బిష్డ్‌ అంటే.. పరికరంలో ఉన్న లోపాన్ని సరిచేసి తిరిగి విక్రయిస్తారు. అందుకే కొనేముందు విక్రేతల్ని ఓపెన్‌-బాక్స్‌ రిటర్న్‌ వస్తువులున్నాయేమో ఆరా తీయండి. రీఫర్బిష్డ్‌ కంటే ఇవి ఉత్తమం. అయితే, అది ఓపెన్‌-బాక్స్‌ రిటర్న్‌ అని మీరు గుర్తించగలగాలి. అలాగే దానికి కావాల్సిన ఆధారాల్ని అడిగి ధ్రువీకరించుకోవాలి.

ఎవరు పునరుద్ధరించారు?

తయారు చేసిన కంపెనీలే వస్తువుల్ని పునరుద్ధరించి రీఫర్బిష్డ్‌ కింద విక్రయిస్తుంటాయి. అలాంటి పరికరాలకు సరైన హామీ ఉండే అవకాశం ఉంటుంది. పైగా కావాల్సిన విడి భాగాలు వారి వద్ద అందుబాటులో ఉంటాయి గనుక నాణ్యత విషయంలోనూ ఢోకా ఉండదు. యాపిల్‌, డెల్‌, శాంసంగ్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి బడా కంపెనీలు రీఫర్బిష్డ్‌ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నాయి. థర్డ్‌ పార్టీ కంపెనీలు కూడా ఎలక్ట్రానిక్‌ పరికరాలను మరమ్మతు చేసి విక్రయిస్తుంటాయి. అయితే, ఇవి ఎంత వరకు నమ్మదగినవో చూసుకోవాలి. కొంత తక్కువే ధరకే లభిస్తున్నప్పటికీ.. నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.

అన్నీ ఉన్నాయా?

మీరు ఒక రీఫర్బిష్డ్‌ ఫోన్‌ కొంటున్నారంటే ఛార్జర్‌, ఇయర్‌ బడ్స్‌ కూడా దాంతో పాటే రావాలి. లేదంటే వాటిని సపోర్ట్‌ చేసే విడిభాగాలు బయట దొరక్కపోవచ్చు. లేదై ఏమైనా లోపం ఉండడం వల్ల వాటిని విక్రేతలు అందించకపోయి ఉండొచ్చు. అందుకే మనం ఏ వస్తువును ఆర్డర్‌ చేసినా.. దానికి కావాల్సిన విడిభాగాలు కూడా అందేలా చూసుకోవాలి. ఆర్డర్‌ చేయడానికి ముందే విక్రేతల నుంచి దీనికి సంబంధించి సరైన హామీని తీసుకోవాలి. అన్ని ఉంటాయంటేనే కొనాలి. అయితే, ఐఫోన్‌ వంటి ఓపెన్‌-బాక్స్‌ రిటర్న్‌ ఉత్పత్తులకు ఛార్జర్‌, ఇయర్‌ బడ్స్‌ వంటివి రాకపోవచ్చు.

వారెంటీ ఉందా?

మరమ్మతు చేసి కొత్తగా పునరుద్ధరించిన వస్తువులకు సైతం వారెంటీ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆశించినంత కాలం అవి పనిచేయకపోవచ్చు. కొన్నిసార్లు వస్తువును కొత్తగా కొన్నప్పుడు వచ్చిన వారెంటీతోనే రీఫర్బిష్డ్‌ ప్రొడక్ట్స్‌ను ఇచ్చేస్తుంటారు. అంటే కొత్త వస్తువు 5 ఏళ్ల వారెంటీతో వచ్చిందనుకుందాం. దాన్ని మూడేళ్ల తర్వాత రీఫర్బిష్డ్‌ చేస్తే మరో రెండేళ్ల వారెంటీతో తిరిగి విక్రయిస్తారు. కానీ, ఇలా ఒకసారి మరమ్మతు చేసిన వాటికి కంపెనీ వారెంటీ వర్తించకపోవచ్చు. కొత్తగా రీఫర్బిష్‌ చేసిన తర్వాత కూడా సదరు కంపెనీయే వారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు వారెంటీ లేకుండా ఉన్న వస్తువులను కొనకపోవడమే ఉత్తమం. మీరు కొన్నప్పుడు అవి బాగానే పనిచేస్తున్నా.. కొంతకాలం తర్వాత మొరాయించే అవకాశం ఉంది.

ఏ స్థితి నుంచి పునరుద్ధరించారు?

రీఫర్బిష్డ్‌ ఉత్పత్తుల్ని విక్రయించేటప్పుడు అన్ని కంపెనీలు చెప్పే మాట.. కొత్త వాటిలా తీర్చిదిద్దామని. అంత వరకు బాగానే ఉన్నా.. అసలు ఏ స్థితి నుంచి దాన్ని కొత్తగా తీర్చిదిద్దారో తెలుసుకోవాలి. పూర్తిగా పాడైన వస్తుల్ని పునరుద్ధరించారా? లేక కేవలం ఫిజికల్‌ డ్యామేజ్‌ అయిన పార్ట్స్‌ని మార్చి విక్రయిస్తున్నారా? వంటి వివరాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు.. ఓ మూడేళ్లు వాడిన ఫోన్‌ స్క్రీన్‌  పగిలిపోయిందనుకుందాం. దాన్ని వినియోగదారుడు కేవలం ఆ ఒక్క సమస్యతోనే విక్రయించేస్తాడు. కంపెనీలు ఆ స్క్రీన్‌ను మార్చేసి రీఫర్బిష్డ్‌ కింద అమ్మేస్తుంటాయి. కానీ, అప్పటికే మూడేళ్ల పాటు వినియోగించినందున లోపలి విడి భాగాల పనితీరు కూడా దెబ్బతిని ఉండొచ్చు. అందుకే ఏ స్థాయి నుంచి దాన్ని పునరుద్ధరించారనేది తెలుసుకుంటే మనకు ప్రోడక్ట్స్‌ లైఫ్‌పై ఓ స్పష్టత ఉంటుంది.

రిటర్న్‌ పాలసీ ఏంటి?

కొత్త వస్తువుల తరహాలోనే రీఫర్బిష్డ్‌ వాటిని సైతం రిటర్న్‌ చేయాల్సి రావొచ్చు. ఒకవేళ మీరనుకున్న స్థాయిలో ప్రోడక్ట్‌ లేకపోతే తిప్పిపంపక తప్పదు. అందుకే రిటర్న్‌ పాలసీని ముందే తెలుసుకోవాలి. అసలు రిటర్న్‌ తీసుకుంటారా? ఎన్ని రోజుల వరకు రిటర్న్‌ అవకాశం ఇస్తారు? వంటి వివరాలు తెలుసుకోవాలి.

ఇలాంటివి కొనకపోవడమే మంచిది!

నేరుగా శరీరాన్ని తాకే హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ వంటి వాటిని ఆరోగ్యరీత్యా కొనకపోవడమే ఉత్తమం. కీబోర్డ్స్‌, మౌస్‌ల వంటి స్వల్పకాల లైఫ్‌ ఉండే వాటిని సైతం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. హార్డ్‌ డ్రైవ్‌లను సైతం కొనొద్దు. వాటిని పూర్వస్థితికి అంటే ఫ్యాక్టరీ సెట్టింగ్‌కి రీసెట్‌ చేయడం సాధ్యం కాకపోవచ్చు. రీఫర్బిష్డ్‌ టీవీలను కూడా కొనొద్దని నిపుణుల సూచన. అవి ఎంత పాతవో చెప్పడం అంత సులభం కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని